Tuesday, 16 June 2020

సాధ్వీ వృత్త గర్భ సీసము

సాధ్వీ వృత్త గర్భ సీసము

శ్రీకర శుభకర చిత్తము నిలిపితి క్షేమము నొసగర శీఘ్రముగను
సాకర సురవర సజ్జన తతులను సన్నుతలను గొని సంబరమును
తాకర వరవర దండిగ జెలిమిని దక్షత నిలుపుము తాండవమున
చేకొను నరవర చక్కణ సుధలను చిన్మయ బలుకుల చిత్రముగను

ముజ్జగంబుల నేలుచు మోదమలర
బొజ్జ లో పదునాలుగు భవనములు
గలిగి యున్నవాడవటర కరుణ జూపు
నీల నీరధ శ్యాముండ నిరతిగాను!

సాధ్వీ వృత్తము (భనజ నస ననభగ యతులు 1-8-15-22)

శ్రీకర శుభకర చిత్తము నిలిపితి క్షేమము నొసగర శీఘ్రముగన్
సాకర సురవర సజ్జన తతులను సన్నుతలను గొని సంబరమున్ 
తాకర వరవర దండిగ జెలిమిని దక్షత నిలుపుము తాండవమున్
చేకొను నరవర చక్కణ సుధలను చిన్మయ బలుకుల చిత్రముగన్


మనోజ్ఞ వృత్త గర్భ సీసము

మనోజ్ఞ వృత్త గర్భ సీసము 

సురవర సేవిత సోమసుందర రామ నే భద్ర గిరిపైన నిన్ను నమ్మి
సరగున బిల్చితి సారెసారెకు నాశతోడను దురితములు ద్రుంచెదవని
వరధర నిల్చితి పాదపద్మము పట్టగన్ మారుతి వలెను గట్టిగాను
నరవర వేడెద నందనందన బాధలన్ అహల్య వరదా రక్తి తోడ

విష్ణు దినము లందున భోగ తృష్ణ లుడిగి
నిదుర మాని నిన్ను పరమ నిష్ఠగాను
నీదు కరుణ రసము కోరి నిరతిగాను
వేడు చుంటిని గద రామ వేడ్క తోడ!

మనోజ్ఞ వృత్తము (నజజ భర, యతి 10)

సురవర సేవిత సోమసుందర రామ నే
సరగున బిల్చితి సారెసారెకు నాశతో 
వరధర నిల్చితి పాదపద్మము పట్టగన్
నరవర వేడెద నందనందన బాధలన్  !

Monday, 15 June 2020

శివశంకర వృత్త గర్భ సీసము

శివశంకర వృత్త గర్భ సీసము

అవతార పురుషు డాయన యవివాదుడు - భువిలో నసుర సుర స్తవయుడయ్యి
భవికా చరణుడు పావన వర ధారుడు - కవగాను వరలెడి కరిమెడ దొర!
శివనామ జపము జేసిన స్థిర భక్తిని - శివమౌను చిత్తము చిత్రముగను
భవ బంధ భయ విభావన పరిమారుచు గదరా, కడవరకు కాల హరుడు!

వెనుక జన్మల జేసిన విచ్చికములు
కలిమి తోడను జేసిన కర్మలెల్ల
మరచి తననామము గణించు మరులు గొనుచు
కరుణ జూపి కామితములు గలుగ జేయు!

శివశంకర వృత్తము (సనజ నభస యతి 11)

అవతార పురుషు డాయన యవివాదుడు భువిలో
భవికా చరణుడు పావన వర ధారుడు కవగా
శివనామ జపము జేసిన స్థిర భక్తిని శివమౌ ,
భవ బంధ భయ విభావన పరిమారుచు గదరా!

దేవరాజ వృత్త గర్భ సీసము

దేవరాజ వృత్త గర్భ సీసము

వినుడు వినుడు పక్షపాతిని గద వేద వేద్య పదము జేర వేకరమున
పరులు కొనగ పక్షివాహన నిను కోరి వచ్చితి గరిమా భవ భయ హరణ
యిటుల దినము కక్ష యేలను దొర దీక్ష బూని నటుల రామ పుణ్య పురుష
కడకు చనగ రక్షకా యిటులను జాగు సేయ వలదు రామ చింత బాప!

జంట కోర విభీషణు బంటు జేసి,
దంతి హరియన జనుదెంచి చింత బాపి
నటుల గాసి దీర్చెదవని యార్తితోడ
పలువరించితి నిన్ననే నలువ తండ్రి!

దేవరాజ వృత్తము (నరన జభస యతి 11)

వినుడు పక్షపాతిని గద వేద వేద్య పదము జే
కొనగ పక్షివాహన నిను కోరి వచ్చితి గరిమా
దినము కక్ష యేలను దొర దీక్ష బూని నటుల రా
చనగ రక్షకా యిటులను జాగు సేయ వలదు రా!

కౌముది వృత్త ద్వయ గర్భ సీసము

కౌముది వృత్త ద్వయ గర్భ సీసము

కనగ భూమీశునన్ గన్నులన్ వినగ సద్భోధనల్ వీనులన్ పొంకమలర
ఘనముగా పాడు జక్కాని వత్సనుని సన్మార్గమున్ సర్వదా మరలుగొనుచు
తనువు సేవించు సత్కారణా యనుచు దేదీప్య రామార్యునన్ తృప్తి నొంది
మునుగు విభ్రాంతి ముప్రొద్దులన్ గెనయు దేహమ్ము సత్కీర్తినన్ హంసవోలె

పలుకు బలుకు లందు పంచదార లొలుకు
రామనామము గొని రక్తి తోడ
పట్టు కొన్న ముందు పన్నగ శయనుని
యెరుపు నలుపు దెలుపు నెరుక గలుగు!

కౌముది వృత్త ద్వయము ( నతతగ యతి 8)
1.
కనగ భూమీశునన్ గన్నులన్ వినగ సద్భోధనల్ వీనులన్ 
ఘనముగా పాడు జక్కాని వ
త్సనుని సన్మార్గమున్ సర్వదా
2. 
తనువు సేవించు సత్కారణా యనుచు దేదీప్య రామార్యునన్
మునుగు విభ్రాంతి ముప్రొద్దులన్
గెనయు దేహమ్ము సత్కీర్తినన్ !

భంభర గానము గర్భ సీసము

భంభర గాన గర్భ సీసము

కరుణను గను హిమకర ధర పాహి పరాత్పర హేప్రభు రయము గాను !
దనుజ తతుల క్షమిత ! యవని రక్షక కాలహరా! శివ కావు మమ్ము !
ఆర్తరక్షక ! సమయము నిడు శాశ్వత! సజ్జనులన్ ఘన సాధు శీల!
మునిమాన్య! వర క్రమముగ గను చంద్రకళాధరుడా! మమ్ము లరసి బ్రోవు !

భవభయములు భక్తవరులకు దూరము
జేసి నిరతి గాను గాసి నొంది
పాపములను ద్రుంచి తాపసులను గాచు
త్ర్యంబక దరి నిలువు ధరణి పైన !

సమయము =జయము

భంభర గానము ననభభగ యతి 8వ అక్షరము

హిమకర ధర పాహి పరాత్పర హే
క్షమిత యవని రక్షక కాలహరా
సమయము నిడు శాశ్వత! సజ్జనులన్
క్రమముగ గను చంద్రకళాధరుడా !

లలితగతి గర్భ సీసము

లలితగతి గర్భ సీసము
లలితగతి ( ననన జస యతి =11)
ఘన చరిత ! సురవర నుత! యతిజన సోమ చరణా! మహనీయ మదన జనక !
ముని మానస భరణ !యినకుల తిలక ! భాసురముగా నేలెడి సులభ చరణ !
లాగమున కరిమొరను వినిన కనకాచల వరానన పూర్ణ సౌధ చంద్ర !
భవ హరణ! దొర! నరవర! యిడుముల ద్రుంచు మురళీధర నీకు జోతలిడుదు !

నిరుపమాన కలుషముల నిలయమైన
కలియుగము నందున నిరతిగ హరి సేవ
సలుపు నరులకు వైకుంఠ సదన గతుల
నిమ్ము శోక నివారణ యిమ్ముగాను!

లలితగతి వృత్తము (ననన జస యతి =11)

సురవర నుత యతిజన సోమ చరణా
భరణ యినకుల తిలక భాసురముగా
కరిమొరను వినిన కనకాచల వరా 
దొర నరవర యిడుముల ద్రుంచు మురళీ !