Monday, 10 March 2014

బ్రహ్మ పట్నము పోద మంటే......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

మా అమ్మ గారి చిన్నతనములో ఒక భక్తురాలు పాడిన  పాట

==============*================

చ : బ్రహ్మ పట్నము పోద మంటే పిరికి పుడుతుం దన్నయా ! 
పిరికి దీసి వెరుక బరచి.. పరమనొందవె చెల్లులా !   

బ్రహ్మ పట్నము పోద మంటే నదీ యడ్డము రన్నయా !
"ఓంకార" మనెడి తెడ్డి దీసి పడవ నడపి.. పరమనొందవె చెల్లులా ! 
   
బ్రహ్మ పట్నము పోద మంటే నడవి యడ్డము రన్నయా !
"ఓంకార" మనెడి కత్తి  దీసి అడవి నరకి.. పరమనొందవె చెల్లులా !

అన్న నిన్ను జూద్ద మంటే చీకటొస్తుం దన్నయా !  
"ఓంకార" మనెడి జ్యోతి వెలిగించి.. నన్ను జూడవె చెల్లులా !

Saturday, 8 March 2014

భజన జేసే విధము దెలియండీ!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   

సౌరాష్ట్ర   రాగము 
==============*================
భజన జేసే విధము దెలియండీ! జనులార మీరు నిజము గనుగొని మోదమందండి !! భ !!    
             
భజన జేసే విధము తెలియక నిజముగా హరి భక్తు లనుకొని మద గజము తెగ వ్రేయ లేకను !సుజనులని తిరుగంగ నేలను !! భ !!  

వారు వీరని యెంచ బోకండీ! జనులార మీరు! నోరు జచ్చిన వారు గాకండీ ! 
వారు వీరని యెంచు టెల్లను సారము లేనట్టి హీనత ! పౌరుల కే గాక పుణ్యము యూరి కదలం దేమి  యున్నది !! భ !! 

జ్ఞానులను కొని యెగసి పడి యజ్ఞా నములు పై బెట్టు కొనినను ! మానసంబున బుట్టి వచ్చియు పూని మరి జన్మింప వలయు !! భ !! 

ఝాట మాట లాడ బోకండీ!నరులార కలియుగ నాటకములో జిక్క బోకండీ!ఝాట మాట లాడి పొట్ట కూటికి వేషములు దాల్చక ! యాటికి యమ బాధలచే కాటికి పోవంగ నేటికి  !! భ !!

మూల స్థానము తెలిసి బ్రతకండి !  జనులార మీరు! మేలిమిగ శ్రీ హరిని వెదకండి !  మూల స్థానము తెలిసి మీలో చాలగా వెలిగేటి జ్యోతిలో ! లీలమై వెలుగొందు బాలుని నీల మధ్యము నందు దలచుచు  !! భ !!

ధరణి శ్రీ నరహరిని గొలువండి ! జనులార మీరు!  పరమ పదవిని పొంద గోరండి ! ధరను  శ్రీ ఘటికాద్రి వర హరి పరమ భక్త వరుల మనుకొని ! విరివిగా నరసింహ దాసుని వర కవిత్వము సారమను కొని  !! భ !!  

Friday, 7 March 2014

వెఱ్ఱి మనసా !

బ్లాగు వీక్షకులేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   

జంఝాటి రాగము 
==========*==================

నర హరిని నమ్మక నరులను నమ్మిన నర జన్మ మీడేరున ! చెరకుండగ వెఱ్ఱి చెరకును నమ్మిన జిహ్వాకు రుచి పుట్టున మనసా !! నర !!

కాళ్లుండగ మోకాళ్ళతో నడిచిన కాశికి పోవచ్చున ! నీళ్లుండగ ఉమ్మి నీటిని మ్రింగిన నిండు దాహము తీరున   మనసా !! నర !!

కొమ్మ యుండగ కొయ్య బొమ్మను కలసిన గోరిక గొన సాగున మనసా !! నర !!

అమ్మా యుండగ పెద్దమ్మా ను గోరిన యర్థము చేకూడున  మనసా !! నర !!

అన్నముండగ సన్న బియ్యము తిని నంత యాకలి వెత తీరున మనసా !! నర !!

వెలదు లుండగా చిత్ర కన్నెల గలసిన కామ వ్యధ  తీరున మనసా !! నర !!

క్షుద్ర బాధచే నుపద్రవమును బడు వేళ నిద్ర కంటికి వచ్చునా ! భద్ర గిరీశు పై భక్తి లేని నరుడు పరమును గన నేర్చునా మనసా !! నర !!                 

Thursday, 6 March 2014

రాతి రోలన వలెను!

హాయిరి రాగము- చాపు తాళము

రామాయని మిమ్ము దలుచని నోరు! రాతి రోలన వలెను! 


ముమ్మాటికి రాతి రోలన వలెను! 

బ్రతికినన్నాళ్ళు నీ భజన జేయుట! రామా! 

భవ బంధ మోచనము! అతి దయా పరుడని యార్త రక్షకుడని యానంద 

పడవలెను  వో!రామా! 

రామా యని కన్నులున్నందుకు ఘనమై మి మూర్తిను గొంటి 

భాగ్యమున! పన్నగ భయము లేకున్న రక్షకుడని యున్నదే సార్ధకము శ్రీ 

రామా! రామా! 

వాసిగ భద్రాచలేశుడవని నిన్ను వాసనెరింగితిని న్నాసించిన 

నరసింహ దాసుడనని దోసిలొగ్గి వేడితి శ్రీరామా! రామా!

జోల పాట

"శ్రీ పాండు రంగ భక్త మాలకీర్తనలు " పుస్తకము నందు గల జోల పాట మీ కొరకు 

పల్లవి : జో అచ్యుతా నంద జోజో ముకుందా! 
           రార పరమానంద రామ గోవిందా !! జోజో!!

తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించి! నాలుగు వేదములు గొలుసుల మరించి !
బలువైన ఫణిరాజు పాన్పునమరించి! చెలియ డోలికపైని చేరిలాలించి !! జోజో!!

తొమ్మిది వాకిళ్ళ తొట్టిలోపలను ! క్రూరులు ఆరుగురు సాధులైదుగురు!
అందులో ముగ్గురు మూర్తులున్నారు! తెలిసి తెలిపే వాడు దేవుడున్నాడు !! జోజో!!

పట్టువలె నలుగురిని పదిలంబుగాను! కట్టవలె ముగ్గురిని కదలకుండగను 
వుంచవలె ఒక్కరిని హృత్కమల మందు! వుండవలె పండువెన్నెల బయలలోను !! జోజో!!

యీడు గలవానిని కూడుండ వలెను! జోడుగల వానిచే జాడ గనవలెను
మేడ మీదను వుండె మహిమ గనవలెను! కోరి యా గోవిందు గురుని గనవలెను !! జోజో!!

వీధి నొక బాటలో గీతంబు శాయ ! కోటలోభేరి మృదంగంబులు మ్రోయు
కోట కావలి వాండ్రు కోలాట మేయు! ధీటు లేని ప్రభువు దొరతనము శాయ !! జోజో!!

ఓంకార మని యేటి ఒక తొట్టిలోను ! తత్వమని యేటి చలువలంబరచి
వేడ్క తో పావనీ యేర్పాటు జేసి! యేడు భువనముల వారేక మై పాడే !! జోజో!!

Wednesday, 26 February 2014

ఓ.. కూనలమ్మ!

నా మొదటి శతకము శ్రీ ఆరుద్ర గారికి మరియు నా గురుదేవులకు అంకితము.

శ్రీ ఆరుద్ర గారి ( Bhagavatula Sadasiva Shankara Sastry,) కూన లమ్మ పదములు చదివి, యా పదముల ఛందస్సుకు ముగ్ధుడనై వ్రాసియుంటిని. గురుదేవులు, మిత్రులు కూన లమ్మ పదములు చదివి మీ అభిప్రాయమును తెలుపమని వినయమండిత పాదాభివందనములు జేయుచుంటిని. అందరికి శివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలతో..... 

      
1.  ఆరుద్ర గారిపై

రుద్రుడై నారుద్ర
వేయ మనమున  ముద్ర
నిండుకొన్నది నిద్ర  !ఓ.. కూనలమ్మ!

2. కూనలమ్మ! పదముల పై ఆరుద్రగారు

సూర్యుల నడుమ నింద్ర
కావ్య దేవత చంద్ర 
మార్గ మనిరి మునీంద్ర !ఓ.. కూనలమ్మ!

3.కూనలమ్మ పదములు 

మూడు పదముల గూడు
మూడు పంక్తుల మేడు
పెద్ద తిరుపతి లాడు !ఓ..కూనలమ్మ!

4.  చంధస్సు

లఘువు లందున గురువు
గురువు లందున లఘువు
ఉడుము నోటికి మధువు !ఓ.. కూనలమ్మ!

5. యోగి వేమన గారిపై

 యోగి వేమన పాడ
 ఆట వెలదుల తోడ
 కోట గూలెను జూడ !ఓ.. కూనలమ్మ!

6.. శ్రీశ్రీ గారిపై

కుక్క పిల్లను పట్టి
అగ్గి పెట్టెను బెట్టి
కవుల కిచ్చెను చుట్టి !ఓ.. కూనలమ్మ! 

7. ఆది కవుల పై 

మొదలు నన్నయ భట్టు 
పిదప తిక్కన మెట్టు 
ఎక్కె ప్రగడలు చెట్టు  !ఓ.. కూనలమ్మ! 

8. వాల్మీకి గారి పై 

పుట్ట లోనికి దూరి 
బాణముల నే నూరి 
వ్రాసె గ్రంధము కోరి  !ఓ.. కూనలమ్మ! 

9. శంకరాభరణము 

శంకరాభరణమ్ము 
కవుల కాభరణమ్ము 
శంకలకు చరణమ్ము  !ఓ.. కూనలమ్మ!

10. .శ్రీ కంది శంకరయ్య గారు 

బాధలందున వారు 
పద్యములనే కోరు
గురువులందున వేరు !ఓ... కూనలమ్మ!

11. శ్రీ నేమాని వారి పై 

సకల వృత్తము లందు 
హరుని నామపు విందు 
వారికి ప్రణతు లందు !ఓ.. కూనలమ్మ!

12. శ్రీ చింతా వారి పై 

కంద గణములు వేసి 
గర్భ గీతులు వ్రాసి 
జూపు చింతలు  కోసి  !ఓ.. కూనలమ్మ!

13. రాజకీయ నాయకులు . 

ఆడుచున్నది కోతి
పాడు చున్నది నీతి
వేడుకన్నది జాతి !ఓ.. కూనలమ్మ!

14.రాజకీయ నాయకులపై

కష్టకాలము వచ్చె
ఇష్టదైవము మెచ్చె
జనులు మాత్రము చచ్చె !ఓ.. కూనలమ్మ!

15. నేడు భూమాత 

నిండినది నరకమ్ము
ఎండినది స్వర్గమ్ము
మండినది భువనమ్ము !ఓ.. కూనలమ్మ!

16. రోగులపై 

కోటు లుండిన వాడు 
కొడుకు లుండిన వాడు 
కూటికి వగచె జూడు !ఓ.. కూనలమ్మ!

17.  ధీశాలి

ఎవరు నేమని యన్న
సాగుచుండును రన్న
తోడు రారని విన్న !ఓ..కూనలమ్మ!

18.  పిరికి వాడు

బ్రహ్మ పత్తన మందు
రంభ యిచ్చిన విందు
వెదకు చుండును సందు !ఓ..కూనలమ్మ!

19.  కామాంధులపై

గ్రుడ్డు కోరిన కామి
గురువు నైనను నేమి
పగుల కుండెను భూమి !ఓ..  కూనలమ్మ!

20. అధికముగా తిను వారి పై     

తినుడు తినుడని భోగి
వలదు వలదని రోగి
నడుమ నిలచెను త్యాగి !ఓ.. కూనలమ్మ!

21.  అక్రమార్కులు

వారు దోచిన నొప్పు
పరులు జూచిన తప్పు
కవులు వ్రాసిన తుప్పు !ఓ.. కూనలమ్మ!

22,  కోట్లు కూడ బెట్టిన

కూడ బెట్టిన డబ్బు
తరతరాలకు మబ్బు
కూడి వచ్చును జబ్బు !ఓ..  కూనలమ్మ!

23. భగవద్గీత

ఖ్యాత బంధువు జచ్చె
గీత గురుతుకు వచ్చె
వినెడి వారలు మెచ్చె !ఓ.. కూనలమ్మ!

24. ధర్మ రాజు

చచ్చి పడ్డది దంతి
వేసె వేగ వదంతి
నీతి నిగమపు దొంతి !ఓ.. కూనలమ్మ!

25. నేటి మహిళ

జోడు గుర్రపు స్వారి
చేయుచున్నది నారి
వెన్న ముద్దలు కోరి !ఓ .. కూనలమ్మ!

26. నాయిక పై

అంద మంతయు నొలుక
ఆడు చున్నది చిలుక
అమ్మ జెప్పెను కనుక !ఓ .. కూనలమ్మ!

27. యువతి వద్ద సెల్లు

యువతి బట్టగ సెల్లు
చిలుక బలుకులు ఫుల్లు
ఆగ నన్నది ముల్లు (బిల్లు) !ఓ .. కూనలమ్మ!

28. సెల్ ఫోన్

యవత కరమున సెల్లు
చెవికి పెట్టును చిల్లు
తల్లి దండ్రులు కుళ్ళు  !ఓ.. కూనలమ్మ!

29. నేటి యువకులు 

మంచి బుద్ధులు మరచి
భుజము గట్టిగ చరచి
తిరుగు నన్నియు మరచి !ఓ.. కూనలమ్మ!

30. పుట్టు మచ్చలపై  

 చర్మ మంతయు కోసి
 పుట్టు మచ్చలు వేసి
 పొందు చుండిరి గాసి !ఓ .. కూనలమ్మ!

31. ప్రోసెస్డ్ ఫుడ్

తినుట నేర్చిన మ్యాగి
దూర మన్నది రాగి
కాలుడు పిలచు దాగి  !ఓ .. కూనలమ్మ!

32.  కార్టున్ చిత్రములు

తోలు బొమ్మలు జూడు
తూగుచున్నవి నేడు
లోక మంతయు కాడు !ఓ.. కూనలమ్మ!

33. సామాన్యులు పరీస్థితి

రాక్షసత్వము పెరిగి
మంచి యన్నది తరిగి
కొట్టుకున్నది పరిగి !ఓ..  కూనలమ్మ!

34. ఇసుకపై

పసిడి ప్రక్కన నిసుక
దాచగ వలెను కనుక
జోలి పట్టుడు వెనుక !ఓ..  కూనలమ్మ!

35. .సామాన్యులు పదవులు బొందుట  (కేజ్రివాల్ ) 

 విచ్చుకత్తుల నేకి
 గూడు పెట్టెను కాకి
 బోరు నేడ్చెను కేకి !ఓ .. కూనలమ్మ!

36. నీతి 

అప్పు తీరక యున్న
నిప్పు నారక యున్న
నిదుర పోకుర విన్న !ఓ .. కూనలమ్మ!

37. నేటి భక్తుల పై 

ఇల్లు వలదను శివుడు
ఇంటనుండెను భవుడు
వెదుకు చుండెను నరుడు !ఓ..  కూనలమ్మ!

38. శ్రీ కృష్ణుని పై

గీత జెప్పిన వాడు
మాట దప్పెను జూడు
యెంత పిలచిన రాడు !ఓ..కూనలమ్మ!

39. బాదలు తీరు మార్గము 

తీపి బాదలు తీరు
లోక మెల్లను మారు
రామ నామము కోరు !ఓ...  కూనలమ్మ!

40. నేడు అవినీతి కొమ్ము కాయు వారిపై

ఖ్యాతిగా నవి నీతి
యెంచు కొన్నది జాతి
నీడ వెదికెను నీతి !ఓ.. కూనలమ్మ!

41. కూరగాయల ధరలపై

పసిడి సమమై మొన్న
పరుగు బెట్టెను నిన్న
దారి కడ్డము యున్న !ఓ.. కూనలమ్మ!

42. నగలపై

వీధి యందున మగువ
మగని కివ్వని విలువ
పసిడి కిచ్చును చెలువ !ఓ.. కూనలమ్మ!

43.  అత్తగారి పై

నుదుట కుంకుమ బెట్టు
సిగను పూలను బెట్టు
మెడకు కత్తిని గట్టు !ఓ.. కూనలమ్మ!

44. ఓటు విలువ

విలువ యున్నది రాయి
వడివడి విసుర కోయి
పడిపడి వగచ కోయి !ఓ.. కూనలమ్మ!
45. తెలుగు 

తెగులు పట్టగ తెలుగు
వెదుకుచున్నది వెలుగు
పట్టమన్నది పలుగు !ఓ.. కూనలమ్మ!

46. నేటి రక్షక వ్యవస్థ 

కలుగు నున్నది యెలుక
బయట నున్నది నలుక
పట్టు బడినది చిలుక !ఓ.. కూనలమ్మ!

47. గొర్రెల వంటి జనులు వెంట తిరిగిన 

వాడ మెచ్చిన వాడు
జగతి మెచ్చిన వాడు
సుగుణ వంతుడు కాడు !ఓ.. కూనలమ్మ!

48.  నేడు సుతుల కన్న శునకము పై ప్రేమ ఎక్కువ

జేయుచు సిరుల మఖము
జూడరు సుతుల ముఖము
కుక్క నాకిన సుఖము !ఓ.. కూనలమ్మ!

49. శివ కేశవులపై

వరము లిచ్చెడి శివుడు
కరిని గను మాధవుడు
ఎక్కడను మానవుడు !ఓ.. కూనలమ్మ!

50. నేటి జనుల విధము

తండ్రి నైనను జంపు
చెల్లి నైనను పంపు
కుళ్ళు నైనను నింపు !ఓ.. కూనలమ్మ!

51. చదువుకొన్న వారిపై

చదివి పెద్ద జదువులు
పొంది చిన్న కొలువులు
వెదకు యువత మధువులు !ఓ.. కూనలమ్మ!

52. నేటి యువతులపై

వన్నెచిన్నెలు కోరి
వీడు చున్నది సారి
వ్యధలు పొందెను నారి !ఓ.. కూనలమ్మ!

53. కురులు గాలికి వదలి

జడను వేసిన కోతి 
కురులు విడచిన ఖ్యాతి
ఖరము దిరిగెడి రీతి !ఓ.. కూనలమ్మ!

54. విడాకుల పై

మొన్న జరిగెను పెళ్ళి
నిన్న జరిగెను మళ్ళి
వేధనన్నది మళ్ళి !ఓ.. కూనలమ్మ!

55. సాప్టువేరు

అమెరికాలో వేరు
ఇండియాలో జోరు
కుర్ర కారుకు వైరు !ఓ.. కూనలమ్మ!

56. లంచముపై

చూడ మన్నది కరము
ఈయ కున్నను ధనము
నీయ నన్నది వరము !ఓ.. కూనలమ్మ!

57. సింథటిక్ పాలు

పాలు కానివి పాలు
చెప్పులందున తేలు
త్రాగ కుండిన మేలు !ఓ.. కూనలమ్మ!

58. రహదారి

చూడ చక్కని దారి
కాలు బెట్టగ జారి
పాడె పైన సవారి !ఓ.. కూనలమ్మ!

59. రాశి ఫలములు

జూచి మంచిగ రాశి
బయలు దేరెను కాశి
పొందెనాతడు గాసి !ఓ.. కూనలమ్మ!

60.  పన్నులపై

పన్ను దీసిన పన్ను
వెన్ను విరచిన పన్ను
కట్ట మన్నది గన్ను !ఓ.. కూనలమ్మ!

61. చీమ

నేడు ఏంతో ఘనము
బ్రతుక వలెనుగ మనము
దాచు కొన్నను సుఖము !ఓ.. కూనలమ్మ!

62. మనో పక్షవాతము 

ఏమి జరిగిన గాని
అడుగు కదుపగ లేని
వాని జెలిమియె హాని !ఓ.. కూనలమ్మ!

63. ఆసుపత్రి 

వ్యాధి ముదిరెను నీకు
కాలు కదుపగ బోకు
రొక్క మివ్వుడు మాకు !ఓ.. కూనలమ్మ!

64. నేటి యువకులు 

వాహనమ్మును కడుగు
దేహ మంతయు మురుగు
దేశ మంతయు దిరుగు !ఓ.. కూనలమ్మ!

65. వారసులపై

నిండె ధాన్యపు జల్ల
వచ్చె వారసు లెల్ల
అగును పెట్టెలు డొల్ల !ఓ.. కూనలమ్మ!

66. షేరు మార్కెట్ 

నిమిషమున కొక మారు 
పతన మైనను షేరు 
గుండె క్రిందికి జారు !ఓ.. కూనలమ్మ!

67. శుద్ధి జేసిన నీరు 

సూక్ష్మ జీవులు లేవు 
నలుసు లన్నవి రావు 
దగ్గర బడును చావు !ఓ.. కూనలమ్మ!

68. దొంగల రాజ్యము 

నీకు నిచ్చితి నింత 
నాకు వచ్చెడి దెంత 
గట్టు జనులకు గంత !ఓ.. కూనలమ్మ!

69. బంధువులపై 

వలస పక్షులు వీరు 
ఎందుకూ  కొర గారు 
ఉసురు దీయక పోరు !ఓ.. కూనలమ్మ!

70. దొంగ స్వాములపై  

భక్తి గీతము పాడు 
ముక్తి దీక్షలు కూడు 
రక్తి విడువక పోడు  !ఓ.. కూనలమ్మ!

71. మధ్యతరగతి 

భిక్ష మెత్తగ లేక 
జేయు పనులకు పోక 
పెట్టు నాకలి కేక  !ఓ.. కూనలమ్మ!

72. సినిమా లపై 

పాడు పదముల తోడ 
ఆరు ఫైటుల తోడ 
మాడు పగులును జూడ  !ఓ.. కూనలమ్మ!

73. జీవిత భీమా ప్రకటన లపై 

నీవు జచ్చిన నాన్న 
ఏమి జేయుదు నన్న 
జూపు సుతునకు సున్న !ఓ.. కూనలమ్మ!

74. సరస్వతి - లక్ష్మి 

ఎలిమి నిచ్చెడి యమ్మ 
కలిమి నిచ్చెడి యమ్మ 
నడుమ నలిగెను బొమ్మ !ఓ.. కూనలమ్మ!

75. శ్రీనివాసుని పై   

ఘనుడవు కలియు గాన 
చెంత లేదుగ జాణ 
నిజము దెలుపగ లేన !ఓ.. కూనలమ్మ!

76. భారత మాతపై  

భరత మాతను గనుడు 
భగ్న మయ్యెను వినుడు 
రాజ దానికి జనుడు !ఓ.. కూనలమ్మ!

77.గుడ్డి ప్రేమ

శిక్ష వేసిరి నాడు
గుడ్డి ప్రేమకు నేడు
గుడిని గట్టిరి జూడు !ఓ .. కూనలమ్మ!

78. శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారిపై 

వేయి పడగల మీద
విశ్వనాధుని రాధ
నాట్యమాడెను గాద  !ఓ...  కూనలమ్మ!

79. డా : సినారె గారిపై 

ఉర్దు బాషను జదివి
తేట తెలుగున మనవి
జూడు జ్ఙానుడి తెలివి !ఓ .. కూనలమ్మ!

80. రాష్ట్ర విభజన 

మూడు ముక్కల మధ్య
పాతి బెట్టె సయోధ్య
నేడు మిగిలెను మిధ్య !ఓ..  కూనలమ్మ!

81. భీష్ముడు 

తండ్రికిచ్చిన మాట
పరచె ముళ్ళను బాట
విడచె చివరకు వేట !ఓ .. కూనలమ్మ!

82.తత్వము 

నిన్ను గెలచిన నీవు
కీడు జేయగ లేవు
ఝాట మాటలు రావు !ఓ..  కూనలమ్మ!

83. సిగ్గు విడచిన అమ్మడు 

సిగ్గు చీరను జింపి
బొగ్గు రసమున నింపి
స్నానమాడును హంపి !ఓ .. కూనలమ్మ!

84. సిగ్గు విడచిన వాడు 

సిగ్గు దుప్పటి మడచి
అడ్డదారిని నడచి
దొరల మందురు తెరచి !ఓ..  కూనలమ్మ!

85. మద్యపాన వ్యసనుడు 

చంద్ర మండలమందు
నీటి జాడలు గందు
మధ్యముండిన ముందు !ఓ..  కూనలమ్మ!

86. సీరియళ్ళు 

వనితల కొరకు వనిత
చెప్పు చుండును కవిత
ముగియ దెన్నదు ఘనత !ఓ..  కూనలమ్మ!

87. శకుని 

భీష్మ యోధుని బలుకు 
ఎంత జెప్పిన వినకు 
శకుని మామకు వణుకు  !ఓ .. కూనలమ్మ!

88.చిన్నయ సూరి గారిపై

వ్రాసె చిన్నయ సూరి
వ్యాకరణమును నూరి
జూపె జనులకు దారి !ఓ..  కూనలమ్మ!

89. పాపపు సొమ్ము 

దుష్ట జనులకు సిరులు
సజ్జనుల కది మిగులు
మూర్ఖుల శిరము పగులు !ఓ..  కూనలమ్మ!

 90. మోసము 

వజ్రపు విలువ తరగె
భూముల విలువ పెరిగె
జనులు మోసము మరిగె !ఓ.. కూనలమ్మ!

91. లోకులు 

అయిన వారికి యాకు 
కాని వారికి పాకు 
లేని వారికి మేకు !ఓ.. కూనలమ్మ!

92. మధు మేహము 

రక్తమందున తీపి 
గుండె వేగము నాపి 
పట్టి యుండెను తాపి  !ఓ.. కూనలమ్మ!

93. రామ యన్న నేడు తప్పు 

రామ నామము బలుక 
పారు చున్నది ఎలుక 
కూడి వచ్చెను చిలుక !ఓ.. కూనలమ్మ!

94. రాక్షస భక్షణ 

రాత్రి యందున దినుచు 
కర్మ ఫల మిది యనుచు 
నన్ని వేళల వగచు !ఓ.. కూనలమ్మ!

95. కూనలమ్మ పదములు చదివు వారికి  కూనలమ్మ పదములు వ్రాయు శక్తి నిమ్ము 

ప్రభువు లే కానిమ్ము 
చదువు వారికి యిమ్ము 
కోరినంత బలమ్ము !ఓ.. కూనలమ్మ!

96. 

కోపగించక సారు 
వ్రాయ గలిగిన మీరు 
చేత బట్టుడు తారు !ఓ.. కూనలమ్మ!

97.  మన రాష్ట్రపతిపై

 ఆడమన్నది యాడు
 పాడమన్నది పాడు
 కూడ దన్నను కీడు !ఓ .. కూనలమ్మ!

98. ఎర్ర చందనము 

ఎర్ర చందన మన్న 
వేడి పుట్టున రన్న 
వేల్పు కంటెను మిన్న !ఓ..  కూనలమ్మ!

99. చెత్త 

చెత్త యందున సిరులు 
వెదకు చుండిరి నరులు 
పరుగు బెట్టె పురుగులు   !ఓ .. కూనలమ్మ!

100. గణక యంత్రము 

మీట నొక్కిన జాలు 
తోక బట్టిన జాలు 
జూపు లోకపు కీలు !ఓ .. కూనలమ్మ!

101. కోన సీమ 

నారి కేళ జలమ్ము 
కోన సీమ బలమ్ము 
అమ్మ బోయిన దుమ్ము !ఓ..  కూనలమ్మ!

102. రాయల సీమ 

దేవ రాయుల సీమ 
కత్తి గట్టిన భామ 
బలుక కున్నది రామ  !ఓ .. కూనలమ్మ!

103. తెలంగాణ 

కవులకు తెలంగాణ 
కోటి తీగల వీణ 
వెదుక దొరకదు జాణ !ఓ .. కూనలమ్మ!

104. రాజమహేంద్రవరం    

వెలుగు జూడని సందు 
తెలుగు బాషకు ముందు 
ఆంధ్ర దేశము నందు !ఓ .. కూనలమ్మ!

105.ప్రకృతి కి దూరమైన జీవి 

ప్రకృతిని మరువ జనులు 
వికృతు లయ్యిరి ఘనులు 
జూడ కుండిరి మునులు  !ఓ..  కూనలమ్మ!

106.కోడలి పై

కాలు జేతులు బట్టు
రాగ తాళము పట్టు 
పిదప మూలకు నెట్టు !ఓ..  కూనలమ్మ!

107. నా పైన

  నేర్వ నైనను లేదు
  ఇంచుకైనను రాదు
  మెచ్చకున్నను పోదు !ఓ .. కూనలమ్మ!

 108. ముగింపు 

తప్పులను మన్నించి 
ఒప్పులుగ భావించి 
పంప వలె ధీవించి  !ఓ .. కూనలమ్మ!

Tuesday, 18 September 2012

సమస్యాపురణము



26/02/2013
======*======
ముందు వెనుక దారి మందమై గనుచుండ
బంధములను ద్రుంచి బందువువలె,
దండిగ గణ పతిని దల దాల్చు స్వామికి
వందనములు, కోటివందనములు.

23/02/2013
======*=======
శీతలము జేయ తెనుగుకు
నూతన రీతులను దెల్పెను సహజ కవియై
ప్రీతిగ హరిని దలచి నా
పోతన భారతము వ్రాసె బుధులు పొగడఁగన్.

23/02/2013
=======*=====
జగతిలోని వింతలెల్ల జాలమందు జూచి నే
రుగ గన నగరముల జేరి రోగ,భోగములకు తా
సగము జచ్చి దిరుగు సాధు జనులు,క్రూర జనులతో
పగటి పూట భయము తోడ పరుగు బెట్టు చుండగన్
నగర జీవనమ్ము నేడు నరక ప్రాయమయ్యె రా

19/02/2013
ఆటవెలది / సీసము లలో
=======*=========
పాపములను జేయు వాని బార్వతి మెచ్చు
--- నని కలియుగ స్వామి యన్న,బల్కు
లు విని పరుగు బెట్టె లోకనాయకులెల్ల
----పాపములను జేయ వారి బంధు
వర్గములను బిల్చి ,పారిదోషకమును
---- బొందగలరు మీరు పురజనులను
పగలు రాత్రియనక ,వారు వీరనకను
---- చిత్ర హింసల గురి జేసి రమ్ము.
పాప భీతినొదలి ప్రభుతల తోడను
---- చెలిమి వలన గల్గు బలిమి మీకు
రక్త మందు రుచిని భక్తి తోడను గని
--- రెచ్చి పొండి దమరు హెచ్చు గాను |
18/02/2013
========*=====
శ్రీ సద్గురు శంకరులకు,
మా సద్గురు రామజోగి మహనీయులకున్
వాసిగ వరములనీయవె
భాసురముగ జనని,వారి వంశీయులకున్



( రెడ్డి= ఊరి పెద్ద, Manmohan singh )
 F .D . i ల అనుమతులపై
నరులు మెచ్చు శూర్పణఖ సాద్వి లోకైక
సుంద రాంగి , భార్య సొగసు లడవి
నందు పూయు బూలు , విందు పొందు లకై ది
రిగెడి మాన హీన రెడ్డి వార్కి
--------
 కష్ట నష్ట ములందున గలసి మెలసి
కాపురము జేయు భార్య ను కాటి కంపి ,
మాన హీను డై దిరిగెడి మంత్రి గార్కి
శూర్పణఖ సాద్వి లోకైక సుంద రాంగి ,
కష్టములలో ఆదుకొన్న స్వామికి వందనములు