Wednesday 26 February 2014

ఓ.. కూనలమ్మ!

నా మొదటి శతకము శ్రీ ఆరుద్ర గారికి మరియు నా గురుదేవులకు అంకితము.

శ్రీ ఆరుద్ర గారి ( Bhagavatula Sadasiva Shankara Sastry,) కూన లమ్మ పదములు చదివి, యా పదముల ఛందస్సుకు ముగ్ధుడనై వ్రాసియుంటిని. గురుదేవులు, మిత్రులు కూన లమ్మ పదములు చదివి మీ అభిప్రాయమును తెలుపమని వినయమండిత పాదాభివందనములు జేయుచుంటిని. అందరికి శివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలతో..... 

      
1.  ఆరుద్ర గారిపై

రుద్రుడై నారుద్ర
వేయ మనమున  ముద్ర
నిండుకొన్నది నిద్ర  !ఓ.. కూనలమ్మ!

2. కూనలమ్మ! పదముల పై ఆరుద్రగారు

సూర్యుల నడుమ నింద్ర
కావ్య దేవత చంద్ర 
మార్గ మనిరి మునీంద్ర !ఓ.. కూనలమ్మ!

3.కూనలమ్మ పదములు 

మూడు పదముల గూడు
మూడు పంక్తుల మేడు
పెద్ద తిరుపతి లాడు !ఓ..కూనలమ్మ!

4.  చంధస్సు

లఘువు లందున గురువు
గురువు లందున లఘువు
ఉడుము నోటికి మధువు !ఓ.. కూనలమ్మ!

5. యోగి వేమన గారిపై

 యోగి వేమన పాడ
 ఆట వెలదుల తోడ
 కోట గూలెను జూడ !ఓ.. కూనలమ్మ!

6.. శ్రీశ్రీ గారిపై

కుక్క పిల్లను పట్టి
అగ్గి పెట్టెను బెట్టి
కవుల కిచ్చెను చుట్టి !ఓ.. కూనలమ్మ! 

7. ఆది కవుల పై 

మొదలు నన్నయ భట్టు 
పిదప తిక్కన మెట్టు 
ఎక్కె ప్రగడలు చెట్టు  !ఓ.. కూనలమ్మ! 

8. వాల్మీకి గారి పై 

పుట్ట లోనికి దూరి 
బాణముల నే నూరి 
వ్రాసె గ్రంధము కోరి  !ఓ.. కూనలమ్మ! 

9. శంకరాభరణము 

శంకరాభరణమ్ము 
కవుల కాభరణమ్ము 
శంకలకు చరణమ్ము  !ఓ.. కూనలమ్మ!

10. .శ్రీ కంది శంకరయ్య గారు 

బాధలందున వారు 
పద్యములనే కోరు
గురువులందున వేరు !ఓ... కూనలమ్మ!

11. శ్రీ నేమాని వారి పై 

సకల వృత్తము లందు 
హరుని నామపు విందు 
వారికి ప్రణతు లందు !ఓ.. కూనలమ్మ!

12. శ్రీ చింతా వారి పై 

కంద గణములు వేసి 
గర్భ గీతులు వ్రాసి 
జూపు చింతలు  కోసి  !ఓ.. కూనలమ్మ!

13. రాజకీయ నాయకులు . 

ఆడుచున్నది కోతి
పాడు చున్నది నీతి
వేడుకన్నది జాతి !ఓ.. కూనలమ్మ!

14.రాజకీయ నాయకులపై

కష్టకాలము వచ్చె
ఇష్టదైవము మెచ్చె
జనులు మాత్రము చచ్చె !ఓ.. కూనలమ్మ!

15. నేడు భూమాత 

నిండినది నరకమ్ము
ఎండినది స్వర్గమ్ము
మండినది భువనమ్ము !ఓ.. కూనలమ్మ!

16. రోగులపై 

కోటు లుండిన వాడు 
కొడుకు లుండిన వాడు 
కూటికి వగచె జూడు !ఓ.. కూనలమ్మ!

17.  ధీశాలి

ఎవరు నేమని యన్న
సాగుచుండును రన్న
తోడు రారని విన్న !ఓ..కూనలమ్మ!

18.  పిరికి వాడు

బ్రహ్మ పత్తన మందు
రంభ యిచ్చిన విందు
వెదకు చుండును సందు !ఓ..కూనలమ్మ!

19.  కామాంధులపై

గ్రుడ్డు కోరిన కామి
గురువు నైనను నేమి
పగుల కుండెను భూమి !ఓ..  కూనలమ్మ!

20. అధికముగా తిను వారి పై     

తినుడు తినుడని భోగి
వలదు వలదని రోగి
నడుమ నిలచెను త్యాగి !ఓ.. కూనలమ్మ!

21.  అక్రమార్కులు

వారు దోచిన నొప్పు
పరులు జూచిన తప్పు
కవులు వ్రాసిన తుప్పు !ఓ.. కూనలమ్మ!

22,  కోట్లు కూడ బెట్టిన

కూడ బెట్టిన డబ్బు
తరతరాలకు మబ్బు
కూడి వచ్చును జబ్బు !ఓ..  కూనలమ్మ!

23. భగవద్గీత

ఖ్యాత బంధువు జచ్చె
గీత గురుతుకు వచ్చె
వినెడి వారలు మెచ్చె !ఓ.. కూనలమ్మ!

24. ధర్మ రాజు

చచ్చి పడ్డది దంతి
వేసె వేగ వదంతి
నీతి నిగమపు దొంతి !ఓ.. కూనలమ్మ!

25. నేటి మహిళ

జోడు గుర్రపు స్వారి
చేయుచున్నది నారి
వెన్న ముద్దలు కోరి !ఓ .. కూనలమ్మ!

26. నాయిక పై

అంద మంతయు నొలుక
ఆడు చున్నది చిలుక
అమ్మ జెప్పెను కనుక !ఓ .. కూనలమ్మ!

27. యువతి వద్ద సెల్లు

యువతి బట్టగ సెల్లు
చిలుక బలుకులు ఫుల్లు
ఆగ నన్నది ముల్లు (బిల్లు) !ఓ .. కూనలమ్మ!

28. సెల్ ఫోన్

యవత కరమున సెల్లు
చెవికి పెట్టును చిల్లు
తల్లి దండ్రులు కుళ్ళు  !ఓ.. కూనలమ్మ!

29. నేటి యువకులు 

మంచి బుద్ధులు మరచి
భుజము గట్టిగ చరచి
తిరుగు నన్నియు మరచి !ఓ.. కూనలమ్మ!

30. పుట్టు మచ్చలపై  

 చర్మ మంతయు కోసి
 పుట్టు మచ్చలు వేసి
 పొందు చుండిరి గాసి !ఓ .. కూనలమ్మ!

31. ప్రోసెస్డ్ ఫుడ్

తినుట నేర్చిన మ్యాగి
దూర మన్నది రాగి
కాలుడు పిలచు దాగి  !ఓ .. కూనలమ్మ!

32.  కార్టున్ చిత్రములు

తోలు బొమ్మలు జూడు
తూగుచున్నవి నేడు
లోక మంతయు కాడు !ఓ.. కూనలమ్మ!

33. సామాన్యులు పరీస్థితి

రాక్షసత్వము పెరిగి
మంచి యన్నది తరిగి
కొట్టుకున్నది పరిగి !ఓ..  కూనలమ్మ!

34. ఇసుకపై

పసిడి ప్రక్కన నిసుక
దాచగ వలెను కనుక
జోలి పట్టుడు వెనుక !ఓ..  కూనలమ్మ!

35. .సామాన్యులు పదవులు బొందుట  (కేజ్రివాల్ ) 

 విచ్చుకత్తుల నేకి
 గూడు పెట్టెను కాకి
 బోరు నేడ్చెను కేకి !ఓ .. కూనలమ్మ!

36. నీతి 

అప్పు తీరక యున్న
నిప్పు నారక యున్న
నిదుర పోకుర విన్న !ఓ .. కూనలమ్మ!

37. నేటి భక్తుల పై 

ఇల్లు వలదను శివుడు
ఇంటనుండెను భవుడు
వెదుకు చుండెను నరుడు !ఓ..  కూనలమ్మ!

38. శ్రీ కృష్ణుని పై

గీత జెప్పిన వాడు
మాట దప్పెను జూడు
యెంత పిలచిన రాడు !ఓ..కూనలమ్మ!

39. బాదలు తీరు మార్గము 

తీపి బాదలు తీరు
లోక మెల్లను మారు
రామ నామము కోరు !ఓ...  కూనలమ్మ!

40. నేడు అవినీతి కొమ్ము కాయు వారిపై

ఖ్యాతిగా నవి నీతి
యెంచు కొన్నది జాతి
నీడ వెదికెను నీతి !ఓ.. కూనలమ్మ!

41. కూరగాయల ధరలపై

పసిడి సమమై మొన్న
పరుగు బెట్టెను నిన్న
దారి కడ్డము యున్న !ఓ.. కూనలమ్మ!

42. నగలపై

వీధి యందున మగువ
మగని కివ్వని విలువ
పసిడి కిచ్చును చెలువ !ఓ.. కూనలమ్మ!

43.  అత్తగారి పై

నుదుట కుంకుమ బెట్టు
సిగను పూలను బెట్టు
మెడకు కత్తిని గట్టు !ఓ.. కూనలమ్మ!

44. ఓటు విలువ

విలువ యున్నది రాయి
వడివడి విసుర కోయి
పడిపడి వగచ కోయి !ఓ.. కూనలమ్మ!
45. తెలుగు 

తెగులు పట్టగ తెలుగు
వెదుకుచున్నది వెలుగు
పట్టమన్నది పలుగు !ఓ.. కూనలమ్మ!

46. నేటి రక్షక వ్యవస్థ 

కలుగు నున్నది యెలుక
బయట నున్నది నలుక
పట్టు బడినది చిలుక !ఓ.. కూనలమ్మ!

47. గొర్రెల వంటి జనులు వెంట తిరిగిన 

వాడ మెచ్చిన వాడు
జగతి మెచ్చిన వాడు
సుగుణ వంతుడు కాడు !ఓ.. కూనలమ్మ!

48.  నేడు సుతుల కన్న శునకము పై ప్రేమ ఎక్కువ

జేయుచు సిరుల మఖము
జూడరు సుతుల ముఖము
కుక్క నాకిన సుఖము !ఓ.. కూనలమ్మ!

49. శివ కేశవులపై

వరము లిచ్చెడి శివుడు
కరిని గను మాధవుడు
ఎక్కడను మానవుడు !ఓ.. కూనలమ్మ!

50. నేటి జనుల విధము

తండ్రి నైనను జంపు
చెల్లి నైనను పంపు
కుళ్ళు నైనను నింపు !ఓ.. కూనలమ్మ!

51. చదువుకొన్న వారిపై

చదివి పెద్ద జదువులు
పొంది చిన్న కొలువులు
వెదకు యువత మధువులు !ఓ.. కూనలమ్మ!

52. నేటి యువతులపై

వన్నెచిన్నెలు కోరి
వీడు చున్నది సారి
వ్యధలు పొందెను నారి !ఓ.. కూనలమ్మ!

53. కురులు గాలికి వదలి

జడను వేసిన కోతి 
కురులు విడచిన ఖ్యాతి
ఖరము దిరిగెడి రీతి !ఓ.. కూనలమ్మ!

54. విడాకుల పై

మొన్న జరిగెను పెళ్ళి
నిన్న జరిగెను మళ్ళి
వేధనన్నది మళ్ళి !ఓ.. కూనలమ్మ!

55. సాప్టువేరు

అమెరికాలో వేరు
ఇండియాలో జోరు
కుర్ర కారుకు వైరు !ఓ.. కూనలమ్మ!

56. లంచముపై

చూడ మన్నది కరము
ఈయ కున్నను ధనము
నీయ నన్నది వరము !ఓ.. కూనలమ్మ!

57. సింథటిక్ పాలు

పాలు కానివి పాలు
చెప్పులందున తేలు
త్రాగ కుండిన మేలు !ఓ.. కూనలమ్మ!

58. రహదారి

చూడ చక్కని దారి
కాలు బెట్టగ జారి
పాడె పైన సవారి !ఓ.. కూనలమ్మ!

59. రాశి ఫలములు

జూచి మంచిగ రాశి
బయలు దేరెను కాశి
పొందెనాతడు గాసి !ఓ.. కూనలమ్మ!

60.  పన్నులపై

పన్ను దీసిన పన్ను
వెన్ను విరచిన పన్ను
కట్ట మన్నది గన్ను !ఓ.. కూనలమ్మ!

61. చీమ

నేడు ఏంతో ఘనము
బ్రతుక వలెనుగ మనము
దాచు కొన్నను సుఖము !ఓ.. కూనలమ్మ!

62. మనో పక్షవాతము 

ఏమి జరిగిన గాని
అడుగు కదుపగ లేని
వాని జెలిమియె హాని !ఓ.. కూనలమ్మ!

63. ఆసుపత్రి 

వ్యాధి ముదిరెను నీకు
కాలు కదుపగ బోకు
రొక్క మివ్వుడు మాకు !ఓ.. కూనలమ్మ!

64. నేటి యువకులు 

వాహనమ్మును కడుగు
దేహ మంతయు మురుగు
దేశ మంతయు దిరుగు !ఓ.. కూనలమ్మ!

65. వారసులపై

నిండె ధాన్యపు జల్ల
వచ్చె వారసు లెల్ల
అగును పెట్టెలు డొల్ల !ఓ.. కూనలమ్మ!

66. షేరు మార్కెట్ 

నిమిషమున కొక మారు 
పతన మైనను షేరు 
గుండె క్రిందికి జారు !ఓ.. కూనలమ్మ!

67. శుద్ధి జేసిన నీరు 

సూక్ష్మ జీవులు లేవు 
నలుసు లన్నవి రావు 
దగ్గర బడును చావు !ఓ.. కూనలమ్మ!

68. దొంగల రాజ్యము 

నీకు నిచ్చితి నింత 
నాకు వచ్చెడి దెంత 
గట్టు జనులకు గంత !ఓ.. కూనలమ్మ!

69. బంధువులపై 

వలస పక్షులు వీరు 
ఎందుకూ  కొర గారు 
ఉసురు దీయక పోరు !ఓ.. కూనలమ్మ!

70. దొంగ స్వాములపై  

భక్తి గీతము పాడు 
ముక్తి దీక్షలు కూడు 
రక్తి విడువక పోడు  !ఓ.. కూనలమ్మ!

71. మధ్యతరగతి 

భిక్ష మెత్తగ లేక 
జేయు పనులకు పోక 
పెట్టు నాకలి కేక  !ఓ.. కూనలమ్మ!

72. సినిమా లపై 

పాడు పదముల తోడ 
ఆరు ఫైటుల తోడ 
మాడు పగులును జూడ  !ఓ.. కూనలమ్మ!

73. జీవిత భీమా ప్రకటన లపై 

నీవు జచ్చిన నాన్న 
ఏమి జేయుదు నన్న 
జూపు సుతునకు సున్న !ఓ.. కూనలమ్మ!

74. సరస్వతి - లక్ష్మి 

ఎలిమి నిచ్చెడి యమ్మ 
కలిమి నిచ్చెడి యమ్మ 
నడుమ నలిగెను బొమ్మ !ఓ.. కూనలమ్మ!

75. శ్రీనివాసుని పై   

ఘనుడవు కలియు గాన 
చెంత లేదుగ జాణ 
నిజము దెలుపగ లేన !ఓ.. కూనలమ్మ!

76. భారత మాతపై  

భరత మాతను గనుడు 
భగ్న మయ్యెను వినుడు 
రాజ దానికి జనుడు !ఓ.. కూనలమ్మ!

77.గుడ్డి ప్రేమ

శిక్ష వేసిరి నాడు
గుడ్డి ప్రేమకు నేడు
గుడిని గట్టిరి జూడు !ఓ .. కూనలమ్మ!

78. శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారిపై 

వేయి పడగల మీద
విశ్వనాధుని రాధ
నాట్యమాడెను గాద  !ఓ...  కూనలమ్మ!

79. డా : సినారె గారిపై 

ఉర్దు బాషను జదివి
తేట తెలుగున మనవి
జూడు జ్ఙానుడి తెలివి !ఓ .. కూనలమ్మ!

80. రాష్ట్ర విభజన 

మూడు ముక్కల మధ్య
పాతి బెట్టె సయోధ్య
నేడు మిగిలెను మిధ్య !ఓ..  కూనలమ్మ!

81. భీష్ముడు 

తండ్రికిచ్చిన మాట
పరచె ముళ్ళను బాట
విడచె చివరకు వేట !ఓ .. కూనలమ్మ!

82.తత్వము 

నిన్ను గెలచిన నీవు
కీడు జేయగ లేవు
ఝాట మాటలు రావు !ఓ..  కూనలమ్మ!

83. సిగ్గు విడచిన అమ్మడు 

సిగ్గు చీరను జింపి
బొగ్గు రసమున నింపి
స్నానమాడును హంపి !ఓ .. కూనలమ్మ!

84. సిగ్గు విడచిన వాడు 

సిగ్గు దుప్పటి మడచి
అడ్డదారిని నడచి
దొరల మందురు తెరచి !ఓ..  కూనలమ్మ!

85. మద్యపాన వ్యసనుడు 

చంద్ర మండలమందు
నీటి జాడలు గందు
మధ్యముండిన ముందు !ఓ..  కూనలమ్మ!

86. సీరియళ్ళు 

వనితల కొరకు వనిత
చెప్పు చుండును కవిత
ముగియ దెన్నదు ఘనత !ఓ..  కూనలమ్మ!

87. శకుని 

భీష్మ యోధుని బలుకు 
ఎంత జెప్పిన వినకు 
శకుని మామకు వణుకు  !ఓ .. కూనలమ్మ!

88.చిన్నయ సూరి గారిపై

వ్రాసె చిన్నయ సూరి
వ్యాకరణమును నూరి
జూపె జనులకు దారి !ఓ..  కూనలమ్మ!

89. పాపపు సొమ్ము 

దుష్ట జనులకు సిరులు
సజ్జనుల కది మిగులు
మూర్ఖుల శిరము పగులు !ఓ..  కూనలమ్మ!

 90. మోసము 

వజ్రపు విలువ తరగె
భూముల విలువ పెరిగె
జనులు మోసము మరిగె !ఓ.. కూనలమ్మ!

91. లోకులు 

అయిన వారికి యాకు 
కాని వారికి పాకు 
లేని వారికి మేకు !ఓ.. కూనలమ్మ!

92. మధు మేహము 

రక్తమందున తీపి 
గుండె వేగము నాపి 
పట్టి యుండెను తాపి  !ఓ.. కూనలమ్మ!

93. రామ యన్న నేడు తప్పు 

రామ నామము బలుక 
పారు చున్నది ఎలుక 
కూడి వచ్చెను చిలుక !ఓ.. కూనలమ్మ!

94. రాక్షస భక్షణ 

రాత్రి యందున దినుచు 
కర్మ ఫల మిది యనుచు 
నన్ని వేళల వగచు !ఓ.. కూనలమ్మ!

95. కూనలమ్మ పదములు చదివు వారికి  కూనలమ్మ పదములు వ్రాయు శక్తి నిమ్ము 

ప్రభువు లే కానిమ్ము 
చదువు వారికి యిమ్ము 
కోరినంత బలమ్ము !ఓ.. కూనలమ్మ!

96. 

కోపగించక సారు 
వ్రాయ గలిగిన మీరు 
చేత బట్టుడు తారు !ఓ.. కూనలమ్మ!

97.  మన రాష్ట్రపతిపై

 ఆడమన్నది యాడు
 పాడమన్నది పాడు
 కూడ దన్నను కీడు !ఓ .. కూనలమ్మ!

98. ఎర్ర చందనము 

ఎర్ర చందన మన్న 
వేడి పుట్టున రన్న 
వేల్పు కంటెను మిన్న !ఓ..  కూనలమ్మ!

99. చెత్త 

చెత్త యందున సిరులు 
వెదకు చుండిరి నరులు 
పరుగు బెట్టె పురుగులు   !ఓ .. కూనలమ్మ!

100. గణక యంత్రము 

మీట నొక్కిన జాలు 
తోక బట్టిన జాలు 
జూపు లోకపు కీలు !ఓ .. కూనలమ్మ!

101. కోన సీమ 

నారి కేళ జలమ్ము 
కోన సీమ బలమ్ము 
అమ్మ బోయిన దుమ్ము !ఓ..  కూనలమ్మ!

102. రాయల సీమ 

దేవ రాయుల సీమ 
కత్తి గట్టిన భామ 
బలుక కున్నది రామ  !ఓ .. కూనలమ్మ!

103. తెలంగాణ 

కవులకు తెలంగాణ 
కోటి తీగల వీణ 
వెదుక దొరకదు జాణ !ఓ .. కూనలమ్మ!

104. రాజమహేంద్రవరం    

వెలుగు జూడని సందు 
తెలుగు బాషకు ముందు 
ఆంధ్ర దేశము నందు !ఓ .. కూనలమ్మ!

105.ప్రకృతి కి దూరమైన జీవి 

ప్రకృతిని మరువ జనులు 
వికృతు లయ్యిరి ఘనులు 
జూడ కుండిరి మునులు  !ఓ..  కూనలమ్మ!

106.కోడలి పై

కాలు జేతులు బట్టు
రాగ తాళము పట్టు 
పిదప మూలకు నెట్టు !ఓ..  కూనలమ్మ!

107. నా పైన

  నేర్వ నైనను లేదు
  ఇంచుకైనను రాదు
  మెచ్చకున్నను పోదు !ఓ .. కూనలమ్మ!

 108. ముగింపు 

తప్పులను మన్నించి 
ఒప్పులుగ భావించి 
పంప వలె ధీవించి  !ఓ .. కూనలమ్మ!