Thursday 4 January 2018

సంతసమ్ములేవి ? సరసి జాక్ష!

ఆ. వె. 1)
ఇసుక తిన్నె లందు నింతుల తోగూడి
పచ్చికాయలన్ను పగుల గొట్టి
పంచు కొనుచు దిన్న ఫలముల దాగిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
మావూరులో ఎక్కువగా ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటూ పచ్చి దోస చింత మామిడి కాయలు అందరికీ చాలకపోతే మిత్రులతో పంచుకున్నాము.

ఆ. వె. 2)
అన్నమందు గలుప నావకాయయు లేక
కారమునను ఉప్పు కలిపి పప్పు
నూనెతోడ దినుచు నేను పొందిన నట్టి
సంతసమ్ములేవి ?సరసి జాక్ష !
అమ్మ లేని సమయంలో ఆకలి వేస్తే దగ్గరగా దొరకిన ఉప్పు కారం కలుపు తిన్నాం. ఆవకాయ జాడీ ఎక్కడో పైన ఉండేది. ఆ జాడీ అందక అలా కానిచ్చాం.
ఆ. వె. 3)
పేక ముక్కలకయి పెద్ద యుద్ధము జేసి
పొందితి ధన మనచు పొంకమలర
బుట్టలందు నేను పొరలగా దాచిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
అప్పుడు బచ్చాలాట అనేవారం పేకముక్కల కొరకు కోట్టు కున్నాం. ఆ ముక్కలు డబ్బు వలె దాచుకున్నాము.
ఆ. వె 4)
సందు సందు లందు విందు జేయుచు నాడు
పిల్ల వాని వలెను చల్ల జేసి
పూరి గుడిసె లందు పొంగి పొరలె నట్టి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
పూరి గుడిసె లో నున్న ఆనందం ఇప్పుడు మేడలో కలుగుట లేదు.

ఆ. వె. 5)
చెట్టు లెక్కి కోసి చింత కాయలు మరి
కనులు మూసి దినిగ కమ్మని రుచి
యద పొరల నడుమన గుది గున్న నానాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చింతకాయలు ఉప్పు కారంతో తినుచు పులుపు కు కనుమూసి ఆనందాన్ని కళ్ళలో దాచుకున్నాను .
ఆ. వె. 6)
ధనము కంటె నధికమని జేబులను నింపి
చెంత జేరు వారి చెలిమి కోరి
చేత బట్టి నట్టి చింతగింజల తోడ
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్న నాడు ధనము కంటె చింత గింజలకు ప్రాదాన్యం ఇచ్చాము. చింత గింజలను మిత్రులకు పంచెడి వాడిని.
ఆ. వె. 7)
చార్మినారు పెట్టె సగము ధర యనుచు 
విల్సు దొరకిన కడు విలువ యనుచు 
గోల్డు ఫ్లాకు దొరక గొప్ప దనుచు నాటి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
మేము చిన్న నాడు ఆడుకోనేవారం చార్మినార్ కు 1 , విల్సు కు 2 , గోల్డెన్ కు 10 ఇచ్చి పోందిన ఆనందం.. నాకు ఎటువంటి అలవాట్లు లేవండి..
ఆ. వె. 8)
మేడను మరి గట్టి , మేటి సిగారులు
దెచ్చి మాగురువుల కిచ్చి నేను
మురిసితిని గదయ్య ముద్దు బెట్టగ నాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
సిగారులు = సిగరెట్టు పెట్టెలు,
మంచి మేడలు కట్టి ఆడుకున్నాము. స్కూల్ గోడలకు బొమ్మ గడియారం సిగరెట్టు పెట్టెలతో పెట్టినపుడు మా టిచర్ గారు నాకు ముద్దు పెట్టారు.
ఆ. వె. 9)
కోరి యాడితిమిగ కోతి కొమ్మచ్చి యాట
కోతికి సమమనుచు ఖ్యాతి గాను
చెట్టు చివర జేరి శిఖరము గాంచిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్న నాడు కోతి కొమ్మచ్చి యాట పెద్ద చెట్లు ఎక్కి ఆడేవాడిని, ఆ చెట్టు మరొకరు ఎక్కకూడదని, దొంగ కు దొరక కూడదని..
ఆ. వె. 10)
గుప్త ధనమనుచును గురిజూచి గొట్టగ
నెగిరి పడిన గింజ నేరి కోరి
చేత బట్టి నట్టి జీడి గింజల తోడ
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్న నాడు ధనము కంటె జీడి గింజలకు ప్రాదాన్యం ఇచ్చాము. జీడి గింజలను మిత్రులకు పంచెడి వాడిని. జీడి గింజలను గురిజూచి కొట్టిన ఆ గింజ ఇక మనదే..
ఆ. వె. 11)
తాటి పండు తెచ్చి వాటముగా గాల్చి
టెంకలు మును చీల్చి బింకముగను
పంచుకు దినినట్టి పంచదారల వంటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్న నాడు తాటి కాయలను కాల్చుకు తినేవాళ్ళం
ఆ. వె 12)
తాటి యాకును మరి తాంబూలమును జేసి
నోరు పండ బెట్ట జోరుగాను
కుక్క ద్రాక్ష పళ్ళు పుక్కిట బెట్టిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
తాటియాకులను కుక్క ద్రాక్ష పళ్ళు కలిపి తింటే నోరు పండేది .
ఆ. వె. 13)
నెమలి యీక దెచ్చి నేర్పు తోడను బెట్టి
పెరుగు చున్న దనుచు మరులు గొనిన
పుస్తకమున తినగ పువ్వారమును బెట్టి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
పువ్వారమును= లేత తాటియాకుకు బట్టు దూదె వంటిది
పుస్తకం మధ్యన నెమలి యీక పెట్టి దానికి పువ్వారమును పెట్టి రోజూ దానిని చూసి పెరిగినదని మిత్రులను నమ్మించితిని.
ఆ. వె 14)
ఆకులు ఘన మైన చాకులుగా మార్చి
కోసి దుంపలలను వాసి గాను
తాటి టెంక దెచ్చి తాపసి జేసిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
తాటియాకులను చాకని సిలగడ దుంపలను కోసి తినేవాళ్ళం.
.ఆ. వె 15)
పంచు కొని దిన ఘన పంచ దార యనుచు
నమ్మిపంచె నాడు నలువురికిని
కరచి యిచ్చి నదియె కాకెంగిలి యనినా
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
గట్టివి గుడ్డను బెట్టి కరచి ముక్కలు జేసి పంచితిమి
ఆ. వె. 16)
తెల్లవారుఝాము చల్లని తేగలు
పంచు కొనుచు దినిన మంచి దనుచు ,
చందమామ పైన చక్కగా వ్రాసిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
తాటి తేగలను కాల్చి రాత్రి పూట మంచులో పెట్టి, తెల్లవారుఝామున తెచ్చి మొదలు భాగం పెద్ద వారికి పెట్టి తినమనేవారు. తేగ మధ్య మొలక భాగం చందమామ పైన
వ్రాసిన మంచి జరుగు అనేవారు.
ఆ. వె. 17)
వెన్నెలందు నాడ వీధులోనికి వచ్చి
నన్ను వెంబడించు సన్ను తించ
చందమామ జూడు విందు జేయుచు నన్న
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
నేను పిలిచిన నా వెంట చందమామ వచ్చును జూడు అని స్నేహితులను నా వెంట తీసుకు పోయేవాడిని, పొర పాటున కూడా వారి వెంట నేను వెళ్ళెడి వాడను కాదు.
ఆ. వె. 18)
గురికి జిక్కిన నొక గోళీ విజేతనని
కోట గోడ నెక్కి కూర్మి నోంది
యదను జీల్చి జూపె నెల్లరకును నాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్న నాడు ధనము కంటె గోళీలకు ప్రాదాన్యం ఇచ్చాము. గోళీలను ఎన్ని సంపాదించామో మిత్రులకు చెప్పెడి వాడిని.
ఆ. వె 19)
కాగితపు పడవను కాలువ నందున
వదలి దాని వెనుక పరుగుబెట్టి
తనివితీర నేను తడిసి ముదైన నా
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
కాగితపు పడవలు వాననీటికి వదలి , అవి పరుగులు పెడుతుంటే వాటివెంట నేను పరుగులు పెట్టాను.
ఆ. వె 20)
గూడు పడవజేసి కూరగాయలు మోయు
వాహనమ్ము వచ్చె వడివడిగను
రండనుచును నేను రమ్యముగ పిలువ
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
పడవలు కూరగాయలు పాలకోల్లు సంతకు తీసుకు వెళ్ళెవి, నావ వారు వచ్చిన తరువాత చాలా తొందర పెట్టెవారు .
ఆ. వె 21)
భువిని దొరకు నట్టి నవనీతమను తాటి
ముంజులకయి వ్రేలు ముల్లు జేసి
ముంజులు దిని నేను పొందిన యానాటి
సంతసమ్ములేవి ? సరసి జాక్ష!
ముంజులు ఎక్కువగా తిని కడుపు నొప్పి అంటే కాస్త ఆవకాయ పచ్బచటి బద్ద తినమనేవారు. ఆవకాయ తింటే నొప్పి తగ్గెది.
చాలా ఎక్కువగా తినేవాడిని.
ఆ. వె 22)
ఆడు కొనుట నేర్చి యానందమును బిల్చి
బంక మన్ను దెచ్చి బండిజేసి ,
బొంగరమును జేసి రంగు వేసిన నాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
బంకమన్నుతో ఎన్నో పాత్రలు, బండి ట్రాక్టర్ మరెన్నో చేసి ఆడుకున్నాము. బొంగరంకు ఇంకు కాయల రంగు వేసి త్రిప్పెవారు.
ఆ. వె 23)
బుగ్గి జేయక మరి యగ్గి పెట్టెలను దా
రమున కట్టి నేను రైలు బండి
జేసి యందు నిసుక పోసి త్రిప్పిన నాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
అగ్గి పెట్టెలతో గూడ్స్ రైలు జేసి చింత గింజలను, ఇసుక వేసి త్రిప్పెవాడిని.
ఆ. వె 24)
పురపు వీధులందు ముంజికాయల బండి 
త్రిప్పియుంటినిగద నొప్పి యనక 
చక్రధారి వలెను సద్దు జేయుచు నాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
ముంజులు తిన్న తరువాత కాయలతో తాటి కమ్ములతో బండి కట్టి ఊరు మొత్తము తిరిగెడి వాడిని.
ఆ. వె 25)
తాటి గులక లన్ను వాటముగా గాల్చి 
ఉప్పు గలిపి నూరి నిప్పు కొరకు 
త్రిప్పి యాడు నట్టి త్రిప్పుడు పొట్లపు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
దీపావళి కి త్రిప్పుడు పొట్లము త్రిప్పు నపుడు నిప్పు రవ్వలు మన చుట్టూ పడేవి.
ఆ. వె 26)
పెద్ద వానలకయి వద్దు వద్దన్నను
కప్పను మరి బట్టి త్రిప్పితిమిగ
పురపు వీధులందు పొంకమలర 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
పెద్దలు వద్దన్నా, వానలు కురియాలని కప్పను పట్టి ఊరేగించారు.
నేను వారిని వెంబడించాను.
ఆ. వె. 27)
కోరి నట్టి మంచి దారపు ముక్కలు 
పెంటలందు నాడు కంట బడిన 
సొంతమనుచు పట్టి చుట్ట జుట్టిన నాటి
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
నరసాపురం లేసుకు ప్రసిద్ధి, పనిరాని లేసు ఫీసు లను బయట పారవేసేవారు. సన్న, లావు అను రెండు రకముల దారములు ఉండేవి. సన్న దారము చాలా గట్టిగా ఉండేది. ఆ దారం దొరికితే మన గాలిపటమును ఎవ్వరు ఏమీ చేయలేక పోయేవారు.
ఆ. వె 28)
కుండ పెంకులు మరి కుప్పిగంతులు వేయ 
నీటి పైన విసర నేర్పు తోడ
కుండ పెంకులకయి కుమ్మరింటకు చను 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
కొంచెం నేర్పుగా విసరితే నీటిపైన కుండ పెంకులు గంతులువేసేవి .
ఆ. వె 29)
ఏరికోరి కోసి నేరేడు పండ్లను
వారిజాక్షు లకయి వేరు జేసి
ఇచ్చి యుంటిమి గద ఇచ్చికముగ నాటి
సంతసమ్ములేవి ? సరసి జాక్ష!
నేరేడు పండ్లు లెక్కకు మిక్కిలి తింటిమి. మంచి రుచిగల పండ్ల చెట్లను ఏరి కోరి కోస్తిమి. ఆడపిల్లలు అడిగిన మంచివి ఇచ్చెవాడిని. జేబుల నిండా పెట్టెడి వాడిని.
ఆ. వె 30 )
నీట మునిగి నేను నేరము జేయని
దొంగను వెదకితిని దొరతనమున
మునిగి తేలుచు మును పొందిన ఘన మైన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
కాలువ నీటి నందు దొంగా పోలిసు ఆడితిమి.
ఇప్పుడు ఆ కాలువను చూచిన వద్దు మునగ వద్దు అనిపిస్తున్నది.
ఆ. వె 31)
ఈత గొట్టుచు మరి యీదరి నుండి యా
దరికి జేరిన మది కరిననుచును 
మునిగి తేలు చుండ పొందిన ఘన మైన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
కాలువ యీదరి నుండి ఆదరికి, ఆ దరినుండి యీదరికి వచ్చిన వాడు గొప్ప వాడు
ఆ వె 32)
ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన
పద్యమునను వినుచు పరవసించి
మరల చెప్ప మనుచు మారాము జేసిన
సంతసమ్ములేవి ? సరసి జాక్ష!
"ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన " పద్యం చాలా సార్లు మా అమ్మ గారి నోట వింటూ పరవశుడైతిని.
ఆ వె 33)
భోగిమంట లందు గోగి దండలు వేయ 
గోమయమును దెచ్చి గొప్ప గాను 
రకరకముల పిడకలను జేసి పొందిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
ఆవు పేడకై చాలా దూరము వెళ్ళి తెచ్చి చిన్ని చిన్ని రకరకముల పిడకలను జేసి నా ఎత్తు దండను మెడలో ధరియించి భోగిమంట నందు వేసేవాడిని.
ఆ వె 34)
ఓడుపు గా మడచిన నొక తాటి యాకును 
శబ్దమునను జేయ చక్కనైన 
ఈతముల్లు గుచ్చి ఈలగ జేసిన 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
ఓ కు దీర్ఘము లేదు
తాటి యాకును చుట్టి ఈలగ జేసి ఆడుకోనేవారం.
ఆ వె 35)
తెల్లవారుఝాము దినకరా! శుభకరా! 
పాట వినుచు నేను పరవసించి 
పరుగు తోడ పలుక బలపము దెచ్చిన 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
మా నాన్నమ్మ గారు తెల్లవారుఝాము చదువు మంచిది కావున ఉదయాన్నే చదవమనే వారు. నేను పలుక పై ఆ రోజు మాష్టారు ఇచ్చిన వాటికి సమాధానం వ్రాసి చాలా జాగ్రత్తగా పట్టుకు వెళ్ళెడి వాడను.
ఆ వె 36)
తోలు బొమ్మ లాట నేలపై గూర్చుండి
రంగు రంగులు గని రాత్రి పూట 
బాలలందరు మరి యీలలు వేసిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
నేను చూచిన మొదటి ఆఖరి తోలు బొమ్మ లాటయది , ప్రదర్శన చేసిన వారికి ఇప్పుడు పాదాభివందనములు చేస్తున్నాను. పాపం కుటుంబం మొత్తం పగలు రాత్రి కష్టపడ్డారు. వారికి హారతి పళ్ళెం లో వేసిన చిల్లర దక్కినది అనుకుంటున్నాను. చాలా మంచి హాస్యము తో వారికి తెలిసిన దంతా చెప్పారు. వారికి భోజనం మాత్రం ఓక్కోక్కరికి ఓక్కోక్క ఇంటిలో పెట్టమన్నారు, పెట్టారు
ఆ వె 37)
రోగములను మాన్పు తేగల కొరకయి
సంధ్య వేళలందు చక్కనైన 
పంట పొలము లందు మంటను గాల్చిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
ఈ కాలములో వరి గడ్డి విరివిగా దొరకును , గడ్డి మంటలో తేగలు కాల్చి రాత్రికి ఇంటికి తెచ్చేవారు. తేగలు పలు రోగములను నయం జేయును.
ఆ వె 38)
గ్రామ ఫోను నందు రమ్య గీతములను 
మరల మరల వింటి మరులు గొనుచు 
నూరు మారు లైన కోరి వినిన నాటి
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
నా చిన్ననాడు ఎన్నో పాటలు మరీ ముఖ్యముగా "ఓక్కరిద్దరయ్యెది, ఇద్దరోక్కటైయ్యెది ముచ్చటగా ముగ్గురవ్వాలని " పాటకు అర్ధం అప్పుడు తెలియదు కానీ చాలా సార్లు విన్న. నేను 4వ తరగతి లో నుండగ ఈ పాటలు పెట్టడానికి ఓకరు ఉండేవారు, ఆయన కొంచం చూడమని నాకిచ్చి వెళ్ళెవారు. నేను ఈ పాట ట్రాక్ గుర్తుపట్టి సరిగ్గా పాట పూర్తి అయిన తరువాత మరల అదే ట్రాక్ లో పెట్టేవాడిని. వారు అమ్మ గడుగ్గాయి అనేవారు.
ఆ వె 39)
తాటి తాండ్ర జేసి తాటి కాయలు దెచ్చి
పట్టు లేని టెంక వంక జూచి
కోపము వలదనుచు తాపసి జేసిన
సంతసమ్ములేవి ? సరసి జాక్ష!
తాటి తాండ్రకై టెంకలోని గుజ్జు తీసిన తరువాత , టెంకను జూచి నా మిత్రుడు టెంక నీకు శాపము పెట్టును అన్నాడు. కారణం దాని పట్టు వస్త్రములు నేను తీసానట. తరువాత దానిని తాపసిగా మార్చాను.
ఆ వె 40 )
పోంక మలర గాను పున్నమి వెన్నెల 
పలుకరించ రాగ వసుధ మోము 
సొగసును గని, నాటి చుక్కలు లెక్కించు 
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
పున్నమి వెన్నెల లో రాత్రి పూట పడుకుని చుక్కలను లెక్కించెడి వాడిని
ఆ వె 41)
బాణములను చేత బట్టి పాటలు పాడి 
పొందితి బహుమతులు పొంకమలర 
ఇందు వదనుల గను నీ' దసరా 'యను 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
దసరాకు చక్కని వేషములు వేసేవారు. పగటి వేటగాడు వచ్చి చాలా భయపెట్టెవాడు.
ఆ వె 42)
జాగు సేయక మరి దాగుడు మూతలు 
వేసవి సెలవులకు వేది కైన
జీలుగు పొలమందు జేరి యాడిన నాటి
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
దాగుడుమూతలు వేసవి సెలవులకు పొలము లందు సాయంత్ర సమయంలో ఆడుకుంటుమి.
ఆ వె 43)
తోటివారి తోడ నాటలాడుచు నేను 
మానివేసితినని మధ్య మధ్య 
మాయ జేసి జామ కాయలు కోసిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
ఆటలాడుచు మధ్య మధ్య నేను ఆట మాని వేసాను అని స్నేహితులను మాయ జేసి జామకాయలు కోసి తెచ్చెవాడిని.
ఆ వె 44)
చక్కగ తిరిగితిమి సైకిలు టైరుతో 
నాల్గు వీధులందు నవ్వు తోడ
బాలలెల్లరు మరి గోలజేయుచు నాటి 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
సైకిల్ టైరుతో తిరుగుచు నుండ అందరూ వారివెంబడి పరుగులు పెట్టేవారు.
ఆ వె 45)
పొలము గట్ల పైన బలము గాను బెరిగి 
పిల్చు చుండ నన్ను ప్రేమ తోడ 
కంది కాయలు మరి యందు కున్నటువంటి
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
ఎత్తుగా పెరిగిన కంది చెట్లు గాలికి ఊగుచూ రమ్మన్నట్లు ఉండేవి
ఆ వె 46)
రమ్యమైన మేటి రామకీర్తనలతో
తిరుగు రామదాసు తీరుగాను,
హరి హరియను నాటి హరి దాసులను గను
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
ధనుర్మాసం ప్రారంభం సందర్భం గా శుభాకాంక్షలతో...
ఆ వె 47)
మార్గ శిరము నందు మధుసూదనుడి గాను 
దెలుప వశము గాని దివ్యమైన 
విష్ణు నామములను విను తిరుప్పావైల 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
చిన్ననాట తిరుప్పావైలు వింటే మనసు పులకరించేది
ఆ వె 48)
చక్క నైన నొక్క సన్నాయి చేబట్టి 
గంగిరెద్దును మరి వంగమనగ 
గంగిరెద్దు వెనుక గంతులు వేసిన 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
సన్నాయి అప్పన్న చెప్పినట్లు తల యాడించి , వంగి వంగి నడచిన గంగిరెద్దును మరువలేకున్నాను..
ఆ వె 49)
వేడి పాలలోన వేసిన నటుకులు 
పొందగ మధురసము పొంకమలర 
కొంచమనుచు నాడు కోరి తినిన యట్టి 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
చిన్ననాడు పాలతో అటుకులు బెల్లము కలిపి తిన్నప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు కలుగుట లేదండి.
ఆ వె 50)
బిడ్డ నెత్తు కొనగ ప్రీతితోడను గ్రుచ్చె 
రేగుముల్లు నన్ను లాఘవమున 
జేబు నిండినదని చెప్పి వచ్చిన నాటి 
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
1996 లో గండిపేట చెరువు చూడడానికి వెళ్ళి జేబు నిండుగ రేగు కాయలు కోసినప్పుడు ముళ్ళు గ్రుచ్చు కుంటే పర్వాలేదు నాకివి తీపి గుర్తులని చెప్పి వచ్చితిని.
ఆ వె 51)
మంగళకర మైన రంగు రంగుల రంగ 
వల్లులు గని మురిసె పల్లె లెల్ల 
పల్లెటూరి యందు పరవశుడైన యా 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
వీధులందు మంచి మంచి ముగ్గులను లెక్కవేయుచు వెళ్ళిన రోజుల సంతోషం మరల రాదండి.
ఆ వె 52)
తెల్లవారుఝాము తెలిదమ్మి కంటిని
జూడ బోవ హితుల తోడ వేగ
పురహితుండు బంచు పొంగలి దినినట్టి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్ననాడు రామాలయం లో వేకువ ఝామున పూజ చేసి పొంగలి పెట్టెవారు. పిల్లలం విడచీ విడువని మందార వగైరా పూలు కోసి పట్టుకు వెళ్ళెవారం . చలిని లెక్కజేయక తెల్లవారుఝాము న పూలు, మొగ్గలు కోయ మా చేతిలోని వేడికి పాపం మందార మొగ్గలు విచ్చుకునేవి.
ఆ వె 53)
చక్కనైన ముళ్ళు సరిహద్దుగ నిలచు 
బ్రహ్మ జెముడు కాయ రమ్యముగను
కష్టమనక కోసి కాయలు దినినట్టి 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
ఈ బ్రహ్మ జెముడు చాలా అరుదుగా ఎర్రని కాయలు కాస్తుంది, అవి స్ట్రాబెర్రి వలె మంచి రుచిగా ఉంటాయి. ఆకాయలు కోసినప్పుడు తప్పక ముళ్ళు గ్రుచ్చు కుంటాయి.
బ్రహ్మ జెముడు ను తోటలకు సరిహద్దు లందు పాతేవారు . గత 15సంవత్సరముల నుండి ఈ మొక్కలు కనిపించడం లేదు.
ఆ వె 54)
పాలవంటి యిసుక పాదములు కడుగ 
అలుపు సలుపు లేక నలల వలెను 
మరులు గొనుచు నాడు పరుగుబెట్టినా 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
నేను తోమ్మిదవ తరగతి లో కూడా సైకిల్ ఇసుకలో త్రోసుకు ఇంటికి వెళ్ళలేక అర కిలోమీటరు దూరం లో చుట్టాల ఇంటిలో పెట్టెవాడిని.
ఇప్పుడు ఇసుక కూడా గట్టి పడింది, సందులు సిమ్మెంట్ రోడ్లు వేసారు
ఆ వె 55)
కప్ప పీత చేప కాకోదరము నత్త 
కలసి మెలసి దిరుగ కొలను నందు 
కలువ పూల నడుమ గాంచిన యానాటి 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
కొల్లేరు ప్రాంతం కొలనులలో
కప్పలు, పీతలు, చేపలు ,పాములు మరియు నత్తలు, కలువలు విరివిగా కనిపించేవి , వాటిని తదేకంగా చూచుట వల్ల నయనమనోహరంగా ఉండేది, పాములంటే భయము ఉండెడిది కాదు.
ఆ వె 56)
తిరుమలేశు గాంచి తిరిగి వచ్చునపుడు 
గిరుల నడుమ పాము గిరగిర మను 
నట్లు బాట సొగసు నాదమఱచి గాంచు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
చిన్ననాడు తిరుమల తిరుపతి లోని స్వామిని జూచి తరువాత కోండల నడుము తిరుగు బాట ను గాంచిన బ్రహ్మానందము నేడు కలుగట లేదు
ఆ వె 57)
అగ్గి పెట్టెలవలె నగపడు వాహన
ములను గాంచి నాడు ముదము తోడ
శ్రీనివాసుని మరి చిత్త మందు నిలుపు
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
తిరుపతి అంటే నాకు గుర్తుకు వచ్చేది, తిరుమల కు నా చిన్ననాడు వెళ్ళుటకు వచ్చుటకు రోడ్ ప్రస్తుతం క్రిందకు దిగుతున్న రోడ్డే, అప్పుడు కోండ పైవరకు వెళ్ళి క్రింద వచ్చు వాహనములను జూచిన అవి చాలా చిన్నగా కనిపించేవి . చిన్న చిన్నవి ఏమిటని అడిగితే స్వామి సేవకు సరకులు తీసుకు వెళ్ళు వాహనములు అన్నారు.
ఆ వె 58)
ముసురు చుట్టు ముట్ట ముప్పును దప్పించ
పెద్దగ పిడకల్ ను పేర్చి నాడు
గూడ బెట్టుట కయి గోమయమును ద్రొక్కు
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్ననాడు పాలేరు తోపాటు వలదన్న పేడ త్రొక్కి పిడకలు చేయుటకు సహాయ పడితిని. పేడ ధాన్యపు పొట్టుతో ముద్దలు చేసి కాలువ ఆవలి గోడకు పిడకలు కొట్టేవారు ఎండిన తరువాత తెచ్చి గూడు పెట్టేవారు. వర్షకాలము వంటకు సమస్య లేకుండా ఉండేది.
ఆ వె 59 )
ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు
ఏడు రాళ్ళు దెచ్చి యెత్తుగ బెట్టి నే
బంతితోడ గొట్ట పరుగు బెట్టె
మిత్రులెల్ల రంత, మీదపడగ బంతి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
ఏడు పెంకులాట , ఏడు పెంకులను పేర్చి బంతితో పడ కొట్టిన వెంటనే ప్రత్యర్థి మన వీపు వాయించుటకు ప్రయత్నం జేయును వారికి దొరకకుండా మరల ఏడు పెంకులను పేర్చిన మనదే గెలుపు...
ఆ వె 60)
పట్టు తప్పి నట్టి వరి కంకులను మరి
తడిమి తడిమి యేరి దరికి వచ్చు
పిచ్చుకలు దినుటకు పేర్చి కూర్చిన నాటి
సంతసమ్ములేవి ?సరసి జాక్ష!
వరికంకులు కట్టు వేళలందు కొన్ని పనకు జేరవు వాటిని పరగ అనేవారు, ఆ పరగనేరి పిచ్చుకలకై చాలా అందమైన గుడి గంట వలె అల్లేవారు గుడిలో ఇంటి లో పెట్టేవారు , ఇప్పుడు ఆ అల్లిక తెలిసిన వారు బహు అరుదుగా ఉంటారు. నేను ఓసారి యేరాను.
ఆ వె 61)
కొబ్బరాకు దెచ్చి కోరిన వారిని
కూనలమ్మ జేసి కోయ వాని
వలెను ఓహొ ననుచు పరుగులు బెట్టిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
కొబ్బరాకు పై కూర్చుండ బెట్టి వీధులందు త్రిప్పెవారు. గుర్తుజేసిన రాజు గారికి ధన్యవాదములతో..
ఆ వె 62)
తోకలేనియట్టి మేకలను దినుచు 
దుముకుచు వడివడిగ దూరమేల్ల 
బలము గల్గి నట్టి పులిని గట్టిన నాటి
సంతసమ్ములేవి ?సరసి జాక్ష!
నేను పులిని కట్టినది పులి మేక ఆటలో నండి.
ఆ వె 63)
రైతులు రథమనెడి రీతి సస్యపు క్షేత్ర
మంద నవరతమ్ము నండయైన
నెడ్ల బండి పైన నెక్కి దిరిగి నట్టి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్ననాడు ఎడ్ల బండి రథము నెక్కిన సంతోషం పొందితి నండి.
ఆ వె 64)
ఆంగ్ల వత్సరాది యారంబ మున శుభా
కాంక్షలు దెలుపుటకు కనుల విందు
జేయు చిత్ర తార చిత్రములను పంపు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
Happy New Year అని వ్రాసి మిత్రులకు
గ్రీటింగ్ కార్డులు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుచుంటిమి
ఆ వె 65)
మినప సున్ను నందు మేలిమి నేయిని
పంచ దార పోసి మంచిగాను,
సురలు మెచ్చు నట్టి సున్నుండలను జేయు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్ననాడు సున్నుండలను దిన్న సంతోషం ఇప్పుడు కలుగుట లేదండి..


ఆ వె 66)
సంబరములు దెచ్చు సంక్రాంతికిన్ వచ్చి
బంధు వర్గ మెల్ల వడివడిగను
అరిసెలను దిని మరి వరము లిచ్చిననాటి
సంతసమ్ములేవి? సరసిజ జాక్ష!
కర్ణాటకలో దీపావళికి యాచకులు మొదట అడుగునది కజ్జాయి (అరిస) నే, అరిసె ఇస్తే చాలా సంతోషం తో దీవెనలు ఇస్తారు.

ఆ వె 67)
వరములిచ్చు నమ్మ వద్దకు వచ్చినే
నడుగ వేగ దెచ్చి కడు ముదమున 
పసిడి వంటి మంచి పాకుండలిచ్చన
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
అరిసెలతో పాటు పాకుండలు తినాలి కదండి అందుకు

ఆ వె 68)
దొంగ చాటుగ విన దొరల మాటలను నే 
స్థంభమునకు చెవిని చక్కగాను 
పెట్టి కథలు చెప్పు వినయమలర నాటి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
చిన్ననాటి చేష్టలకు పద్య రూపం ...టెలిఫోన్ స్థంభమునకు చెవిని పెట్టి పోలీస్ వారి మాటలు విన్నాను.. అని కథలు చెప్పెవాడిని

ఆ వె 69)
కంచెగా నిలచెడి కడు రమణీయపు 
వర్ణములను జూపు వాక చెట్టు 
వద్ద వచ్చి యడుగ వాక్కాయలన్ నిడు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
ఇప్పుడు మావూరి లో వాక చెట్లు కనిపించడం లేదండి

ఆ వె 70)
ఆలమందలెల్ల పాలెగాళ్ళ బలుకుల్ 
వినుచు నడచు చుండ వీధులందు
వేడుక కనులార జూడ వచ్చిన నాటి 
సంతసమ్ములేవి ?సరసి జాక్ష! 
తెల్లటి ఆవుల చిత్రం దొరక లేదు 
మావురులో నూటికి పైగా ఆవుల మంద కలిగిన భాస్కరరావు గారి ఆవులు ఉదయం పొలము నకు వెళ్ళి, సాయంత్రం తిరిగి వచ్చేవి. 
రెండు పూటలు వాటిని లెక్కించుటకు పిల్లలు మా తాతగారి ఇంటి కి వచ్చేవారు రెండు మూడు మరల రెండు మూడు లెక్కింపు కుదిరెడిది కాదు.
ఆ వె 71)
పదములను బలికెడి పక్షిజాతికి పేర్లు 
బెట్టి నీతులెల్ల విశద పరచు 
పంచతంత్ర కథలు మంచిగా విన్నట్టి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
పంచతంత్రము విన్నప్పుడు పక్షులకు జంతువులకు మానవుల వలె పేర్లు ఉంటాయని అనుకుని పేరు పెట్టి పిలచేవాడిని, అది మాత్రం కావ్ కావ్ అనేది.

ఆ వె 72)
శబ్ద తత్వమెల్ల చక్కగా నెరిగిన 
శబ్ద శాసనుండు సరళ రీతి 
ధర్మ సూక్తులందు మర్మమెల్లను దెల్ప 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
ఉషశ్రీ "పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు " గారు
నా చిన్ననాడు వీరి ప్రవచనం ఉంది అంటే ఇసుక పోసిన రాలని జనం వచ్చేవారు . 15 కిలోమీటర్ల దూరంలో వీరి ప్రవచనం ఉందంటే నా సైకిల్ పరుగులు పెట్టేది. ఇక రేడియో సరేసరి వారి మాట్లాడుతున్న సమయంలో బ్యాటరీ అయిపోతే ప్రక్క ఇంటికి పరుగులు. కంచు కంఠము వారిది.

ఆ వె 73)
గాలి పటము జేసి గగన తలము జేర్చి
ప్రేమ లేఖ వ్రాసి ప్రీతి తోడ
వేగ జేర మనుచు వేడుక జూచిన 
సంతసమ్ములేవి ? సరసి జాక్ష!

గాలి పటము నెరుగుర వేసి , దానికి ప్రేమ లేఖ పంపేవారం.
ఎవరి ప్రేమ లేఖ ముందుగా చేరితే వారిది గెలుపు.
ఆ వె 74) భోగిమంట
తరిమి గొట్టగను తిమిరము నుదయమున
పుల్లలు మరి దెచ్చి పుణ్య మందు
భాగమునను కోరి భోగిమంటను వేయు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!

భోగిమంట వేయుటకు చనిపోయిన చెట్లను , మాతో తిరుగు వారింట దాచినవి కొన్ని పుల్లలు తెచ్చి వేసేవారం, కొన్ని మార్లు గొడవలు జరిగినవి .
ఆ వె 75)
పల్లెటూరి యందు పసిడి రాశుల గని 
నాలమందలెల్ల నాదమఱచి
పరవశమ్ము తోడ వరము లిచ్చిననాటి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
పెద్ద గడ్డివాములు, పచ్చటి పైరును చూచి ఆవులు చాలా సంతోషం తో ఉండెడివి , నేడు రైతు గడ్డి కొనలేని పరిస్థితి, వరి స్థానంలో చేపల చెరువులు . పసిడి రూపము మారినది.

ఆ వె 76)
వంట యింట వెలుగు నింటింట వాసమై
తాను నిలచి తుదకు తలను వాల్చి
తనదు మొవ్వును నిడి తనివి దీర్చిన యట్టి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!

ఈరోజు తాటి బుర్ర గుంజు తిన్నప్పుడు వెంటనే తాటి మొవ్వు తిన్న
రుచి గురుతుకు వచ్చింది. మొవ్వు చాలా రుచిగా ఉంటుంది.


ఆ వె 77)
ముక్క నుమకు రథము ముగ్గు వేసి చెరువు
వద్దకు గొని బోవ పట్టు పట్టి
పదములు బలుకుచును ముదమున వదలిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
ఆ వె 78)
గొప్ప రథము జేసి కొబ్బరి పుచ్చుల 
తోడ తోడు వచ్చి నీడ గాను 
నిల్చు వాని నిల్పి గొల్చిన యానాటి
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
నిన్న రథము ముగ్గు జూచిన తరువాత కొబ్బరి పుచ్చుల రథము గుర్తుకు వచ్చినది . రథమును ఇంట్లో ఊరేగించేవారిమి.

ఆ వె 79 )
చండశాసనుండు బండరాముడు బడి 
పంతు లనుచు బిల్వ సంతనందు
చిన్ని పెట్టె లోన చిత్రముల్ జూచిన
సంతసమ్ములేవి ?సరసి జాక్ష!
5నిమిషముల నిడివి గల చిత్రములను చిన్న పెట్టెలో చూపేవారు,
పేరు మరచేను. తరువాత సంతలో అమ్మేవారు దానిలో ఫిల్మ్ ముక్క పెట్టి చూసేవారము .

ఆ వె 80)
చెలమ లందు నీరు చేలకు పెట్టను 
కలసి మెలసి సాగ కలిమి యనుచు 
జారును వలదన్న కారెము ద్రిప్పిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
చిన్ననాడు ఆకు మడికి నీరు పెట్టుటకు కారెము లేక గుల్ల వాడెడి వారు. దీనిని త్రిప్పిన నీరు పైకి వచ్చును. ఇద్దరు ముగ్గురు రైతులు కలసి త్రిప్పెవారు..
నేనూ త్రిప్పెదనని మారాము జేస్తే నీకు బలము చాలదు, జారెదవు అనేవారు, కానీ కొన్ని మార్లు త్రిప్పాను. చేపల చెరువుల , డీసెల్ ఇంజన్ల పుణ్యమాయని చిత్రంలో కారెము 30 సంవత్సరాలు సేవ జేసి గత 15 సంవత్సరముల నుండి విశ్రాంతి తీసుకుంటున్నది.

ఆ వె 81) హరికథాగానం ...
చేతిలోన కదలు చిరుతలతో ప్రవ 
హించు పద ఝరులను హెచ్చు గాను 
భాగవతుల కథలు బాగుగా వినినట్టి
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
రేడియో లోను , ప్రత్యక్షంగాను హరికథాగానం విన్న సంతోషం చెప్పనలవి కాదండి..

ఆ వె 82) బురకథలు 
మరులు గొలుపు నట్టి మహనీయుల చరితల్ 
వంతపాడు వారు వందనమన 
పటపటపట మనుచు పండ్లు కొరికెడి యా 
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
రేడియో లో బురకథలు విన్నప్పుడు వారి తో పాటు నేను కూడా చాలా ఉద్రేక పడే వాడిని..

ఆ వె 83)
పెరుగు లోని సుధను ప్రీతి తోడను దిన 
చల్ల కుండ వద్ద మెల్ల గాను
జేరి పిల్లి వోలె సారతమును గ్రోలు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష! 
సారతము = మిక్కిలి శ్రేష్టమైనది.
చిన్ననాడు మా అమ్మమ్మ గారి ఇంట కడవలో చల్ల జేసేవారు ..
చల్ల జేసి కొంచం వెన్న గాని మీగడను తినాలని నా కోరిక కానీ ఎంగిలి మంగళం అవుతుందని వద్దు అనేవారు.. నేను ఊరు కుంటానా వారి కళ్ళు గప్పి కొబ్బరి పుల్లతో నైన మీగడ చుట్టి పరుగు పెట్టేవాడిని..

ఆ వె 84)
పిల్లల మని బెట్టు బెల్లము కొరకయి
ప్రక్క నింటి లోని పనుల నైన 
జేసి , సరకుల కయి చెంగున దుమికెడి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
అంగడి వీర్రాజు గారు పిల్లల మని చిన్న చిన్న బెల్లపు ముక్కలు పెట్టెడి వారు , వాటికై రెండు మూడు సరుకులు తెమ్మంటే రెండు మూడు మార్లు తిరిగెడి వాడిని రెండు మూడు బెల్లం ముక్కలు దొరుకుతాయని, ఎక్కువగా జనం ఉంటే వారు వెళ్ళేవరకు ఆగేవాడిని, పెద్ద వారు ఎక్కువ మంది ఉన్నప్పుడు పెట్టెవారు కాదు.

ఆ వె 85)
బంక మన్ను దెచ్చి వంట పాత్రలు జేసి 
భీముని వలె వండి ప్రీతి తోడ 
బెట్ట హితుల నెల్ల బిలచిన యానాటి
సంతసమ్ములేవి ? సరసి జాక్ష!

ఆ వె 86)
అమ్మ గారి కొరకు తుమ్మ జిగురు దెచ్చి 
రూళ్ళ కర్ర తోడ రూళ్ళు గొట్టి 
సాటి వారి నెల్ల చక్కగా జూచిన
సంతసమ్ములేవి ? సరసి జాక్ష! 
అమ్మ గారు = పంతులమ్మ గారు...
పదవ తరగతి నుండి యం టెక్ వరకూ సిఆర్ ( లీడర్) ని కావున పంతులమ్మ గారు లేని సమయంలో నేను చూచేవాడిని..

ఆ వె 87) 
గబగబ జను చేర్చి " జబజల్లి ,జమజచ్చ 
జలజగజల " భామ జాణ యనుచు 
నిక్కరు వయసందు చక్కగా బలికిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
లేడీస్ టైలర్ చిత్రం చూచిన తరువాత హల్లుల భాషలతో ఆటలాడు కున్నాం..
క భాషని, గ భాషని... ర భాషని... ఏన్నో.. ఆ వయస్సులో మంచి పట్టు సాధించిన మాకు అసలు భాషను మరచి పోతామన్న భయం కలిగేది..
"జబజల్లి ,జమజచ్చ జలజగజల " = బల్లి, మచ్చల గల..
ఏమీ తెలియని వయస్సు నందు సంతోషం వేరండి.. ఏ మంటారు?

ఆ వె 88)
ఏడు చేపల కథ నెన్ని మారులు విన్న 
కమ్మనైన భాష యమ్మ నోట 
మరల మరల వింటి మరులు గొనుచు నాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
అమ్మ దగ్గర, తాతల దగ్గర కథలు చెప్పమంటే... అనగనగా అని మొదలు పెట్టెవారు.. ఆ పదాలు వినడానికి మరల మరల అడిగేవాడిని.... అంతరార్థం వేరని తరువాత తెలిసింది.

ఆ వె 89)
పెక్కు కథల లోని పెదరాశి పెద్దమ్మ 
రాత్తి వేళలందు రమ్యమైన 
స్వప్న మందు వచ్చి సంగతులను చెప్పు 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
అనగనగా ఓ పెదరాశి పెద్దమ్మ అనగానే చెప్పు చెప్పు అనేవారం. పెద అంటే పెద్ద అంటే గొప్ప, ముసలి, అన్నీ తెలిసినది అని అర్థం..
చాలా మందికి పేదరాశి అని మాత్రమే తెలుసు.. ఈ పేద ఎప్పుడు పుట్టినదో ?

ఆ వె 90)
తేజమలర లక్ష దీప కాంతుల తోడ
మెరయు కోటను గని మురియు నాశ
రాచనగరి యందు దాచి యుంచిన నాటి
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
అద్భుతమైన మైసూర్ కోటను శివరాత్రి పూట, ప్రభుత్వ సెలవు దినములందు ,మరియు పండుగలకు
జూచిన వారికి మరల మరల జూడాలని ఉంటుంది.. నాకు కూడా అలాగే అనిపించి చాలా సార్లు కోటను దర్శించాను.
ఆ వె 91)
జాన పైన జాన దాని పైనను జాన
కాన రాదు నేడు కాననైన
దుముకితిమిగ వేగ దూరమెల్లను నాటి 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
ఈ ఆట నాకు విషాదం మిగిల్చిన, ఆ నాడు ఆడిన ఆటను చిత్రం చూచిన తరువాత వ్రాయాలిని పించింది.
నా మిత్రుడు నేను దూకే సమయానికి కూర్చుండి పోయాడు, నేను తలక్రిందులుగా పడి పోగా ముక్కుకు గాయమైనది రక్తస్రావంతో చాలా బాధ పడ్డాను. ఇంట్లో చెప్పితే కొడతారన్న భయం. చిత్రం సేకరణకు సునాథ్ గారికి ధన్యవాదములతో..
ఆ వె 92)
మట్టి కుండలందు మధుర మయిన నాటి
పాలు పెరుగు వంటి వాటినెల్ల
నుట్టి లోన బెట్ట, గట్టి పెరుగు దిన్న
సంతసమ్ములేవి ? సరసి జాక్ష!

పిల్లివలె పెరుగు తింటున్నానని, మరియు పిల్లులు పాడు జేయునని
ఉట్టిమీద పాలు పెరుగు మా అమ్మమ్మ పెట్టెది. కానీ నేల పీటలు ఓకదాని పై మరొకటి పెట్టి గట్టి పెరుగును తెడ్డుతో తీసెవాడిని. దొరికి నప్పుడు తన్నులు తినేవాడిని.
ఆ వె 93)
పూల యందము గని పులకరించగ మది 
దండిగాను కోసి దరిని దొరకు 
గురపుడెక్క పూలు గుత్తుగా జేసినా 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
చిన్నప్పుడు ఈ పూలు కోసి తాటీను దీసి పూల గుత్తులు కట్టినాము


ఆ వె 94) 
 ధనము లేని నాడు ధనధుని వలె నేను
సందు గొందు లందు సంచు లందు
ప్రక్క జేబు లందు పైడిని గాంచిన
సంతసమ్ము లేవి సరసి జాక్ష!

చిన్ననాటి వయసులో పేక ముక్కలు, అగ్గి పెట్టెలు , కూవైత్ మొదలగు దేశాల నుండి వచ్చిన ఉత్తరముల పై నున్న స్టాంప్ లు...
ఎవ్వరికీ పనికి రాని చెత్త నాకు ఆట వస్తువులు , ఆ పైన నవి నాకు బంగారం తో సమానం.


ఆ వె 95)
మూడు రుచుల యందు ముచ్చట గొల్పెడి
బుట్ట బుసర కాయ పట్టు దెలిసి
పొలము గట్ల పైన పొంకమలర దిన్న
సంతసమ్ము లేవి సరసి జాక్ష !
చిన్ననాటి వయసులో చిత్రం లో చూపిన కాయల కొరకు వెదికి తినే వాళ్ళం. చాలా రుచిగా ఉంటాయి. పులుపు తీపి వగరు రుచుల మిశ్రమ రుచి దొరకితే పండిన కాయలు తినండి.

ఆ వె 96) 
రామనవమి నాడు ప్రేమ తోడను జేసి 
పంచ పించములను వంచునట్టి 
రమ్యమైన రామ రసమును ద్రాగిన 
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
పించము =మదము, గర్వము , కలత..
చిన్ననాడు రామనవమికి పానకం వడపప్పు పంచేవారు..
సరసి జాక్షుని వేడుకున్న నా సంతసమ్ములను నాకు ఇవ్వి స్వామి అంటే, వేంటనే నాచే పై పద్యం వ్రాయించెను



ఆ వె 97)
సంధ్య వేళలందు సతుల తోగూడి న
పక్షి రాజులన్ నె పార ద్రోలి
కంది నువ్వు పైర్ల కావలి గాచిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!

నా చిన్ననాడు ఈ తోటలో కంది వరుసలు నువ్వుల పైరు మా తాతగారు వేసేవారు. సాయంకాలం పిట్టలు పైర్లను పాడు జేయకుండా కాపలా కాసేవారం. ఇప్పుడు నువ్వులను ఎవ్వరూ వేయడం లేదు
 ఆ వె 98)
నీవెనుక పులులను నేర్పు తోడను నెగ్గి
సాగవలెర వేగ సార మతిని
సహన గుణము తోడ స్వామి జెప్పిన నాటి
సంతసమ్ము లేవి ? సరసి జాక్ష !
స్వామివివేకానంద జయంతి సందర్భముగా
పద్మజ గారికి ధన్యవాదములతో...
ఆవె 99)
రుచికి మెచ్చి నాడు రుద్రాక్ష కాయలు
దినుటకు తిరిగితిమి మునుల వలెను
కంద మూలములకు కంచెను దాటిన
సంతసమ్ములేవి ?సరసి జాక్ష!

చిన్ననాడు ఈ కాయలు తినవచ్చు అంటే చాలు వాటి కొరకు గోడలు దూకిన సందర్భములు కలవు. ఈ రోజు ఈ కాయలు పుల్లగా తియ్యగా ఉంటాయి , తినమని చెప్పేవరకు నా మిత్రునకు తినవచ్చు అన్న సంగతి తెలియదు. ఇలా చాలా కాయలు తినవచ్చు అన్న సంగతి తెలియదు
ఆవె 100)
నేత్రములను తెరచి నీటను మునిగినే
గంటి జానకమ్మ గట్టినట్టి
చీర రంగు ననుచు చిలిపిగ జెప్పిన
సంతసమ్ములేవి? సరసి జాక్ష!

నా చిన్ననాటి చాలా చిపిచేష్టలలో ఇదొకటి, నీటిలో కనులు తెరచి చూచిన కనిపించిన వర్ణము నాడు సీతమ్మ కట్టిన చీర రంగని నమ్మి కాలువ నీటిలో కనులు తెరచి చూచే వారిమి.

ఆ వె 101)

నాకు నచ్చి నట్టి నారింజ కాయను
కోసి కార ముప్పు పోసి చుక్క
సుధను జివ్హ పైన సొగసు గా వేసి నా
సంతసమ్ములేవి సరసి జాక్ష !
చిన్నప్పుడు నారింజ కాయను కోసి కారము ఉప్పు వేసి
కొబ్బరి పుల్లతో గుచ్చి గుచ్చి ఆ పుల్లకు అంటిన రసమును ద్రాగిన సంతోషము , ద్వారకాతిరుమల లో దొరకిన నారింజపండును కొని తిన్నప్పుడు నేను పొందాను. చాలా ఆలస్యం గా మీకు ఆ పులుపును
రుచి చూడమని..

ఆవె 102)
మావి చిగురు దినుచు మధురముగా పాడు
మత్త కోకిల లను చిత్తు జేయ
కూ.......యని పిలువంగ కూయను భాషల
సంతసమ్ములేవి? సరసి జాక్ష!
కోకిలలను రెచ్చగొట్టుటకు కూ.... అనే వారం అప్పుడు కోకిక రెచ్చిపోయేది.. తరువాత మానివేస్తే.. కోకిల మనలను రెచ్చగొట్టుట చాలా బాగుంటుంది..

ఆవె 103)
గొప్ప గాను జేసి కొబ్బరీనులతోడ
రామ బాణమనుచు ప్రేమ తోడ
వేటగాడివోలె నాటలాడిన యట్టి
సంతసమ్ములేవి ?సరసి జాక్ష !
చిన్ననాడు రామబాణమనుచు పిలచి, బాణము నేలకు గ్రుచ్చు కున్న మూడు మార్లు తిరిగెడి వేయ వచ్చు, లేదంటే ప్రక్కవాడికి అవకాశం. ఎవరు ఎక్కువ దూరము వేస్తే వారు నెగ్గినట్లు.. నేలకు గ్రుచ్చు కుంటానికి సూదిని బాణమునకు కట్టేవారిమి.