Friday 31 July 2020

శ్రీరామ జయరామ శృంగార రామ! నా ---

సీసమాలిక
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- భారమ్ము మోసెడి భవ్యనామ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- జిహ్వ రుచిని బెంచు జిష్ణురూప !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- పై దయ గురిపించు పరమ పురుష !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- యజ్ఞాన మంతయు నడుచు సామి !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- చింతలు బాపెడి చిన్మయుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా ---తాపత్రయము ద్రుంచు తామస హర !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- దోషమ్ము దొలగించు దురిత హరణ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- భవ భయమును ద్రుంచు భక్తపాల !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- గురువు దైవము నీవె సురవర నుత !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- బలుకు లందు గరిమ పద్మనాభ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- బాటను నిల్చెడి హాటక ధర !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- సామర్థ్యమును బెంచు సత్కృపాల !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- పాపమ్ములను ద్రుంచు పాపనాశ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- శాత్రవ గణనాశ శాబ్దికుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- కావ్య యజ్ఞపు కర్త క్ష్మావరేశ!
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- కీర్తిని బెంచెడి కేశవుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- మనసు దెలిసి బ్రోచు మాధవుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- చెలికాడ వందురా శేషశయన !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా -- జేబట్టి రక్షించు శ్రీకరుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- దిక్కు నీవేనయ్య దేవదేవ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- పరితాప సంహార వనవిహార!
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- శోక నివారణ సోమసింధు !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- దరిజేరు హరియన తాత తాత !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా -- విజయమెల్లను నీవె విశ్వ రూప!
రామనామమ్ము సజ్జన రంజకమని
జేరితి విరక్తితో ముక్తి కోరుకొనుచు
కందుల వరప్రసాదు హృన్మందిరస్థ !
భక్త మందార! శ్రీరామ! భవ్య తేజ!

తక్కువేమి మనకు సీసమాలిక

తక్కువేమి మనకు* అను చరణము తో
*సీసమాలిక*
తక్కువేమి మనకు? దనుజ సోమకుని జంపిన మత్స్య రూపుడు వెలుగు జూప!
తక్కువేమి మనకు? దమనుండు కూర్మావతారుడై దయ జూప ధరణిపైన!
తక్కువేమి మనకు? దానవారి వరాహమూర్తియై దరిజేర ముదిఁమి నందు!
తక్కువేమి మనకు? చెక్కలుగ హిరణ్యకశిపుని జీల్చిన కపిలుడుండ!
తక్కువేమి మనకు? ఒక్కడుగున భువిఁ గొల్చిన వామనుఁ కూర్మి నిడగ!
తక్కువేమి మనకు? దండించ క్షత్రియుల పరశురాముడై రక్తుడుండ !
తక్కువేమి మనకు? ధరలో దశరథ నందనుడు తమ్ముని గూడి దరికి జేర!
తక్కువేమి మనకు? దయ గల బలరాముఁ మనబలమై యుండ మండలమున!
తక్కువేమి మనకు? తన మాయలెల్ల జూపంగను కృష్ణుడు ప్రక్క నుండ!
తక్కువేమి మనకు? ధరణి భారము ద్రుంచు కల్క్యావ తారుడు కరుణ జూప!
తక్కువేమి మనకు? చిక్కిన చిన్మయ రూపుడు చింతలు బాపగ మరి!
తక్కువేమి మనకు? ప్రక్కన తోడుగ వానర సేనతో వరలు చుండ!
తక్కువేమి మనకు? దిక్కని నమ్మిన వారిని నిక్కము జేరుచుండ!
తక్కువేమి మనకు? అక్కఱ గండడు సద్భక్త తతులకు శక్తి నిడగ!
తక్కువేమి మనకు? ధరణీభృతుడు భక్త వరుల గాచ శరము బట్టి యుండ!
తక్కువేమి మనకు? మక్కువ తోడను కన్నతండ్రి వలెను కామ్యములిడ!
తక్కువేమి మనకు? రాము డొక్కడున్న
జాలు తలపున కలతలు సద్దుమణుగు
విషము జిమ్ము కరోనయే విధిని వేడు !
మదిని నిలుపు సుధాముని మరులు గొనుచు!

నగ సీసము

నగ సీసము
అంటే (నగణము పై గురువు తో)
మఱుగు జొచ్చిన, సుధామ! సురులెల్ల నిను గాంచిరట నీదు కృపచే స్థిరముగాను
మఱుగు జొచ్చిన, సుధామ! ముని మాన్యులకు దర్శన మొసంగితివి గారవముతోడ!
మఱుగు జొచ్చిన, సుధామ! నరులెల్ల సుఖశాంతులను బొంద విని నే దురితమందు!
మఱుగు జొచ్చితి, సుధామ! మరి దాసునకు నిన్ను గను టెప్పుడుర మాన్యుడిలలోన !
కరము నందించు వేగమే కామ్య వరద!
సిరులు కోరను శ్రీవత్స సిగ్గు విడచి !
మరులు గొంటిని రక్షకా మాన్య చరిత!
దరిని నిల్చు వరము నిడు ధర్మనిరత!
*మఱుగు జొ* *చ్చిన, సుధా* *మ! సురులె* *ల్ల నిను గాం* *చిరట నీ* *దు కృపచే* *స్థిరముగా* ను ఇలా



వజ్రహార వృత్తము

వజ్రహార వృత్తము
1,3 పాదాలు హానహాన హాహా హా గ గణములు
2,4 పాదాలు హాహాహా న హాహాహా గ గణములు
తిమ్మగలిగి చూడ విదుడ * దేవదేవునింటనన్
కొమ్మలైన రీతి రిపులు * గూడి యుండె రర్మిలిన్
నమ్మి, యెలుక, పాము ,జటిల * నంది కూర్మినొందగన్
అమ్మ బిడ్డలైన జనులు *హద్దు మీరు టేలనో?
తిమ్మ = నెమ్మది, విదుడు = తెలివైన వాడు, అర్మిలి = ప్రేమ,
నమ్మి = నెమలి, జటిలము = సింహము.
భావము :-
దేవదేవుని ఇంట నెమలి, ఎలుక, పాము , సింహము మరియు నంది ప్రేమ కలిగి శాఖలవలే మేము వేరైనా మూలము ఒకటే అంటుంటే ఒకే తల్లి బిడ్డలమైన జనులు కొట్లాటకు పోవడం ఏమిటో?

అష్టవిధ నాయికలు, సీసమాలికలు

స్వాధీనపతిక ( అష్టవిధ నాయికలు)
గుణవంతుడైనట్టి కుంభుడు మగడాయె నీభాగ్య మేమందు నిరతిగాను
నీ నోము ఫలియించి, నీక్కల లాయెను నీకల లెల్లను నీలవేణి
పలికిన సకినాన పతివచ్చెను గదవె తలచంగను విభుడు దానువచ్చె
నెల్లగా కోరిక లీడేరు నీఱేయి తొల్లిటి పూజలు మెల్లగాను
తుదకెక్కు, వేచిన తుమ్మెద మ్రోతకు నెరవేరు నీ యిచ్ఛ నిండుగాను
మక్కువ తోడను చక్కని పంతము చేకూరు రమణుడు చెంత నుండ
కురుల సిరులతోడ కొంటె తనమ్మును మెల్లమెల్లగ జూపు మేను నిమిరి
కనుచూపులందున కదలకుండ గజేసి సెగలు రేపెడి కాంక్ష చిత్తు జేయ
తేటగీతి
ఘనుడు స్వాధీన భర్తృక ఘనము గాను
పడకటిల్లు వేవేగమే పదిల పఱచి
నచ్చినట్టి చీరను గట్టి, వచ్చియున్న
పతికి స్వాదిమ బల్కుల స్వస్థత నిడు!

వాసజసజ్జక

చక్కని చెక్కెలిన్ మక్కువ తోడను ముద్దు లాడు కురులు సద్దు జేయ
కొప్పులోని విరులు కొంటెగా బిలువంగ సుదతి యందము వేగ జూడ వచ్చె
కంఠాభరణములు కనువిందు జేయంగ సరములు గుబ్బల సరస జేరె
చెక్కుటద్దపు మోము చెలిమికై సౌందర్య మరయంగ సాంబ్రాణి యత్తరులను
పూలపానుపు పైన పొంక మలరగను జల్లి లెక్కించుచు జాజిమల్లె
పూలతో ఘడియలన్ పొలతి పడకగది యందు దన ప్రియుని పొందు కోరి
వెన్నెల రాతిరి వేడుక మది నిల్పి యామిని తోడుగా నామె బిలచె
పతి రాకకై వేచి పాన్పున శయనింప! చిలుక బలికె నిట్లు శీఘ్రముగను
వినుము వాసజసజ్జక బేలవైతి
వేల యద్దరి నుండెనె బాల రాజు
వచ్చు చుండె నీ దరిజేర వడివడిగను
స్వాగతమ్ము బలుక లెమ్ము సంతసమున!

*విరహోత్కంఠిత*
తడవ తడవకును తలపు లందు నిలపి క్షణమొక యుగముగా గడపుచున్న
తడియారని శిలైన తనువు తోడ తరుణి వెదకు చుండె గనుల ప్రియుని కొరకు
మాటవినని చీర మాటిమాటికి జార కోపమ్ము హెచ్చెను కొంగు పైన
అర్థ చీరను దీసి యారబోసె నచట కొంగు చాటు వగలు కొంటెగాను
నాట్యభంగిమ లెల్ల నా రాజు జూడక యేమి ఫలమనుచు నేవగించి
విడిది జేసిన యట్టి విరహాగ్ని యీవేళ నిలువెల్ల దహియించె నిశ్చలముగ
పరిపరి విధముల పైటను జార్చుచున్ రాకుండెను సఖుడీ రాత్రి వేళ
నిట్టూర్పు నుయ్యాల చుట్టు ముట్టె గదర చెప్పరాని వలపు చింతలెల్ల
దీర్చుము విరహోత్కంఠిత దిగులు నెల్ల
ప్రాణసఖ మోసగించగ పాడి గాదు
వొప్పుగా నిను దలచితి యొడిసి బట్టి
దాపు జేరి యోపగలేని తాపమెల్ల!

*విప్రలబ్ధ*
మాయమాటలు జెప్పి గాయము జేయంగ మంచమ్ము నవ్వెను మధ్య రాత్రి
ఎకసెకములునాడె నెగుడు దిగుడు గాని చీరె , నిశ్శ్వాసలు కోరినట్టి
కర్ణాభరణములు కలహించె నాతోడ, జాజి మల్లెలు వేగ జారు చుండ
అరవంకి పట్టీలు అరదండ లవ్వంగ సరములు భారమై సద్దు జేసె
చిటమట బడుచును సెగలు గ్రక్కుచు శయ్య పై వ్రాలి నిర్వేద బడుచు ముందు
విసరిగొట్ట సరముల్ విరహ తాపమ్మున నిందించు చుండగ నిర్భయముగ
శీతకరుండును శీఘ్రముగ వెడలె రాత్రి గడచి పోయె రహియు లేక
మోసపోతి ననుచు ముదిత బలికె! నాదు సాతము గొని పోయె సరసు డిటుల
తేటగీతి
కనులలోన నిలచియుండె కరుణ లేక
విప్రలబ్ధ నైతిని జూడు విభుడు లేక
వలపు గలిగి యున్న తరలి వచ్చు గాక
యెఱుక గల్గిన వచ్చి నన్నేలు గాక!

*ఖండిత*
పరభామలను గూడి వడిగ వచ్చితిరేల? శ్రద్ధ జూపితిరేల? శయ్య పైన
తమరికి పరిపాటి తరుణుల తోడను సరసము లాడుట చాటుగాను
నఖఘాతముల తోడ నల్లని కాటుక గుర్తులెటుల వచ్చె కుత్తుకందు
ఏయింతి వోగద యీసుగంధ పరిమళమ్ములు విడచెనా రమణి వేగ
శృంగార సీమలో చిత్తమున్ విడనాడి పరిహాసమాడంగ వలదు వలదు
పగతుడవికపైన బలుకరించ వలదు చాలు చాలిక తమ సరస మిపుడు
పట్టుదప్పుచు నుండె పయ్యెద యీవేళ నన్ను బాధించక మిన్న గాను !
శాంతి వచనముల స్వస్థత గూర్చంగ పంచబాణుడవుగ పంచ జేరి
వలపు వల వైచి బట్టంగ వల్లి నైతి
ఖండితనని బిల్వగ పాడి గాదు
చూపులందు నన్ను నిలుపు సుందరాంగ
కౌగిలింత లందు కరగు కాంతనయ్య!

కలహాంతరిత*
గుట్టుగ నున్నట్టి గుమ్మపై నిందలు మోపంగ భావ్యమా? మోహనాంగ
చుట్టముల్ లేనట్టి సొగసు గాడవని నే వరియించి, గర్వము దరికి జేర
వాగ్యుద్ధమందున వాదమ్ములు సహజ మనుచు వాదించగ నలిగి తీవు
గయ్యాళి నని బిల్వ కలత జెందితి, తొలి దప్పుగా నీవెంచి తరలి రార
బలమైన బలుకుల బంధమ్ము గాంచక బాధించ వలదుర భాష తోడ
శిలనైతి నీరేయి చిత్తమందు దలపు లెల్లను దూరమై యిచ్చకమున
నెడబాటు భరియించ యెటులర బేలను చెంతకు జేరర శీఘ్రముగను
గట్టిగా జెప్పిన కాదంటినా? సఖా! విన్నపములు విని వెతను దీర్చు
పరుష పదముల నిక పైన బలుక నెపుడు
విందునారగించ తిరిగి వేగ రార
మునుపటి వలె ప్రేమను బంచు మోదమలర
కొమ్మ కలహాంతరిత కింత కూర్మి నొసగు!

ఆధునిక ప్రోషిత భర్తృక*
భాగ్యవశమ్మున భర్తగా పొందితి వ్యాపార జగతిని వల్లభుడను
వ్యాప్తి జేయగ తన వ్యాపార మెల్లను పరదేశము వెడలె పనుల వలన
దినమున కొక్క సందేశము క్షేమ సమాచారమును బంపు మాధ్యమందు
వ్యర్థ మగుచు నుండె యవ్వన మనుచు నే వేల్పుల నిరతిగ వేడుచుండ
నానోములు ఫలించి నాథుడు వఱలెను దూరదేశమునుండి దొరవలె మరి
పాడు కరోనాను వంక జూపి తనను పంపునో విడిదికి ప్రభుత నేడు
మరి పది దినములు మదిని మనుచుటెట్లు సకలము దిని యిలన్ వికలముగను
జేసిన చైనాను చిందఱవందఱ జేయంగ వలయునీ చీల తోడ
కలవరించు ప్రోషిత భర్తృక నయి పోతి
దేవ కన్నీరు నింపకు దేశ మందు
పారద్రోలి కరోనాను భరత మాత
చింతలెల్లను దీర్చర శేషశయన!

అభినవ అభిసారిక*
జరిగిన కథ ఆధారంగా

జాలమందు వెదకి, శల్య పరీక్షలు జేసి సమర్థుడు శ్రీహరి యని
తాళికట్టు వరుని తల్లిదండ్రులు జూడ, యనురాగ బంధమ్ము లడ్డు వేయ
పెండ్లి చూపుల యందు బెట్టు సేయక తాను సమ్మతించె వడిగ సప్తపదికి
పరిణయమున కింక పది దినముల ముందు, శోకమే యిక నీవు లేక యనుచు
మదిని దోచిన వాడు మరల సందేశము బంప చిగురులేసె బాసలెల్ల
విరహ సాగరమందు విడచి వెఱపు నెల్ల వాడి తూపుల యందు వాలిబోవ
మొలక నవ్వులు జేర మోము నందు, శుభ ముహూర్తమును దెలిపె నార్తితోడ
సంకేత స్థలమును సరగున సూచించ, సరియని బదులిచ్చె సంజ్ఞ తోడ

ధనము, బంగార మెల్లను దాపు నుంచి
కన్నవారి కన్నులు గప్పి యెన్ను కొన్న
చోటున కభిసారిక యేగ, సొగసు గాను
కష్టములు కాపురము జేసె కలలు కరుగ!

కామెంట్‌లు

Tuesday 23 June 2020

రెండు ప్రాసల బహువిధ కంద గర్భ మణికీరణము వృత్తము

రెండు ప్రాసల బహువిధ కంద గర్భ  మణికీరణము వృత్తము

( ననభనజ నననన లగ గణములు ) ప్రాస యతి (1,7) యతి (1,15,23).. 

మనమున వరవర్ణి నిలువ మనునే? మరి కలవరపడి మకురము మరుగున్ !
నినచును వరవర్ణి నటన నినయన్ నిరతము కనులను నెలకొని నెగడున్ !
పెనగును వర సత్తుని గని వెనుకన్ వెరవక జగతిని వెడలును వెలుగున్ !
ననచును విరు లావనమున ననుచున్ నరకుచు దిగులును నభమున నడచున్!

అర్థం :-
వరవర్ణి = చెలి, మనునే = జీవించునే, మకురము = అద్దము, మరుగునను= ఆశ్రయించు,
నినచును = నాటును,   నినయన్ = చేత , నెగడున్ = వర్ధిల్లు ,పెనగును = మెలిక పెట్టు ,
వర సత్తుని = వరము చే పొందిన బలము ,ననచును = పూయును , ఆవనము = కాపాడుట ,
ననుచున్ = అతిశయము,

భావము :- మనసున ప్రేయసి నిలచిన , మది నిశ్చలముగా నుండక, తన చెలి కళ్ళలో కనిపించునని అద్దము నాశ్రయించు, చెలి హావభావాలు కళ్ళలో నిత్యము ఉండి వృద్ధి జెందు, మనకు దేవుడిచ్చిన శక్తిని అంచనా వేసి, భయము లేకుండా లోకమున తిరుగును, వెనుకడుగు వేయక ముందుకు సాగును, అతిశయము కాదు ఆశ చిగురించి దిగులును ద్రుంచి, ఆకాశ మార్గమున విహరించును.

గర్భస్థ కందము 1 ప్రాస "న "

మనమున వరవర్ణి నిలువ
మనునే? మరి కలవరపడి మకురము మరుగున్ !
నినచును వరవర్ణి నటన
నినయన్ నిరతము కనులను నెలకొని నెగడున్ !

గర్భస్థ కందము 2 ప్రాస "ర "

వరవర్ణి నిలువ, మనునే?
మరి కలవరపడి మకురము మరుగును మనమున్!
వరవర్ణి నటన నినయన్
నిరతము కనులను నెలకొని నెగడును నినచున్ !

గర్భస్థ కందము 3 ప్రాస "న "

పెనగును వర సత్తుని గని
వెనుకన్ వెరవక జగతిని వెడలును వెలుగున్ !
ననచును విరు లావనమున
ననుచున్ నరకుచు దిగులును నభమున నడచున్!

గర్భస్థ కందము 4 ప్రాస "ర "

వర సత్తుని గని వెనుకన్
వెరవక జగతిని వెడలును వెలుగున్ ! పెనగున్!
విరు లావనమున ననుచున్
నరకుచు దిగులును నభమున నడచున్ ననచున్!

ఇలా వృత్తము నందు పాదములను స్థానభ్రంశము చేసిన మరిన్ని కందములు తయారగును.

మణిగణనికరము (శశికళ), కందము గర్భ అతి వినయ వృత్తము

మణిగణనికరము (శశికళ), కంద గర్భ అతి వినయ వృత్తము
కందము కూడా..

అతి వినయ వృత్తము (నననన న స గణములు యతి 11)

కలడు కలడు వరదుడు గగనమున కలయై
కలదు కలదు వర కనక కరము వరమిడన్
పలుకు పలుకు పసిడి విభవము గద వలదే
వలదు వలదు వశి దరి భవభయము మనసా!

గర్భస్థ మణిగణనికరము (నననన స గణములు యతి 11)

కలడు వరదుడు గగనమున కలయై 
కలదు వర కనక కరము వరమిడన్
పలుకు పసిడి విభవము గద వలదే
వలదు వశి దరి భవభయము మనసా!

గర్భస్థ కందము

కలడు వరదుడు గగనమున/ కలయై కలదు వర కనక కరము వరమిడన్
పలుకు పసిడి విభవము గద/ వలదే వలదు వశి దరి భవభయము మనసా!


అర్థం :- వివధము = మార్గం
విభవము= సంపద , కల = భాగము,

భావము :- కరి వరదుడు విశ్వమంతయూ నిండి యుండెను, వరము నిడు కరము అదే స్థితి (పైకి ఎత్తి) లో నున్నది. వరదుని నామములు పసిడి సమములు వినవే, వాని దరి భవభయముల పని లేదు మనసా!