సుందరకాండము ఆటవెలది గర్భ సీసము తో మొదలు పెట్టాను 

ఆశీర్వదించ ప్రార్థన
సీ !
శోభనమ్మునొసగు సుందర కాండమున్
--సాగర తరణమ్ము చక్కగాను
లంకవైభవమును, రావణ భవనమ్ము,
---వికృత రాక్షస గణ వికతమెల్ల
పుష్ప భరితమైన భూ వనమ్ముల యందు
---మేటి వనమునున్న మీననేత్రి
కథను జెప్ప దలచి కమనీయమౌ యాట
వెలది గర్భముగను వేడుకలర! 1
రావణాపహృతను లంక నన్వేషించ
--చారణాది తతులు సంచరించు
గగన మార్గమునను గండరగండడు
--మంచి దనుచు నెంచి మరలుగొనుచు
సాటిలేని పనిని సాధింప నెంచి తా
--నిలచెను వృషబేంద్రుని వలె నంత
వర్ణశోభితమగు పచ్చికపై నిల్చి
-- మెడను శిరము నెత్తి మిన్నగాను! 2
గజసమూహములను గలిగిన గిరిని, మ
--హా గజమ్ము వలెను హర్షితమున
రాముని మది నిల్పి రమను కనుగొనంగ
--తిరుగుచుండ హనుమ తిరము గాను
వంగె వృక్షతతులు వక్షఃస్థలము దాకి
--ప్రాణభయము తోడ పక్షులెల్ల
నా మహేంద్ర గిరిని యాపత్తిగా నెంచి
--పాహి పాహి యనుచు పరుగు లిడగ !3
కార్యదక్షుడయిన కపివరుండు మహేంద్ర ,
--వాయుదేవులకును ప్రణతు లిడుచు
నిశ్చయించు కొనెను నిర్మల హృదయుడై
--దక్షిణ దిశ దిర్గి తనువు బెంచె
పున్నమి దిన మందు ముదమున నుప్పొంగు
--రత్నగర్భుని వలె రయము గాను
అబ్ధిని మును దాట నవలీలగను కర
--చరణములను తట్టె శక్తి కొలది! 4
గట్టిగ నదమంగ కంపించెనాగిరి
--పట్టుదప్పిన పసి బాలులవలె
వరములొందిన పలు పాదపముల్ నూగ
---రాలెపుష్పతతులు వేలకొలది
పోలియుండె నపుడు పుష్ప గిరిని, జల
--ధారలు ప్రవహించె ధరణిపైన
పెద్ద పెద్ద శిలలు వెలిగ్రక్క గుహలందు
--ప్రాణులెల్ల మిగుల భయము జెందె !5
నిలచె యుండి ఋషులు నిర్మలాకాశమున్
--సిద్ధుల దరి జేరి శీఘ్రముగను
వీర హనుమ వంక వీక్షింపసాగిరి
---చారణులను గూడి చక్కగాను
పవన సుతుడు వేగ పర్వతాకారుడై
--రోమములు విదల్చె రామబంటు
మిగుల ప్రళలకాల మేఘ గర్జన జేసి
--వాలము సరి జేసి వడిగ ద్రిప్పె! 6
వేగగమనుడయ్యి బిగబట్టి యూపిరి
--పాదములు కుదించె బాగుగాను
తనదు బాహువులను స్తంభింపజేసి తా
--కరగ జేసె వడిగ కటి ప్రదేశ
మును, మెడను కుదించి ముందుకు సాగంగ
దృష్టి నిలిపె తాను తృష్ణ తోడ
నుడుపథమును గాంచి యుచ్ఛ్వాసమును నిల్ప
బల పరాక్రమములు వెలుగు జూచె! 7
వానరులను గూడి వానరశ్రేష్ఠుడు
---వడిగ బలికె నిట్లు బలము గాను
వాయువేగమునను పావని యున్నట్టి
--లంకకు జని నేను రమ నచటను
గాంచకున్న నెదురుగా నున్న యా సుర
--లోకమునకు, స్వర్గ లోకమునకు
పోయి వచ్చెద మరి భూతలమును చుట్టి
--రామబాణము వలె రయము గాను! 8
స్వర్గలోకము నటుపై సుర లోకమున్
--వెదకెద త్వరితమ్ము విమల మతిని
గాంచకున్నను దశ కంఠుని బంధించి
--ప్రభుని పాదములను పట్టజేసి
క్షేమముగను నేను జేరెద, లేకున్న
--లంకను పెకలింతు శంక లేక
అమ్మను గొని వచ్చె దారు నూరైనను
---కలత జెంద వలదు కడలి దరిని! 9
యనుచు నెగిరె నంత నంతరిక్షమునకు
---గరుడుడను దలంచి కపివరుండు
వినయ మలర యెల్ల వృక్షములు నమస్క
---రించె తలలు వంచి, యినుమడించు
సంతసమ్మున కపి సైన్య మనుసరించె,
--మాతను గను నిచ్ఛ మదిని నిలిపి
నిర్మలమయినట్టి నింగిని జూచుచు
--సాగుచుండె హనుమ శక్తి మీఱ! 10
వివిధ రంగులు గల విరులు మారుతి శరీ
---రమున నంటుకొనగ రత్నమాల
వలెనలరుచు నుండె, వాయు మార్గమునందు
--సాగుచుండ నతని ఛాయ జూడ
సాగర లహరిన్ సుసంశోభితంబైన
--యాకృతి వలె నుండె, నంత కనులు
విరతి లేక దిరుగు వెలుగు ఱేడుల వలె
--నొప్పుచు విలసిల్లు చుండె మరియు! 11
గమన వేగమునకు కల్లోలమై యబ్ధి
--యందు జలము గ్రమ్మె నాకసమును
జలచరములు దేలి జలతస్కరుని గాంచి
--సిగ్గు తోడ మరల జేరెనబ్ధి
పట్టు దప్పి వెడలె పక్షి సమూహముల్,
--పుష్ప వర్షములను ముదము తోడ
కురియ జేసెరి కపివరునిపై సురలెల్ల,
--వానరోత్తమునకు వరములిడుచు ! 12
ఆకసమున నున్న హనుమ కార్యార్థము
వాయుదేవుడు తన వడిని నిలుప
జూచి దినకరుండు చుఱుకును తగ్గించి
గాలిచూలికి శుభకామనలిడె
శంక లేక హనుమ లంక జేరుననుచు
సంతసమున బల్కి జయము జయము
దృష్టి నిలిపి రంత దేవ గంధర్వులు
ప్రస్తుతించిరి కపివరుని యపుడు !13
సాగరుండు దలచె, సాగుచున్న హనుమ
కిప్పుడు తగురీతి నిచట విడిది
నిడి సహాయ పడుదు నిమ్ముగా, నిక్ష్వాకు
వంశ సచివుడైన వర సగరుడు
మనకు ప్రభువు గాన మైనాక! రయముగా
వచ్చు కపివరుండు పరమ పూజ్య
రవికులతిలకుండ రాముని కార్యార్థి
యాలసించ వలదు నాత్య బంధు ! 14
దేవగంధర్వులు సేవించు మైనాకు
--డంత బయలు వచ్చె నాశతోడ
మేఘమండలముల మెఱుపు వేగమ్మున
---పర్వతమును జూచి పవన సుతుడు
విఘ్నమనుచు నెంచి వెఱవక వడిగ తా
---గొట్టి వెడలు చుండ కొంత తడవు
ఆగుము కపిసత్తమా పుణ్య ఫలమున
---జూడగల్గితి నని వేడుకొనుచు ! 15
మేనకాత్మజుడను గాన పూజలనందు
కొనుడు కపివరుండ యనగ విన్న
పవనసుతుడు బల్కె పవలు గడచి పోవు
చుండె గిరివరా! యసురులు నిద్ర
లేచు, హితుల తోడ రేఱేడు కంటెను
ముందు లంకకు జని ముదిత జాడ
బట్టు కొందు ననుచు బ్రతిన భూనితి గాన
విశ్రమించ నిచట వీలు గాదు! 16
మరియు నిట్లు బలికె గిరివరా! తమరి యా
--దర వచనము జాలు, తప్పు బట్ట
వలదు నతిథి పూజ పవన సుతుడు స్వీక
--రించినట్లు దలచి వాంఛితముగ
వీడుకోలు దెలుపు వేగముగను ప్రొద్దు
--గ్రుంకు చుండె ననుచు కొంత పైకి
యెగిరి నిర్మలుడయి గగన మార్గము నందు
--నా హరిప్రవరుడు నరుగు చుండ! 17
నచట నిలచి యున్న యందరు దుష్కర
--మైన కార్యము గని హనుమను మరి
మేనకాత్మజుడను మిగుల పొగడ సహ
--స్రాక్షుడు జని యో హిరణ్యనాభ!
భయము వలదు నీకభయము నొసగు చుంటి
--నీ సహాయమునకు నెమ్మనమున
వీడు చుంటి పగలు వెడలు డనుచు బల్క
---పర్వతోత్తముడును ప్రణతు లిడెను! 18.
తృప్తి జెందకనట దేవగంధర్వులును
--సూర్యతేజము గల సురస తోడ
బలికిరిట్లు, హనుమ బలపరాక్రమములు
--జూడ వచ్చితి మిటు సొగసు గాను
సాగుచుండె ఘనుడు నాగమాత! గగన
--మార్గమందు వడిగ మాఱువేష
మున నతనికి విఘ్నము గలిగింప వలయు
--వినతులిడుచు వారు విన్నవించి!19
బలపరాక్రమములు, ప్రజ్ఞతో విజయుడై
--మాత జాడను గొని మరలి వచ్చు
నో పరాజయుడయి రూపము మార్చునో
---జూడ వచ్చితి మని వేడుకొనగ
బంగరు నయనాల పర్వతాకారము
---తోడ నిలచి యుండ గోడవలెను
వికృత రూపము నను వేగ ధరించి యా
---సాగరమున వేచె నాగమాత! 20
మరులుగొనుచు నామె మారుతి వేగమున్
--గాంచి యంత వినుడు కపివరుండ
నేడు భక్ష్యముగను నిర్ణయించిరి నిను
--కుక్షిని బడ వేయ కోరుచుంటి
కనుక రమ్ము వడిగ ననుచు బిల్వ హనుమ
--వందన శతమన్చు ప్రణతులిడుచు
లంకకు జను చుంటి రామకార్యార్థినై
--సహకరింపు జనని సంతసమున! 21
దశరథ సుతుడైన ధరణీధరుడు తన
--ప్రాణసఖియ తోడ పర్ణశాల
యందు నుండనసురు డంత బంగరు జింక
--వోలె దిరుగు చుండ ముదిత కోరె
నా మృగమును రాముడా మృగమును వెంబ
--డించి వెడలు చుండ గాంచిన యసు
రేంద్రు డపహరించె శ్రీరాముని సతిని,
--మాతను వెదుకంగ వెడలు చుంటి! 22
అట్లు విడువ కున్న నామె కుశల వార్త
--దెలిపి వచ్చెదనని బలుకు చుండ
కామరూపిణి, నను కాదను వారలు
--సాగలేరిచటను శక్తి యున్న
వాయునందన యిది బ్రహ్మ వరబలము
--నా ముఖమున నీవు నడువ వలయు,
వరలు చున్న హనుమ బలము పరీక్షింప
--తెఱచె నోఱు సురస తిరము గాను !23
కపివరేణ్యు డపుడు కాయమున్ బెంచంగ
--మీఱి పెంచె సురస మేను నెల్ల
మరల తనువు బెంచె మారుతి కుపితుడై,
--నూరు యోజనముల నోఱు తెఱచి
బలము పెంచి సురస భయము గొల్పుచు నుండ
--స్పర్ధ వ్యర్థ మనుచు పవన సుతుడు
కరగ జేసె వడిగ కాయమ్ము, నంగుష్ఠ
--మాత్రుడయ్యి మును నమస్కరించి !24
అమిత వేగమున సహస్రాక్షుని దలచి
యామె ముఖమునుండి యంతరిక్ష
మున నిలచి వచించె ఘనముగా! నెరవేఱి
నదిగ బ్రహ్మ వరము నందువలన
ననుమతించు జనని , యమ్మ కడకు బోవు
చుంటి నన్న యతని సురస గాంచి
రాహు ముఖమునుండి రవి వెడలెడి రీతి
రాము కడకు జేర్చు రయముగ ననె! 25
కష్టసాధ్యమయిన కార్యమును హనుమ
ఇష్ట ఫలిగ జేయ తుష్టులయ్యి
బాగు బాగనుచును ప్రాణులెల్ల బొగడ
గగనమార్గము నను నెగిరి పోయె,
సంచరించు సురలు, స్వర్గమును జయించి
బ్రహ్మ నిర్మితమగు వారిధార
వాసిగ నట నుండు కైశిక రాగ ప్ర
వీణులయిన వారు వీరు లెల్ల! 26
శక్తి వంతులకును శక్యము గాని యా
వరుణనిలయ మైన వార్థి పైన
మేఘములను జీల్చి మేరువు సముడయ్యి
సాగుచుండె హనుమ వేగముగను
మేఘమండలమున మిహికాకరుని వలె
వచ్చు చుండ బయలు పదిగడియల
కొక్కమారు, గనుచు నువ్వెత్తు "సింహిక "
యెగిరి తనివిదీరు నీ దినమున! 27
ఆరగించెదను మహాజంతువు ననుచు
---సంతసమున నామె సాగరమున
ఛాయ నొడిసి బట్ట , శక్తి హీనుండుడౌచు
--సంశయమున జూచె శక్తి యుతుడు
నన్ని దిశల యందు, హనుమంతు డాశ్చర్య
--మొంది తనదు ఛాయ నొడిసి బట్టు
కామరూపిణి యగు భామను గని శక్తి
--మంతమయిన సింహికనుచు దలచి !28
బుద్ధిబలము జూప ముందుగా కాయమున్
---బెంచ మేఘమువలె, వికృత రూపి
తెఱచె నోఱు, పిదప ధీరునిపై బడ
--హతముజేయ హనుమ నామె నచట
గాంచిన సుర సిద్ధ గంధర్వు లెల్లరు
--వానరోత్తమునకు ప్రణతు లిడెచు
స్వామి కార్యమునను సాధించు వాడవు
--పోయిరమ్ము హనుమ మోదమలర! 29
మంగళకరమైన మాటలు విని దూర
దృష్టి గలిగినట్టి ధీరుడపుడు
స్వామి కార్యమునను సాధింప దలచి యా
కాశమార్గమున గరుడుని వలె
నూఱుయోజనముల మేరలంఘించిన
పిదప గాంచె నచట వృక్ష తతులు
మోదమొంది దిగుచు పుణ్య వనములందు
దేహమును కుదించి తీరుగాను !30
శక్తి వంతులకును శక్యము గానట్టి
సాగరమును దాటి వేగముగ త్రి
కూటపర్వతమున కూరిమి నొందుచు
స్వస్థచిత్తుడు బలశాలియైన
హనుమ లంకను గని వనముల దిరుగుచు
సరళ వృక్ష తతుల దరికి జేరి
ఫల భరమున వంగి తలలూపుచున్నట్టి
వివిధ వృక్షములను పెక్కు గాంచె !31
కలువ తతులు జూడ కనువిందు గావించ
--మొగలి పొదలు పెక్కు మొగ్గ దొడిగి
సౌరభమ్మును వెదజల్లు చుండగ జలా
--శయము లందు దిరుగు శంబరములు
రాజహంసలకు నిలయమైన మనోహర
--పుష్ప వనము గల్గి ముదము గూర్చ
బరవశమ్మున నట ప్రకృతికి వశుడయ్యి
--కదలులేక నిలచె కపివరుండు!32
గిరిశిఖరము నందు కీర్తి మంతులు విశ్వ
--కర్మ విశ్రవసుడు గట్టినట్టి
సుందర నగరమ్ము సువిశాల వీధుల
--పసిడి వర్ణము గల స్వర్గసీమ
గ్రహసదృశము లైన గృహముల తోడ శో
--భిల్లు లంకను గని విస్తుబోయె!
ఆనగరము తేలియాడుచు నాకాశ
--మున్ నెలకొని యున్న పుష్పకమ్ము! 33
కోట జఘనమందు కోరి నిలుప నగ
--డ్తలను వస్త్రములుగ, తళుకు మను శ
తఘ్నులు గన శిష్ట తరుణి కేశములుగ
--కోట బురుజు లెల్ల మేటి కర్ణ
భూషణములు గాను పులకించు లంకయే
--సుందరివలె నొప్పు చుండ నట్టి
రమ్య పురపు నుత్తరద్వారమున జేరి
--తలపులెల్ల నిలిపె ధరణిజకయి! 34
నాగజాతులు గల భోగవతి వలెను
--భీతి గలుగ జేయు ఖ్యాత రాక్ష
సులకు నిలయమయ్యి శోభిల్లు చున్నట్టి
--లంకనగరి యొక్క రక్షణమ్ము ,
సాగరమును జూచి శక్తి యుతుండు, నా
--రావణుడు భయంకర పగదారి
వానరులిట వేగ వచ్చిన నిష్ఫల
--మే నితరులకైన నేల ననగ !35
సమరమందు నితని జయనము శక్యము
--గాదు సురలకైన , కట్టుదిట్ట
మైన నీతకమున మాన్యుడైయుండగ
--లంక చొచ్చిన దరి శంక లేక
మిత్తి మీద బడుగ మిసిఁమి వలెను తేఱి
--పాఱజూడ వలదు వానరులిటు
రామచంద్రుడయిన లంకకు జని కడు
--దీనవదనుడయ్యి దిరిగి వెడలు! 36
రాక్షసుల జయింప రక్షణ వలయము
--నందు నలవి గాదు ఆసురమ్ము
వారి ప్రకృతి గాన వ్యర్థము సామము
--నర్థ సంపద గల యసురుల కడ
దానము సరి గాదు, తావులేదుగ బల
--దర్పితులగు వీరి దఱి విరోధ
మును నిరర్థక మగు, బుద్ధి పరాక్రమ
--శాలురు మరి నేటి సమర మందు! 37
గెలువసాధ్యముగ దిగులు జెందుచు హనుమ
--చతురుపాయములును సన్నగిల్లు
నిట్టి లంకకు జన నంగద నీలుడు
--నూఱుయోజనముల మేర దుముకు
హనుమయు బలశాలి యైన సుగ్రీవుడు
--కార్యసాధకులగు కలికిని వెదు
కంగ, యుక్తము గద మమ్మను గాంచిన
---పిదప యీ విషయము ముదము నిడుగ! 38
గిరిశిఖరము పైన పరిపరి విధముల
--కార్యసాధనమున కపివరుండు
మథన బడుచు సీత మాత కొఱకు క్రూరు
--లైన రాక్షసులను నేను మోస
పుచ్చ వలె సుసాధ్యముగ రామ కార్యము
--పూర్తి జేయుటకయి ముందు గాను
లక్ష్యరూపు విడచి లంకను సూక్ష్మ రూ
---పమున వెదుక నెంచి పవన సుతుడు !39
రాత్రి సమయమందు లంకప్రవేశము
--యుక్తమనుచు నెంచి శక్తి యుతుడు
నరి సురాసురులకు నడుగిడుటయె కష్ట
--సాధ్యమీపురమున జనకసుతను
గాంచుటెట్లనుచును కలత జెంది నిజరూ
--పమును కుదియ జేసి ప్రభుని దలచి
స్వామి కార్యమునకు భంగము కానట్లు
రావణ భవనమ్ము రాత్రి పూట !40
పూర్తిగా వెదకెద భూమిజ నిచ్చట
--యివ్విధముగ నిశ్చయించి కొనిన
హనుమ యెదురు జూచె నస్తాద్రి యంశుని
--దర్శనమును పొంది తరలిపోదు
మహిత లంకకు మును మార్జాల పరిమాణ
--మొంది దుమికి వేగ యొదుగు కొనుచు
స్వర్ణ రజత వర్ణ ప్రాసాదములు గల్గి
--నట్టి లంక నగరి యందు గాంచె! 41
వర్ణ భూషితముల భవనమ్ము లలరారు
--చుండె మణుల తోడ సొగసు గాను
ముత్యపు సముదాయముల కూర్పు గల్గిన
--గోపురముల పైన జూపు నిలపి
బరవశమ్మున నట వైదేహి దర్శన
---భాగ్యమునను పొంద వఱలు చుండ
చక్కని కిరణాల జాబిలి కూడి స
--హాయుడయ్యి నడచె హనుమ తోడ! 42
లంబపర్వతమున రమ్యములైన వ
--నములతోడ వికసిత మకురమ్ము
వంటి లంకనగరి గంటి ననుచు వాయు
--సుతుడు సంతసమున జొచ్చి, శుక్రుఁ
శిష్యగణము కూడి జేయు ధ్వనులకు సా
--గరము మిగుల స్పర్ధ గా దలంచి
జేయుచుండె ధ్వనులు స్థిరముగా నచ్చట
--పొంగి పొరలు చుండె మోదమలర! 43
దంతి తతులు జెక్కె ద్వారబంధములపై
--ద్వారతోరణములు దట్టముగను
స్వర్ణ వర్ణములగు సర్పసంచారమున్
--రక్షిత నగరంబు లంక భోగ
వతి వలె విలసిల్లె, ప్రాకార పరివృత
--మై మెఱపుల తోడ నమరపురిని
మించు వైభవమును గాంచి ప్రాకారము
--నెక్కి కలయు జూచె మిన్నగాను! 44
మారుతి హృదయమ్ము మాత కొఱకు వెద
--కుచు నగరము నందు గోపురములు ,
ద్వారబంధములను, స్వర్ణమయములైన
--వేదికలను జూచె విఱివిగాను
వర్ణశోభితమగు వజ్రవైడూర్యముల్ ,
--పుటము బెట్టిన కడు ముదము నిచ్చు
పసిడి కరుల తోడ భవన పైభాగముల్ ,
--స్ఫటిక మణులతోడ సంజవనము !45
అంబరమును పెక్కు చుంబించు గృహములు
--క్రౌంచ పక్షుల కలకల రవములు
రాజహంసలకడు రమ్యనడకలతో
--రాజసంబొలికెడి రాజభవన
పంక్తులందు ధ్వనులు వ్యాపించె నంతట
--సిరులకు నెలవైన శిఖరము వలె
నొప్పు చున్న నగరి నొద్దిక తోడను
--గనుచు సంతసమున కపివరుండు!46
ఆయుధముల తోడ నసురులు రక్షించు
--చుండ నితరు లెల్ల సోలు గాని
అంగద, కుముదుండు, నా సుషేణుని తోడ
--మైందుడు, ద్వివిదుండు, మా కపి దొర
సూర్యుని సుతుడైన సుగ్రీవునకు, నాకు
--కేతుమాలు నకును, కీర్తి యుతుఁడు
జాంబవంతుడు, బలశాలియౌ కుశపర్వు
--డడుగిడుటకు సాధ్యమనుచు నెంచి !47
దుస్తరమును, శత్రు దుర్భేద్యమైనట్టి
--లంకకు జని వారు రణము నందు
నసురలను జయింప ననుమాన మించుక
--గలిగి మరల నిట్లు దలచె హనుమ
రామలక్ష్మణుల పరాక్రమముల ముందు
--లంక నిలువ లేదు శంక లేక
మిగుల సంతసమున మీననేత్రిని వెదు
--కంగ దృష్టి నిలిపి కదలెనంత! 48
రత్నకాంతులు గన లంకానగరి కవి
--వస్త్రములుగ నొప్పె, వర్ణసహిత
గాదెలు ఘనమైన కర్ణాభరణములై
--ధాన్యరాశులచట స్తనములుగను
వివిధ పుష్పతతులు విరియగ నాలంక
--శోభితమయినట్టి సుందరి వలె
నొప్పు చుండ నచట యొద్దిక తోడను
--కదలు చుండె వడిగ కపివరుండు!49
లంకకు జను చుండ లంకాధి దేవత
--స్వస్వరూపమునను వచ్చి నిలచి,
వచ్చిన పని యేమి ?వానరా! సాధ్యము
--కాదు పరులకెల్ల, వాదమేల
నిజము దెలిపి వేగ నీదు ప్రాణములను
--నిలుపు కొనుడు, నేడు నీకు చావు
తప్పదనుచు బల్క, దానవాగ్రణి తోడ
--నమ్రుడైన హనుమ నగరి యందు! 50
వర్ణ భూషితమగు భవనమ్ము లను జూచి
--పిదప, వచ్చినటుల వెడలెదనని
బలుకుచున్న హనుమ వచనముల్ విన్నట్టి
--కామరూపిణి బహు కఠిన ముగను
దూఱుచుండె వడిగ దుర్బుద్ధి వానరా!
--రావణుండు నిడును రక్షనాకు
నడువలేవిచటను నన్ను జయింపక
--ననుచు కొట్టె నపుడు హనుమనామె! 51
కుపితుడైన హనుమ గొట్టె నామెను పట్ట
--రాని కోపమునను, రక్కసి యట
విహ్వలయయి భూమిపై బడి యుండ, తే
--జస్వి దయదలంచి జనుచు నుండ
గద్గదస్వరమున గర్వము వీడి, మ
--హానుభావ వినుము! నక్షరుండు
వరమొసంగు నపుడు, వానరుడు నిను జ
--యించసురుల సంహరించు ననుచు! 52
సాత్వికుండు బలుకు సత్యమై తీరు దు
--రాత్ములైన నసురు లందఱికిని
కీడు మూడినదిగ కీర్తి యుతుడ! నేడు
--లంకపురిని జొచ్చి రయముగాను
నీవు దలచి నట్టి నిష్ఠ కార్యములెల్ల
--నిర్వహింపు మిచట నిరతి గాను
శాపమునను బాపు శక్తి యుతుడ స్వేచ్ఛ
--గా పురమున సాధ్వికై వెదకుము! 53
శత్రు పురము నందు శాస్త్రమ్ము వలదని
--ముఖ్య ద్వారమునకు ముందు బడక
ప్రహరి గోడ దుమికి రాత్రి వేళను జొచ్చి
--శత్రు శిరము పైన చరణమిడుచు
రాజమార్గమునను రావణ లంకలో
--ముందుకు జను చుండె మోదమలర
పావని బరికించె ప్రతి గృహమును స్వామి
--కార్యసాధకుడయి కపివరుండు!54
అప్సరసల వోలె నసుర స్త్రీలచ్చట
--మదవతులయి జేయు మధుర మైన
నృత్య గీతములను, నేర్పు గల్గిన వారి
--వేదమంత్రములను వినిన హనుమ
గూఢచారుల సడి గుర్తించి దాఁకొని
--పిదప నగరమందు వృషభ చర్మ
ములను వస్త్రములుగ గలిగిన యోధుల
--సింహగర్జన లట జేరి వినుచు! 55
యజ్ఞకుండములను, నాయుధ సంపత్తి,
--యొంటి కన్ను మఱియు నొంటి చెవిని,
స్తనములుగల వారి శక్తి యుక్తులు గాంచి
--పొట్టలు గల వారు , పొట్టి వారు
ధనువు, ఖడ్గములను ధరియించి దిరుగు వి
--చిత్ర కవచముల్ ను చేతబట్టి
భయము గొల్పు వికృత వంకర మూతుల
--యసుర తతిని గాంచె హనుమ యచట! 56
మాలలు ధరియించి మగువలు, జక్కని
--వేషములను దిర్గు పెక్కు మంది
రాణివాస భవన రాజసము గలిగి
--ప్రాంగణమున మధ్య భాగమందు
సావధానులయిన సైనికులవలెను
--రావణాజ్ఞలు గొని రహిని నిలచి
రంతట సువిశాల మైన రావణుని ప్రా
--సాదమునను గాంచె సాధకుండు! 57
స్వర్గతుల్యమయిన భవన మందున దివ్య
--మైన నాదములను హాయిగ విని
యంజనేయుడు జనె నంతఃపురమునకు
--నందు మణుల తోడ నల్లినట్టి
యాభరణముఁ దాల్చి నసురులు, పల్లకీ
--వాహనముల తోడ, భద్ర గజము,
పెక్కు విధములైన పరిమళములు వెద
--జల్లు చుండ జనెను బల్లిదుండు! 58
చల్లని కిరణాల చంద్రుని గాంచుచు
--కార్యతత్పరుడయి కదలు చుండ
ప్రణయ కలహమెల్ల ప్రక్కన బెట్టి స్త్రీ
--పురుషులెల్ల మునిగి పోయిరి యను
రాగ జలధి యందు, రాక్షసులు మదిరా
--మత్తులయిన వారు హత్తు కొనుచు,
పరిహసించు కొనుచు, పట్టుదప్పి బడుచు
--నుండె నొకరి పైన నొకరు మఱియు! 59
విరుచుకొనుచు నుండె విఱివిగా ఱొమ్ములు
--తూలిబడుచు నుండె దూఱు కొనుచు
కన్ను మీఱు కొనుచు కాంతల పైబడి
--వివిధవేషములను వేయు చుండ,
కొందఱు బలమైన కూటములను బట్టి
--ద్రిప్పు చుండిరి యట తీరుగాను
నంగరాగములను నలదు కొనుచు నుండె,
--నిద్రలో మునుగుచు నీల్గుచుండె! 60
కామరూపుడయిన కపివరు డచ్చట
--జాగరూకుడయి భుజ బలమునను
జూపక దశ కంఠుఁ సుందర భవనమ్ము
--గాంచి యందు వెదుక కదలు చుండ
రక్తజిహ్వముల సురక్షిత మైనట్టి
--భవనము పరికించ ప్రముఖులెల్ల
ముదపు టేనుగులకు మావతు లైయుండి
--యిటునటు వడి సంచరించు చుండె! 64
వినయుశీలురును వివేకవంతులు గూడి
--బాహ్యరక్షకులుగ పంక్తులందు
నిలచె, రణము నందు నలుపెఱుగని వారు
--రావణభవనమ్ము రక్షకులుగ,
ద్వారబంధము దరి వనితా మణులు జేయు
--రవములెల్ల నలల రవము వలె మ
నోజ్ఞములయి యుండె విజ్ఞులెల్ల దలచె
--రా భవనము లంక కాభరణము !65
ఛత్రచామరములు జక్కని రాజ చి
--హ్నములు, శ్రేష్ఠములయి నగరు చంద
నాదులు వెదజల్లు నా పరిమళములు ,
--శంఖనాదములకు శాశ్వత మగు
నాభవనము నందు నసుర నిత్యార్చన
--పర్వదినములందు నిర్వహించు
హోమ కార్యములకు యోగ్యమైన దనుచు
--దిరుగ సాగె హనుమ తిరముగాను! 66
వానరోత్తముడట ప్రాసాదములు గని
--నిర్భయముగ దృష్టి నిలిపి దుమికె
నా ప్రహస్తుని గృహమందు పిదప మహా
--పార్వ్శుని గృహమందు, పైకెగురుచు
మేఘసదృశమైన మెఱుపు వేగమ్మున
--కుంభకర్ణుఁ గృహముకు, తదనంత
రము విభీషణుని గృహమునకు నాపై సు
--మాలి యిండ్లకు జనె మాత కొఱకు! 67