Thursday 23 October 2014

మా అమ్మ పాడు పాత .పాట.. .

బ్లాగు వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ... 

ఇల్లు ఇల్లాంటావు, ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలుకా ? 
అల్లంత దూరాన వల్ల కాడు లోన నీ ఇల్లు ఉన్నదే చిలుకా ... 

వచ్చు నాడు నీవు వెంటేమి తెచ్చావు, పోవు నాడునూ అంతేను చిలుకా ... 
మున్నాళ్ళు ముచ్చటకు మురిసేవు, భ్రమసేవు, ముందు గతి కానవే చిలుకా ... !! ఇల్లు !!

ఆలు బిడ్డలంటూ, అన్నదమ్ము లంటూ, ఆరాట పడ బోకె చిలుకా ... 
నీకు నీవే గాని, నీ కెవ్వరును లేరు నామాట నమ్మవే చిలుకా  !! ఇల్లు !!  

ఆస్థి పాస్తుల కొరకు అస్తమాను నీవు కుస్తీలు పట్టేవు చిలుకా 
అస్థిరముల పైన గస్తీలు నీ కేల కాస్త యోచించవే చిలుకా ... !! ఇల్లు !!

ఊపిరున్నన్నాళ్ళు ఊరి లోని వారు మావారు అందురే చిలుకా 
ఊపిరి పోగానె భార్య బిడ్డలు కూడ నిన్ను జూడ కుందురే చిలుకా ... !! ఇల్లు !!

పేరు తెచ్చానంటు, పైకి వచ్చానంటు, వీర్ర వీగకె వెఱ్ఱి చిలుకా 
ఈ శ్వాస ఎంతెంత, నీ పేరు ఎంతెంత, ఇకనైన మేలుకో చిలుకా ... !! ఇల్లు !!

డబ్బు డబ్బంటావు, ఇబ్బంది పడి మురికి దిబ్బలో దిగబోకె చిలుకా 
జబ్బు వచ్చాక, యముడు దబ్బు దబ్బున లాగ, తబ్బిబ్బు కానేల చిలుకా ... !! ఇల్లు !!

ఇప్పుడు చచ్చిన వానిని చూచి బావురు మనుచు వాపొక నేలనే చిలుకా 
రేపు నీ చావుంది తప్పించు కోలేవు ముందే జాగ్రత్త పడవే చిలుకా ... !! ఇల్లు !!

నీ దన్న దేహము నిన్ను కాదని పోవు నీ దనేదిక యేది చిలుకా 
ఎవరిదేదియు లేదు ఏది నీతో రాదు, కాదు శాశ్వత మేది చిలుకా ... !! ఇల్లు !!

సారమే లేనట్టి సంసార వలయాన చిక్కి సొక్కగ నేల చిలుకా 
నారు పోసిన వాడు దేవుడున్నాడ నుచు నోరార చాటవే చిలుకా ... !! ఇల్లు !!