Friday 31 July 2020

శ్రీరామ జయరామ శృంగార రామ! నా ---

సీసమాలిక
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- భారమ్ము మోసెడి భవ్యనామ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- జిహ్వ రుచిని బెంచు జిష్ణురూప !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- పై దయ గురిపించు పరమ పురుష !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- యజ్ఞాన మంతయు నడుచు సామి !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- చింతలు బాపెడి చిన్మయుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా ---తాపత్రయము ద్రుంచు తామస హర !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- దోషమ్ము దొలగించు దురిత హరణ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- భవ భయమును ద్రుంచు భక్తపాల !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- గురువు దైవము నీవె సురవర నుత !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- బలుకు లందు గరిమ పద్మనాభ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- బాటను నిల్చెడి హాటక ధర !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- సామర్థ్యమును బెంచు సత్కృపాల !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- పాపమ్ములను ద్రుంచు పాపనాశ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- శాత్రవ గణనాశ శాబ్దికుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- కావ్య యజ్ఞపు కర్త క్ష్మావరేశ!
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- కీర్తిని బెంచెడి కేశవుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- మనసు దెలిసి బ్రోచు మాధవుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- చెలికాడ వందురా శేషశయన !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా -- జేబట్టి రక్షించు శ్రీకరుండ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- దిక్కు నీవేనయ్య దేవదేవ !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- పరితాప సంహార వనవిహార!
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- శోక నివారణ సోమసింధు !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా --- దరిజేరు హరియన తాత తాత !
శ్రీరామ జయరామ శృంగార రామ! నా -- విజయమెల్లను నీవె విశ్వ రూప!
రామనామమ్ము సజ్జన రంజకమని
జేరితి విరక్తితో ముక్తి కోరుకొనుచు
కందుల వరప్రసాదు హృన్మందిరస్థ !
భక్త మందార! శ్రీరామ! భవ్య తేజ!

తక్కువేమి మనకు సీసమాలిక

తక్కువేమి మనకు* అను చరణము తో
*సీసమాలిక*
తక్కువేమి మనకు? దనుజ సోమకుని జంపిన మత్స్య రూపుడు వెలుగు జూప!
తక్కువేమి మనకు? దమనుండు కూర్మావతారుడై దయ జూప ధరణిపైన!
తక్కువేమి మనకు? దానవారి వరాహమూర్తియై దరిజేర ముదిఁమి నందు!
తక్కువేమి మనకు? చెక్కలుగ హిరణ్యకశిపుని జీల్చిన కపిలుడుండ!
తక్కువేమి మనకు? ఒక్కడుగున భువిఁ గొల్చిన వామనుఁ కూర్మి నిడగ!
తక్కువేమి మనకు? దండించ క్షత్రియుల పరశురాముడై రక్తుడుండ !
తక్కువేమి మనకు? ధరలో దశరథ నందనుడు తమ్ముని గూడి దరికి జేర!
తక్కువేమి మనకు? దయ గల బలరాముఁ మనబలమై యుండ మండలమున!
తక్కువేమి మనకు? తన మాయలెల్ల జూపంగను కృష్ణుడు ప్రక్క నుండ!
తక్కువేమి మనకు? ధరణి భారము ద్రుంచు కల్క్యావ తారుడు కరుణ జూప!
తక్కువేమి మనకు? చిక్కిన చిన్మయ రూపుడు చింతలు బాపగ మరి!
తక్కువేమి మనకు? ప్రక్కన తోడుగ వానర సేనతో వరలు చుండ!
తక్కువేమి మనకు? దిక్కని నమ్మిన వారిని నిక్కము జేరుచుండ!
తక్కువేమి మనకు? అక్కఱ గండడు సద్భక్త తతులకు శక్తి నిడగ!
తక్కువేమి మనకు? ధరణీభృతుడు భక్త వరుల గాచ శరము బట్టి యుండ!
తక్కువేమి మనకు? మక్కువ తోడను కన్నతండ్రి వలెను కామ్యములిడ!
తక్కువేమి మనకు? రాము డొక్కడున్న
జాలు తలపున కలతలు సద్దుమణుగు
విషము జిమ్ము కరోనయే విధిని వేడు !
మదిని నిలుపు సుధాముని మరులు గొనుచు!

నగ సీసము

నగ సీసము
అంటే (నగణము పై గురువు తో)
మఱుగు జొచ్చిన, సుధామ! సురులెల్ల నిను గాంచిరట నీదు కృపచే స్థిరముగాను
మఱుగు జొచ్చిన, సుధామ! ముని మాన్యులకు దర్శన మొసంగితివి గారవముతోడ!
మఱుగు జొచ్చిన, సుధామ! నరులెల్ల సుఖశాంతులను బొంద విని నే దురితమందు!
మఱుగు జొచ్చితి, సుధామ! మరి దాసునకు నిన్ను గను టెప్పుడుర మాన్యుడిలలోన !
కరము నందించు వేగమే కామ్య వరద!
సిరులు కోరను శ్రీవత్స సిగ్గు విడచి !
మరులు గొంటిని రక్షకా మాన్య చరిత!
దరిని నిల్చు వరము నిడు ధర్మనిరత!
*మఱుగు జొ* *చ్చిన, సుధా* *మ! సురులె* *ల్ల నిను గాం* *చిరట నీ* *దు కృపచే* *స్థిరముగా* ను ఇలా



వజ్రహార వృత్తము

వజ్రహార వృత్తము
1,3 పాదాలు హానహాన హాహా హా గ గణములు
2,4 పాదాలు హాహాహా న హాహాహా గ గణములు
తిమ్మగలిగి చూడ విదుడ * దేవదేవునింటనన్
కొమ్మలైన రీతి రిపులు * గూడి యుండె రర్మిలిన్
నమ్మి, యెలుక, పాము ,జటిల * నంది కూర్మినొందగన్
అమ్మ బిడ్డలైన జనులు *హద్దు మీరు టేలనో?
తిమ్మ = నెమ్మది, విదుడు = తెలివైన వాడు, అర్మిలి = ప్రేమ,
నమ్మి = నెమలి, జటిలము = సింహము.
భావము :-
దేవదేవుని ఇంట నెమలి, ఎలుక, పాము , సింహము మరియు నంది ప్రేమ కలిగి శాఖలవలే మేము వేరైనా మూలము ఒకటే అంటుంటే ఒకే తల్లి బిడ్డలమైన జనులు కొట్లాటకు పోవడం ఏమిటో?

అష్టవిధ నాయికలు, సీసమాలికలు

స్వాధీనపతిక ( అష్టవిధ నాయికలు)
గుణవంతుడైనట్టి కుంభుడు మగడాయె నీభాగ్య మేమందు నిరతిగాను
నీ నోము ఫలియించి, నీక్కల లాయెను నీకల లెల్లను నీలవేణి
పలికిన సకినాన పతివచ్చెను గదవె తలచంగను విభుడు దానువచ్చె
నెల్లగా కోరిక లీడేరు నీఱేయి తొల్లిటి పూజలు మెల్లగాను
తుదకెక్కు, వేచిన తుమ్మెద మ్రోతకు నెరవేరు నీ యిచ్ఛ నిండుగాను
మక్కువ తోడను చక్కని పంతము చేకూరు రమణుడు చెంత నుండ
కురుల సిరులతోడ కొంటె తనమ్మును మెల్లమెల్లగ జూపు మేను నిమిరి
కనుచూపులందున కదలకుండ గజేసి సెగలు రేపెడి కాంక్ష చిత్తు జేయ
తేటగీతి
ఘనుడు స్వాధీన భర్తృక ఘనము గాను
పడకటిల్లు వేవేగమే పదిల పఱచి
నచ్చినట్టి చీరను గట్టి, వచ్చియున్న
పతికి స్వాదిమ బల్కుల స్వస్థత నిడు!

వాసజసజ్జక

చక్కని చెక్కెలిన్ మక్కువ తోడను ముద్దు లాడు కురులు సద్దు జేయ
కొప్పులోని విరులు కొంటెగా బిలువంగ సుదతి యందము వేగ జూడ వచ్చె
కంఠాభరణములు కనువిందు జేయంగ సరములు గుబ్బల సరస జేరె
చెక్కుటద్దపు మోము చెలిమికై సౌందర్య మరయంగ సాంబ్రాణి యత్తరులను
పూలపానుపు పైన పొంక మలరగను జల్లి లెక్కించుచు జాజిమల్లె
పూలతో ఘడియలన్ పొలతి పడకగది యందు దన ప్రియుని పొందు కోరి
వెన్నెల రాతిరి వేడుక మది నిల్పి యామిని తోడుగా నామె బిలచె
పతి రాకకై వేచి పాన్పున శయనింప! చిలుక బలికె నిట్లు శీఘ్రముగను
వినుము వాసజసజ్జక బేలవైతి
వేల యద్దరి నుండెనె బాల రాజు
వచ్చు చుండె నీ దరిజేర వడివడిగను
స్వాగతమ్ము బలుక లెమ్ము సంతసమున!

*విరహోత్కంఠిత*
తడవ తడవకును తలపు లందు నిలపి క్షణమొక యుగముగా గడపుచున్న
తడియారని శిలైన తనువు తోడ తరుణి వెదకు చుండె గనుల ప్రియుని కొరకు
మాటవినని చీర మాటిమాటికి జార కోపమ్ము హెచ్చెను కొంగు పైన
అర్థ చీరను దీసి యారబోసె నచట కొంగు చాటు వగలు కొంటెగాను
నాట్యభంగిమ లెల్ల నా రాజు జూడక యేమి ఫలమనుచు నేవగించి
విడిది జేసిన యట్టి విరహాగ్ని యీవేళ నిలువెల్ల దహియించె నిశ్చలముగ
పరిపరి విధముల పైటను జార్చుచున్ రాకుండెను సఖుడీ రాత్రి వేళ
నిట్టూర్పు నుయ్యాల చుట్టు ముట్టె గదర చెప్పరాని వలపు చింతలెల్ల
దీర్చుము విరహోత్కంఠిత దిగులు నెల్ల
ప్రాణసఖ మోసగించగ పాడి గాదు
వొప్పుగా నిను దలచితి యొడిసి బట్టి
దాపు జేరి యోపగలేని తాపమెల్ల!

*విప్రలబ్ధ*
మాయమాటలు జెప్పి గాయము జేయంగ మంచమ్ము నవ్వెను మధ్య రాత్రి
ఎకసెకములునాడె నెగుడు దిగుడు గాని చీరె , నిశ్శ్వాసలు కోరినట్టి
కర్ణాభరణములు కలహించె నాతోడ, జాజి మల్లెలు వేగ జారు చుండ
అరవంకి పట్టీలు అరదండ లవ్వంగ సరములు భారమై సద్దు జేసె
చిటమట బడుచును సెగలు గ్రక్కుచు శయ్య పై వ్రాలి నిర్వేద బడుచు ముందు
విసరిగొట్ట సరముల్ విరహ తాపమ్మున నిందించు చుండగ నిర్భయముగ
శీతకరుండును శీఘ్రముగ వెడలె రాత్రి గడచి పోయె రహియు లేక
మోసపోతి ననుచు ముదిత బలికె! నాదు సాతము గొని పోయె సరసు డిటుల
తేటగీతి
కనులలోన నిలచియుండె కరుణ లేక
విప్రలబ్ధ నైతిని జూడు విభుడు లేక
వలపు గలిగి యున్న తరలి వచ్చు గాక
యెఱుక గల్గిన వచ్చి నన్నేలు గాక!

*ఖండిత*
పరభామలను గూడి వడిగ వచ్చితిరేల? శ్రద్ధ జూపితిరేల? శయ్య పైన
తమరికి పరిపాటి తరుణుల తోడను సరసము లాడుట చాటుగాను
నఖఘాతముల తోడ నల్లని కాటుక గుర్తులెటుల వచ్చె కుత్తుకందు
ఏయింతి వోగద యీసుగంధ పరిమళమ్ములు విడచెనా రమణి వేగ
శృంగార సీమలో చిత్తమున్ విడనాడి పరిహాసమాడంగ వలదు వలదు
పగతుడవికపైన బలుకరించ వలదు చాలు చాలిక తమ సరస మిపుడు
పట్టుదప్పుచు నుండె పయ్యెద యీవేళ నన్ను బాధించక మిన్న గాను !
శాంతి వచనముల స్వస్థత గూర్చంగ పంచబాణుడవుగ పంచ జేరి
వలపు వల వైచి బట్టంగ వల్లి నైతి
ఖండితనని బిల్వగ పాడి గాదు
చూపులందు నన్ను నిలుపు సుందరాంగ
కౌగిలింత లందు కరగు కాంతనయ్య!

కలహాంతరిత*
గుట్టుగ నున్నట్టి గుమ్మపై నిందలు మోపంగ భావ్యమా? మోహనాంగ
చుట్టముల్ లేనట్టి సొగసు గాడవని నే వరియించి, గర్వము దరికి జేర
వాగ్యుద్ధమందున వాదమ్ములు సహజ మనుచు వాదించగ నలిగి తీవు
గయ్యాళి నని బిల్వ కలత జెందితి, తొలి దప్పుగా నీవెంచి తరలి రార
బలమైన బలుకుల బంధమ్ము గాంచక బాధించ వలదుర భాష తోడ
శిలనైతి నీరేయి చిత్తమందు దలపు లెల్లను దూరమై యిచ్చకమున
నెడబాటు భరియించ యెటులర బేలను చెంతకు జేరర శీఘ్రముగను
గట్టిగా జెప్పిన కాదంటినా? సఖా! విన్నపములు విని వెతను దీర్చు
పరుష పదముల నిక పైన బలుక నెపుడు
విందునారగించ తిరిగి వేగ రార
మునుపటి వలె ప్రేమను బంచు మోదమలర
కొమ్మ కలహాంతరిత కింత కూర్మి నొసగు!

ఆధునిక ప్రోషిత భర్తృక*
భాగ్యవశమ్మున భర్తగా పొందితి వ్యాపార జగతిని వల్లభుడను
వ్యాప్తి జేయగ తన వ్యాపార మెల్లను పరదేశము వెడలె పనుల వలన
దినమున కొక్క సందేశము క్షేమ సమాచారమును బంపు మాధ్యమందు
వ్యర్థ మగుచు నుండె యవ్వన మనుచు నే వేల్పుల నిరతిగ వేడుచుండ
నానోములు ఫలించి నాథుడు వఱలెను దూరదేశమునుండి దొరవలె మరి
పాడు కరోనాను వంక జూపి తనను పంపునో విడిదికి ప్రభుత నేడు
మరి పది దినములు మదిని మనుచుటెట్లు సకలము దిని యిలన్ వికలముగను
జేసిన చైనాను చిందఱవందఱ జేయంగ వలయునీ చీల తోడ
కలవరించు ప్రోషిత భర్తృక నయి పోతి
దేవ కన్నీరు నింపకు దేశ మందు
పారద్రోలి కరోనాను భరత మాత
చింతలెల్లను దీర్చర శేషశయన!

అభినవ అభిసారిక*
జరిగిన కథ ఆధారంగా

జాలమందు వెదకి, శల్య పరీక్షలు జేసి సమర్థుడు శ్రీహరి యని
తాళికట్టు వరుని తల్లిదండ్రులు జూడ, యనురాగ బంధమ్ము లడ్డు వేయ
పెండ్లి చూపుల యందు బెట్టు సేయక తాను సమ్మతించె వడిగ సప్తపదికి
పరిణయమున కింక పది దినముల ముందు, శోకమే యిక నీవు లేక యనుచు
మదిని దోచిన వాడు మరల సందేశము బంప చిగురులేసె బాసలెల్ల
విరహ సాగరమందు విడచి వెఱపు నెల్ల వాడి తూపుల యందు వాలిబోవ
మొలక నవ్వులు జేర మోము నందు, శుభ ముహూర్తమును దెలిపె నార్తితోడ
సంకేత స్థలమును సరగున సూచించ, సరియని బదులిచ్చె సంజ్ఞ తోడ

ధనము, బంగార మెల్లను దాపు నుంచి
కన్నవారి కన్నులు గప్పి యెన్ను కొన్న
చోటున కభిసారిక యేగ, సొగసు గాను
కష్టములు కాపురము జేసె కలలు కరుగ!

కామెంట్‌లు

Tuesday 23 June 2020

రెండు ప్రాసల బహువిధ కంద గర్భ మణికీరణము వృత్తము

రెండు ప్రాసల బహువిధ కంద గర్భ  మణికీరణము వృత్తము

( ననభనజ నననన లగ గణములు ) ప్రాస యతి (1,7) యతి (1,15,23).. 

మనమున వరవర్ణి నిలువ మనునే? మరి కలవరపడి మకురము మరుగున్ !
నినచును వరవర్ణి నటన నినయన్ నిరతము కనులను నెలకొని నెగడున్ !
పెనగును వర సత్తుని గని వెనుకన్ వెరవక జగతిని వెడలును వెలుగున్ !
ననచును విరు లావనమున ననుచున్ నరకుచు దిగులును నభమున నడచున్!

అర్థం :-
వరవర్ణి = చెలి, మనునే = జీవించునే, మకురము = అద్దము, మరుగునను= ఆశ్రయించు,
నినచును = నాటును,   నినయన్ = చేత , నెగడున్ = వర్ధిల్లు ,పెనగును = మెలిక పెట్టు ,
వర సత్తుని = వరము చే పొందిన బలము ,ననచును = పూయును , ఆవనము = కాపాడుట ,
ననుచున్ = అతిశయము,

భావము :- మనసున ప్రేయసి నిలచిన , మది నిశ్చలముగా నుండక, తన చెలి కళ్ళలో కనిపించునని అద్దము నాశ్రయించు, చెలి హావభావాలు కళ్ళలో నిత్యము ఉండి వృద్ధి జెందు, మనకు దేవుడిచ్చిన శక్తిని అంచనా వేసి, భయము లేకుండా లోకమున తిరుగును, వెనుకడుగు వేయక ముందుకు సాగును, అతిశయము కాదు ఆశ చిగురించి దిగులును ద్రుంచి, ఆకాశ మార్గమున విహరించును.

గర్భస్థ కందము 1 ప్రాస "న "

మనమున వరవర్ణి నిలువ
మనునే? మరి కలవరపడి మకురము మరుగున్ !
నినచును వరవర్ణి నటన
నినయన్ నిరతము కనులను నెలకొని నెగడున్ !

గర్భస్థ కందము 2 ప్రాస "ర "

వరవర్ణి నిలువ, మనునే?
మరి కలవరపడి మకురము మరుగును మనమున్!
వరవర్ణి నటన నినయన్
నిరతము కనులను నెలకొని నెగడును నినచున్ !

గర్భస్థ కందము 3 ప్రాస "న "

పెనగును వర సత్తుని గని
వెనుకన్ వెరవక జగతిని వెడలును వెలుగున్ !
ననచును విరు లావనమున
ననుచున్ నరకుచు దిగులును నభమున నడచున్!

గర్భస్థ కందము 4 ప్రాస "ర "

వర సత్తుని గని వెనుకన్
వెరవక జగతిని వెడలును వెలుగున్ ! పెనగున్!
విరు లావనమున ననుచున్
నరకుచు దిగులును నభమున నడచున్ ననచున్!

ఇలా వృత్తము నందు పాదములను స్థానభ్రంశము చేసిన మరిన్ని కందములు తయారగును.

మణిగణనికరము (శశికళ), కందము గర్భ అతి వినయ వృత్తము

మణిగణనికరము (శశికళ), కంద గర్భ అతి వినయ వృత్తము
కందము కూడా..

అతి వినయ వృత్తము (నననన న స గణములు యతి 11)

కలడు కలడు వరదుడు గగనమున కలయై
కలదు కలదు వర కనక కరము వరమిడన్
పలుకు పలుకు పసిడి విభవము గద వలదే
వలదు వలదు వశి దరి భవభయము మనసా!

గర్భస్థ మణిగణనికరము (నననన స గణములు యతి 11)

కలడు వరదుడు గగనమున కలయై 
కలదు వర కనక కరము వరమిడన్
పలుకు పసిడి విభవము గద వలదే
వలదు వశి దరి భవభయము మనసా!

గర్భస్థ కందము

కలడు వరదుడు గగనమున/ కలయై కలదు వర కనక కరము వరమిడన్
పలుకు పసిడి విభవము గద/ వలదే వలదు వశి దరి భవభయము మనసా!


అర్థం :- వివధము = మార్గం
విభవము= సంపద , కల = భాగము,

భావము :- కరి వరదుడు విశ్వమంతయూ నిండి యుండెను, వరము నిడు కరము అదే స్థితి (పైకి ఎత్తి) లో నున్నది. వరదుని నామములు పసిడి సమములు వినవే, వాని దరి భవభయముల పని లేదు మనసా!

నక్షత్ర బంధ కందము

నక్షత్ర బంధ కందము

తిరిగి తిరిగి యవనిని రమ
దరిజేర వడిగ దరి గని దశముఖ మకరిన్
దరిజేరిన చమరు కురవ!
నరవరులే నిలచె దయ గనర హరి కరుణన్!

కేంద్రములందు :- తిరుమలేశ
కోణములందు :- కరివరద!

భావము :- భులోకమందు లక్ష్మీ దేవి కొరకు వెదకి వెదకి అలసి గుహను జూచి జేరిన దేవా! పది రకముల వికారములు దరి జేరనీయక కొట్టు గోకుల బాల, రారాజులు కూడా నీ దర్శనం కొరకు నిలచిరి, కరుణతో దయ జూపరా!

మత్తకోకిల, తరువోజ మరియు ద్విపద ద్వయ సీసము

మత్తకోకిల, తరువోజ మరియు ద్విపద ద్వయ సీసము

మాధవా! పురుషోత్తమా! కృతమాల మానస సుస్మితా ! మాన్య నగధరవర !
శ్రీధరా! ధర శ్రీహరీ! గుణశీల! శ్రీవర శోభితా ! శ్రేయ! భవభయ హర
శ్రీధరా! ముని సాధు సేవిత! లీల! జేరితి రక్షకా! శ్రీశ! రిపు హర భవ
బాధ దీర్చర సత్కృపా జనపాల! వానరవందిత వర్య! నరవర ఘన

ప్రకృతి కిప్పుడు శోభలు పరిఢవిల్ల
సకల జనులకు శీఘ్రము స్వస్థత నిడు
కందుల వరప్రసాదు హృన్మందిరస్థ
భక్త మందార శ్రీరామ భవ్య తేజ!

గర్భస్థ తరువోజ ( 3 ఇంద్ర +సూర్య +3ఇంద్ర+ సూర్య)

మాధవా! పురుషోత్తమా! కృతమాల మానస సుస్మితా ! మాన్య నగధర !
శ్రీధరా! ధర శ్రీహరీ! గుణశీల! శ్రీవర శోభితా ! శ్రేయ! భవభయ ! 
శ్రీధరా! ముని సాధు సేవిత! లీల! జేరితి రక్షకా! శ్రీశ! రిపు హర! 
బాధ దీర్చర సత్కృపా జనపాల! వానరవందిత వర్య! నరవర! 

మత్తకోకిల

మాధవా! పురుషోత్తమా! కృతమాల మానస సుస్మితా !!
శ్రీధరా! ధర శ్రీహరీ! గుణశీల! శ్రీవర శోభితా !
శ్రీధరా! ముని సాధు సేవిత! లీల! జేరితి రక్షకా!
బాధ దీర్చర సత్కృపా జనపాల!వానరవందితా!! 

ద్విపద

మాధవా! పురుషోత్తమా! కృతమాల !!
శ్రీధరా! ధర శ్రీహరీ! గుణశీల!!
శ్రీధరా!ముని సాధు సేవిత లీల!!
బాధ దీర్చర సత్కృపా జనపాల!!!

కృతమాల = పణ్యనది

Thursday 18 June 2020

24 కంద , తేటగీతి గర్భ చంపక మాల

32 కంద , తేటగీతి గర్భ చంపక మాల

అరి హరణా! హరీ! వడిగ నక్షర మిమ్ముర పక్షపాతిగా
కరి వరదా! సదా నిలచి కావర శ్రీధర! నిర్వికారివై
వర చరితా ప్రభూ!వఱలు వాగరు సేవిత వామనుండుగా
సిరి భరిమా! ననున్ గనుమ శ్రీకర! పుష్కర!గారవంబుగా !
తేటగీతి
 వడిగ నక్షర మిమ్ముర పక్షపాతి
 నిలచి కావర శ్రీధర! నిర్వికారి
వఱలు వాగరు సేవిత వామనుండ
గనుమ శ్రీకర! పుష్కర!గారవంబు !

కం 1( 1&2)
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతిగా అరి హరణా!
వరదా! సదా నిలచి కా|| వర శ్రీధర! నిర్వికారివై కరి వరదా!
కం 2.(3&4)
చరితా ప్రభూ!వరలు వా || గర సేవిత వామనుండుగా వర చరితా
భరిమా! ననున్ గనుమ శ్రీ|| కర! పుష్కర!గారవంబుగా !సిరి భరిమా
కం 3 (1&2)
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతిగా కరి వరదా!
వరదా! సదా నిలచి కా || వర శ్రీధర! నిర్వికారివై అరి హరణా!
కం 4(3&4)
చరితా ప్రభూ!వరలు వా || గర సేవిత వామనుండుగా సిరి భరిమా!
భరిమా! ననున్ గనుమ శ్రీ ||కర! పుష్కర!గౌరవంబుగా !వర చరితా!
కం 5 (1&3)
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతి గా అరి హరణా!
చరితా ప్రభూ!వరలు వా || గర సేవిత వామనుండుగా వర చరితా!
కం 6 (2&4)
వరదా! సదా నిలచి కా || వర శ్రీధర! నిర్వికారివై కరి వరదా!
భరిమా! ననున్ గనుమ శ్రీ || కర! పుష్కర!గౌరవంబుగా !సిరి భరిమా!

కం 7 (1&3)
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతి గా వర చరితా!
చరితా ప్రభూ!వరలు వా|| గర సేవిత వామనుండుగా అరి హరణా!
కం 8 (2&4)
వరదా! సదా నిలచి కా || వర శ్రీధర! నిర్వికారివై సిరి భరిమా!
భరిమా! ననున్ గనుమ శ్రీ ||కర! పుష్కర!గౌరవంబుగా !కరి వరదా!
కం 9 (1&4)
హరణా! హరీ! వడిగ నక్షర మిమ్ముర పక్షపాతిగా అరి హరణా!
భరిమా! ననున్ గనుమ శ్రీకర! పుష్కర!గారవంబుగా !సిరి భరిమా!
కం 10 (2&3)
వరదా! సదా నిలచి కావర శ్రీధర! నిర్వికారివై కరి వరదా! 
చరితా ప్రభూ!వఱలు వాగరు సేవిత వామనుండుగా వర చరితా
కం 11 (1&4)
హరణా! హరీ! వడిగ నక్షర మిమ్ముర పక్షపాతిగా  సిరి భరిమా!
భరిమా! ననున్ గనుమ శ్రీకర! పుష్కర!గారవంబుగా !అరి హరణా!
కం 12 (2&3)
వరదా! సదా నిలచి కావర శ్రీధర! నిర్వికారివై  వర చరితా
చరితా ప్రభూ!వఱలు వాగరు సేవిత వామనుండుగా కరి వరదా!
కం 13 ( 2&1)
వరదా! సదా నిలచి కా|| వర శ్రీధర! నిర్వికారివై కరి వరదా!
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతిగా అరి హరణా!
కం 14.(4&3)
భరిమా! ననున్ గనుమ శ్రీ|| కర! పుష్కర!గారవంబుగా !సిరి భరిమా
చరితా ప్రభూ!వరలు వా || గర సేవిత వామనుండుగా వర చరితా
కం 15 (2&1)
వరదా! సదా నిలచి కా || వర శ్రీధర! నిర్వికారివై అరి హరణా!
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతిగా కరి వరదా!
కం 16 (4&3)
భరిమా! ననున్ గనుమ శ్రీ ||కర! పుష్కర!గౌరవంబుగా !వర చరితా!
చరితా ప్రభూ!వరలు వా || గర సేవిత వామనుండుగా సిరి భరిమా!
కం 17 (3&1)
చరితా ప్రభూ!వరలు వా || గర సేవిత వామనుండుగా వర చరితా!
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతి గా అరి హరణా!
కం 18 (4&2)
భరిమా! ననున్ గనుమ శ్రీ || కర! పుష్కర!గౌరవంబుగా !సిరి భరిమా!
వరదా! సదా నిలచి కా || వర శ్రీధర! నిర్వికారివై కరి వరదా!

కం 19  (3&1)
చరితా ప్రభూ!వరలు వా|| గర సేవిత వామనుండుగా అరి హరణా!
హరణా! హరీ! వడిగ న || క్షర మిమ్ముర పక్షపాతి గా వర చరితా!
కం 20  (4&2)


భరిమా! ననున్ గనుమ శ్రీ ||కర! పుష్కర!గౌరవంబుగా !కరి వరదా!
వరదా! సదా నిలచి కా || వర శ్రీధర! నిర్వికారివై సిరి భరిమా!
కం 21  (4&1)


భరిమా! ననున్ గనుమ శ్రీకర! పుష్కర!గారవంబుగా !సిరి భరిమా!
హరణా! హరీ! వడిగ నక్షర మిమ్ముర పక్షపాతిగా అరి హరణా!
కం 22 (3&2)
చరితా ప్రభూ!వఱలు వాగరు సేవిత వామనుండుగా వర చరితా
వరదా! సదా నిలచి కావర శ్రీధర! నిర్వికారివై కరి వరదా! 
కం 23 (4&1)
భరిమా! ననున్ గనుమ శ్రీకర! పుష్కర!గారవంబుగా !అరి హరణా!
హరణా! హరీ! వడిగ నక్షర మిమ్ముర పక్షపాతిగా  సిరి భరిమా!
కం 24 (3&2)
చరితా ప్రభూ!వఱలు వాగరు సేవిత వామనుండుగా కరి వరదా!
వరదా! సదా నిలచి కావర శ్రీధర! నిర్వికారివై  వర చరితా

శ్రీరామనవమి పర్వ దిన శుభాకాంక్షలు

లేరా! రవికుల తిలకా!
లేరా! కోదండము గొని లేరా! సామీ
లేరా! కరోన ను దునుమ
లేరా! భక్తజనపాల లేరా స్వామీ !

లేరా! యినకుల తిలకా!
లేరా! నిరుపమ గుణనిధి లేరా! సామీ
లేరా! కరోన ను దునుమ
లేరా! కావగ కరుణను లేరా స్వామీ !

జాగ్రత్ వృత్త గర్భ సీసము

జాగ్రత్ వృత్త గర్భ సీసము

స్తవనీయ వనజాప్త సరస వానర వర మానస హంసా! సుమందహాస!
రమణీయ నినుగొల్తు ప్రకట కుండల నిజ భూతి విశాలా సమూహమందు!
ఘనుడవు గనవేల? కరుణ తోడను కరి కష్ట హరా హే సుకామ్యదాత!
మహనీమ మునిమాన్య మదన మోహన మురళీధర రారా కులీసుడవయి!
మహిమ జూప మరలి రమ్ము భువికి వేగ
భయము తోడ బిలుచు చుండె భక్త జనులు
భక్త మందార భయద నివార బద్ధ
భావ! తల్లివి దండ్రివి నీవె రామ!

గర్భిత జాగ్రత్ వృత్తము
సనజనభగగ గణములు యతి -11

వనజాప్త సరస వానర వర మానస హంసా! 
నినుగొల్తు ప్రకట కుండల నిజ భూతి విశాలా!
గనవేల? కరుణ తోడను కరి కష్ట హరా హే!
మునిమాన్య మదన మోహన మురళీధర రారా!

పంక్తి గర్భ సీసము

పంక్తి గర్భ సీసము

మానసమందు సుమాళము తోడను కాలమేఘ శరీర గావుమనుచు
వీనుల విందుగ విన్నపముల్ విన్న వించ భూతలమున పంచజేరి
గానము జేయగ కష్టములన్ ద్రుంచు కలభసుందరుడు వేకరమునందు
వానర సేవిత వైచు సదా దురితమ్ములన్ స్థిరముగా, తావు నిడక

బుధజన విహారుని పయిన పొలుపు మీర
త్యాగరాజ చిత్త హితుని దలచ వచ్చె
భక్త మందార భయదనివార బద్ధ
భావ తల్లివి దండ్రివి నీవె రామ!

గర్భిత పంక్తి వృత్తము
భభభగ గణములు , యతి -7

మానసమందు సుమాళము తో
వీనుల విందుగ విన్నపముల్ 
గానము జేయగ కష్టములన్
వానర సేవిత వైచు సదా !

సుమాళము = సంతోషము,
వేకరము =ఉపద్రవము

మత్తహంసిని వృత్త గర్భ సీసము

మత్తహంసిని వృత్త గర్భ సీసము

రోమాంచిత వరాహ రూపమ్ము వరియించి త్రాతవై యవని భారమ్ము ద్రుంచ
నెన్ను కొని గరాసులెల్లన్ వగచు నట్లు జేయు నారాధ్యుడ చెలగు చున్న
యవనీసుర కురుంబ మందున్ సుగుణ వంతునేలు యోగీశ్వర జాలమేల?
రక్షింపర పరాత్పరా భక్త భవ భంజనా హరీ! శ్రీధర నట్టడవిని

యిడుము లొంది నిలచితినే నినకులేశ
రాతిని వనిత జేసిన రమ్య నామ
భక్త మందార భయదనివార బద్ధ
భావ తల్లివి దండ్రివి నీవె రామ!

గర్భస్థ మత్తహంసిని
జతసజగ యతి -7

వరాహ రూపమ్ము వరియించి త్రాతవై
గరాసులెల్లన్ వగచు నట్లు జేయు నా
కురుంబ మందున్ సుగుణ వంతునేలు యో
పరాత్పరా భక్త భవభంజనా హరీ!

చంద్ర లేఖ వృత్త గర్భ సీసము

చంద్ర లేఖ వృత్త గర్భ సీసము

అవనిపయిన దెలియ వశమా? దేవ నీమాయ లెల్లన్ ముని మానసమున
వరుడవు నిను గెలువ వశమా? కీర్తి మంతా! ముకుందా!హరి! తామస హర!
వరధరవర! నిలువ వశమా? నీదరిన్ సుప్రకాశా! సర్వ శుభముల నిడు
కరివరదా! బలుక వశమా? భక్తితో భక్తపాలా! పారవశ్యము నను

వైరికి వరము లిడు సత్యపాల! గలుగ
జేయుము నలిన భక్తిని శీఘ్రముగను
భక్త మందార! భయదనివార! బద్ధ
భావ! తల్లివి దండ్రివి నీవె రామ!

గర్భస్థ చంద్రలేఖ వృత్తము
నసరరగ యతి -7

దెలియ వశమా? దేవ నీమాయ లెల్లన్
గెలువ వశమా? కీర్తి మంతా! ముకుందా !
నిలువ వశమా? నీదరిన్ సుప్రకాశా!
బలుక వశమా? భక్తితో భక్త పాలా!

నవమాలిని మరియు చంద్రిక గర్భ సీసము

నవమాలిని మరియు చంద్రిక గర్భ సీసము

ఇనకుల వంశజా! హితుడ వందున్ సదా వరధర జనపాల భక్తితోడ!
జనవర రామ యీసమయ మందున్ నిను సరగున గొన సంతసమ్ముతోడ!
ఘనుడవు లోకరక్షక ప్రమోదా కుల నరవరులకు నందనందనాయ
దొనరగ సాధుసంతుల సుధామా! ధరా సురల దునుము సోమసూర్య! శ్రీశ!

విమల చరితా గనుడు నేటి విలయము నను
కోరి నినుజేరు వారికి కూరిమి నిడు
కందుల వరప్రసాదు హృన్మందిరస్థ
భక్త మందార ! శ్రీరామ ! భవ్య తేజ!

గర్భస్థ నవమాలిని నజభయ యతి -8

ఇనకుల వంశజా! హితుడ వందున్ 
జనవర రామ యీసమయ మందున్
ఘనుడవు లోకరక్షక ప్రమోదా
దొనరగ సాధుసంతుల సుధామా!

గర్భస్థ చంద్రిక వృత్తము
ననరవ యతి -7

వరధర జనపాల భక్తితో!
సరగున గొన సంతసమ్ముతో!
నరవరులకు నందనందనా 
సురల దునుము సోమసూర్య! శ్రీ !

చంద్రవర్త్మ వృత్త గర్భ సీసము

చంద్రవర్త్మ వృత్త గర్భ సీసము

వెలయుచు దంబుర వేకరమ్ము నను వేడితి ఘనుడా నిను క్షితిపతి వని
లోకులు దెలుపగ శ్రీకరా వడిగ జేరి వినుమయా వర ప్రీతి తోడ
చేకొని పాలింప శ్రీకళత్ర సుచరిత్ర గనుమయా దురితమ్ములెల్ల
బాకులై నిరతము తాకుచున్న బరితాప పదములన్ ద్రుంచు పట్టుబట్టి !

ఆత్మ పంజరమందున్న యక్షరుండ
బలుకవయ్య దాసుని గూడి చిలుక వలెను
కందుల వరప్రసాదు హృన్మందిరస్థ
భక్త మందార ! శ్రీరామ ! భవ్య తేజ!

గర్భస్థ చంద్రవర్త్మ వృత్తము
రనభస యతి -7

వేకరమ్మునను వేడితి ఘనుడా!
శ్రీకరా! వడిగ జేరి వినుమయా!
శ్రీకళత్ర సుచరిత్ర! గనుమయా 
తాకుచున్న బరితాప పదములన్ !

అంబురూహ గర్భ సీసము మాలిక

అంబురూహ గర్భ సీసము మాలిక

రావణ మర్థన రాజిత సోముడ రామ సంగర భీకరా సురనుత!
పావనమౌ పదపద్మములన్ గొనె భక్తవర్యులు సత్కృపాల ఘన సు
ధీవర జ్ఞానపు తేజము నీయర దీనరక్షక శ్రీనిధీ సుధామ !
మావటి నీవని మాన్యులు దెల్పిరి మార్గదర్శన జేయుమా జనహిత !
భూవర జేసెద పూజలు బాగుగ మోదమొందుచు సుప్రభూ! నిరతిగ
శ్రీవర దీర్చర జింతలు శీఘ్రము ప్రీతితోడను శ్రీహరీ యవనికి !
రావయ వేగ లలామ గనంగను బ్రాకులాడుచునుంటిరా రఘువర !
శ్రావణ మాసపు సంబరమెల్లను రద్దు జేయక నీయరా నరవర !

నిన్ను గొల్చు వారినెపుడు సన్నుతింతు
పూర్వజుల మదిని నిలిపి మ్రొక్కు చుంటి
కందుల వరప్రసాదు హృన్మందిరస్థ
భక్త మందార ! శ్రీరామ! భవ్య తేజ!

గర్భస్థ అంబురూహ
భభభభ రసవ -యతి 13

రావణ మర్థన రాజిత సోముడ రామ! సంగర భీకరా !
పావనమౌ పదపద్మములన్ గొనె భక్తవర్యులు సత్కృపా!
ధీవర జ్ఞానపు తేజము నీయర దీనరక్షక శ్రీనిధీ !
మావటి నీవని మాన్యులు దెల్పిరి మార్గదర్శన జేయుమా !
భూవర జేసెద పూజలు బాగుగ మోదమొందుచు సుప్రభూ! 
శ్రీవర దీర్చర జింతలు శీఘ్రము, ప్రీతితోడను శ్రీహరీ  !
రావయ వేగ లలామ గనంగను బ్రాకులాడుచునుంటిరా !
శ్రావణ మాసపు సంబరమెల్లను రద్దు జేయక నీయరా !

కందగర్భ ఫలసింధు వృత్తము

కందగర్భ ఫలసింధు వృత్తము ( నననన సస గణములు-యతి -13)

తెలగు వెలుగులను గులికెడి తిరుకావు లిలన్
తెలుగు పదములకు నుతులని దెలుపంగవలెన్
తెలివిడి దెలిపెడి పదములు దిరిగించుచు నీ
తలపున నిలుపగ నిరతము తలమానికమౌ!

గర్భస్థ కందము

తెలగు వెలుగులను గులికెడి 
తెలుగు పదములకు నుతులని దెలుపంగవలెన్
తెలివిడి దెలిపెడి పదములు
తలపున నిలుపగ నిరతము తలమానికమౌ!

రామకృష్ణ గురువర్య ప్రణతులు (నామ భావ గోపన చిత్రము)

మానినీ వృత్తము

రా ముని గొల్చెడి రాము! గు ణాధి పరాక్రమ గర్భిత ప్ర క్రియలన్ !
రా కథా సుధ రాజిల గో రు కురంగ వివర్తన శ్రావ మున్ !
కోమల కృ ష్ణుని గొల్చుచు పా న గోకుల బాలుని కో తు రి సా
ధ్వీమణి! తృ ష్ణ యె దీరగ తు ర్య ము దెల్పుడు, లీల లు దేనియలన్!

మొదటి గణములలో రామకృష్ణ  మధ్య గణములలో గురువర్య ఆఖరి గణములలో ప్రణతులు వస్తాయండి

అష్టవిధ కందము

 అష్టవిధ కందము

కం 1. నిరతము పిలతును * ఘనముగ
సరసుని *వితతిగ వనమున * జలమున పతిగన్
వరమును బలమును పనిగొని
చరితను వ్రతముగ నినుచును చలయయి క్రతువున్!

* పద్యము నారంభించ వచ్చు నండి.

నినచును = నాటుకొని, చల =లక్ష్మి,

భావము :- సరసుని (కృష్ణుని) విరివిగా కష్టసుఖములందు నన్ను రక్షించు వానిగా నమ్మి ప్రార్థింతు, వరము చే, బలముచే వాని చరిత్రను లక్ష్మీ దేవి వలె అర్హతతో మనసున నిలుపు కొందును.

కం2. ఘనముగ సరసుని వితతిగ
వనమున జలమున పతిగను వరమును బలమున్
పనిగొని చరితను వ్రతముగ
నినుచును చలయయిక్రతువును !నిరతము పిలతున్ !

కం 3.  *వితతిగ వనమున * జలమున
పతిగన్ వరమును బలమును పనిగొని చరితను
వ్రతముగ నినుచును చలయయి
క్రతువున్! నిరతము పిలతును * ఘనముగ సరసుని *

కం 4.   జలమున పతిగన్ వరమును
బలమును పనిగొని చరితను వ్రతముగ నినుచును
చలయయి క్రతువున్! నిరతము
పిలతును * ఘనముగ సరసుని *వితతిగ వనమున *

కం 5. చలయయి క్రతువున్! నిరతము
పిలతును * ఘనముగ సరసుని *వితతిగ వనమున *
జలమున పతిగన్ వరమును
బలమును పనిగొని చరితను వ్రతముగ నినుచును

కం 6.  వ్రతముగ నినుచును చలయయి
క్రతువున్! నిరతము పిలతును * ఘనముగ సరసుని *
*వితతిగ వనమున * జలమున
పతిగన్ వరమును బలమును పనిగొని చరితను

కం7.. పనిగొని చరితను వ్రతముగ
నినుచును చలయయిక్రతువును !నిరతము పిలతున్ !
ఘనముగ సరసుని వితతిగ
వనమున జలమున పతిగను వరమును బలమున్

కం 8. వరమును బలమును పనిగొని
చరితను వ్రతముగ నినుచును చలయయి క్రతువున్!
నిరతము పిలతును * ఘనముగ
సరసుని *వితతిగ వనమున * జలమున పతిగన్

Wednesday 17 June 2020

ద్రుతవిలంబిత, జలద గర్భ ఉత్పలమాల వృత్తము

ద్రుతవిలంబిత, జలద గర్భ ఉత్పలమాల వృత్తము 
ఆది ,మధ్య, అంత్య ప్రాసలతో  శివునుకు నివేదనను చూడండి

ఉత్పలమాల

పాలను దెచ్చితిన్ మురికి బాధ ప్రభూ వడి మాన్ప వేలరా?
కాలహరా భవా! వరద!  కావశివా నను కష్ట మేలరా?
కాలిక నాథుడా! దరిని కావు సదామయ చేరవేలరా? 
పూలను దెచ్చితిన్ ఉరికి ముందునహో నిను గాంచ నేలరా ?

గర్భగత జలద వృత్తము ( యతి 10 )

పాలను దెచ్చితిన్ మురికి బాధ ప్రభూ
కాలహరా భవా! వరద!  కావశివా?
కాలిక నాథుడా! దరిని కావు సదా
పూలను దెచ్చితిన్ ఉరికి ముందునహో !

ద్రుతవిలంబిత వృత్తము ( యతి 7)

మురికి బాధ ప్రభూ వడి మాన్పవే ?
వరద! కావశివా నను కష్టమే ?
దరిని కావు సదామయ చేరవే ?
ఉరికి ముందునహో నిను గాంచనే ?

కంద, మణిగణనికరము, సుందరలేఖా గర్భ సరసిజము

కంద, మణిగణనికరము, సుందరలేఖా గర్భ సరసిజము 

నీవే శ్రీవత్సా! విన నీవే! నిరుపమ దరుమయ నిపుణుడ! నిరతా!
నీ వాక్కేళీ వన్నియ నీవే! నిరతము నినుగను నిపుణత నిడుమా!
ఈ వేత్రీ వ్యాహారము నీవే! యిరుగడల యెలమి నిడుమయ గరిమా!
కైవల్యమ్మున్ కైదువ కావా! కరమున నరవర కలియుగ వరదా!

గర్భిత కందము 1

నీవే శ్రీవత్సా! విన
నీవే! నిరుపమ దరుమయ నిపుణుడ! నిరతా!
నీ వాక్కేళీ వన్నియ
నీవే! నిరతము నినుగను నిపుణత నిడుమా!

గర్భిత కందము 2

ఈ వేత్రీ వ్యాహారము
నీవే! యిరుగడల యెలమి నిడుమయ గరిమా!
కైవల్యమ్మున్ కైదువ
కావా! కరమున నరవర కలియుగ వరదా!

గర్భిత కందము 3

నిరుపమ దరుమయ నిపుణుడ!
నిరతా!  నిరతము నినుగను నిపుణత నిడుమా! 
యిరుగడల యెలమి నిడుమయ
గరిమా! కరమున నరవర కలియుగ వరదా!

గర్భిత మణిగణనికరము

 నిరుపమ దరుమయ నిపుణుడ! నిరతా!
 నిరతము నినుగను నిపుణత నిడుమా!
 యిరుగడల యెలమి నిడుమయ గరిమా!
కరమున నరవర కలియుగ వరదా!

గర్భిత సుందరలేఖా

నీవే శ్రీవత్సా! విన నీవే!
నీ వాక్కేళీ వన్నియ నీవే! 
ఈ వేత్రీ వ్యాహారము నీవే!
కైవల్యమ్మున్ కైదువ కావా!

అర్థం :-
 శ్రీవత్సా = చిన్ని బాలుడ,  విన నీవే= ఎక్కడ విన్నా నీ పేరే, (విన నియ్యవా)  నిరుపమ = సాటిలేని వాడ,
 దరుమయ నిపుణుడ = న్యాయ శీల, నిరతా = స్థిరమైన వాడ, నీ వాక్కేళీ = నీ సరసము, వన్నియ = అందము
నీవే = నిమ్ము, నిరతము = ఎల్లప్పుడు, నినుగను నిపుణత నిడుమా! ఈ వేత్రీ = ఈ ద్వారపాలకుడు,
వ్యాహారము = పలుకు , నీవే = నువ్వే, యిరుగడల = రెండు వైపులా, యెలమి =సంతోషము,
నిడుమయ, గరిమా = శ్రేష్ఠుడ, కైవల్యమ్మున్ = మోక్షము, కైదువ = ఆయుధము, కావా= అవ్వవా,
కరమున = చేతిలో, నరవర = నరులలో శ్రేష్ఠుడు, కలియుగ వరదా = కలియుగ వరదుడు.

భావము :-
శ్రీవత్సా ఎక్కడ విన్నా నీ పేరే, ( నీ పేరు విన నియ్యవా) సాటిలేని వాడ,  న్యాయ శీల,  స్థిరమైన వాడ,  నీ సరససల్లాపము తోడానందము నిమ్ము, ఎల్లప్పుడు నినుగను భాగ్యము నిమ్ము, ఈ ద్వారపాలకునకిి నీ నామము నిమ్ము , ఉభయపార్శ్వముల సంతోషము ( సంసార, సాహిత్య ) నిమ్ము ,మోక్షము నిడి కరమున ఆయుధమై ఉండు, నరవర కలియుగ వరదా !

కంద గర్భ శార్దూలం

కంద గర్భ శార్దూలం

శ్రీరామా! నిను గొల్చి తిగ్మకరుడే శ్రీకారుడయ్యెన్ సుధీ
రా! రారా! యిభరాజ రక్ష రయమున్ రావేమిరా! శ్రీధరా!
శూరా! దర్శన మిమ్ము రమ్య చరితా! సుశ్రేయ! ఓ సద్విచా
రా! రారా! కరుణాసముద్ర! రమణా! రారా! ముకుందా! హరీ!

గర్భస్థంగా కందము

శ్రీరామా! నిను గొల్చితి 
 రారా! యిభరాజ రక్ష రయమున్ రావే
శూరా! దర్శన మిమ్ముర !
రారా! కరుణాసముద్ర! రమణా! రారా!

కంద గర్భ ప్రియకాంతా వృత్తము

కంద గర్భ ప్రియకాంతా వృత్తము

ప్రియకాంతా వృత్తము

హరహర! శూలాయుధకర! హారా! భవనాశా!
హరిహర! యిందీవర నుత యార్తిన్ గన రారా!
పురహర దేవా! వర ధర! భూషా! పరమేశా!
మురహర! మమ్మేలు సదయ పోషా! వరదాతా!

*
 గర్భస్థ కందము

హరహర! శూలాయుధకర!
హరిహర! యిందీవర నుత యార్తిన్ గన రా!
పురహర దేవా! వర ధర!
మురహర! మమ్మేలు సదయ పోషా! వరదా!

చతుర్విధ కంద ప్రమితాక్షర వృత్త గర్భ చంపక మాల

చతుర్విధ కంద ప్రమితాక్షర  వృత్త గర్భ చంపక మాల

ఖరకర! శేష తల్ప కనకాభరణా! కమలాప్త వర్య శే
ఖర! కరుణా సహస్ర భవికా చరణా! ముని సేవ్య దివ్య సుం
దర ధరణీశ ధీర జగదాదరణా! వనమాలి మౌళి ఖే
చర! స్మరణీయ పుణ్యతర సత్కరణా! కరుణించరా! వరా/సదా!

గర్భగత ప్రమితాక్షర వృత్తం

కర! శేష తల్ప కనకాభరణా!
కరుణా సహస్ర భవికా చరణా!
ధరణీశ ధీర జగదాదరణా!
స్మరణీయ పుణ్యతర సత్కరణా!

గర్భస్థ కందము 1

కర! శేష తల్ప కనకా
భరణా! కరుణా సహస్ర భవికా చరణా!
ధరణీశ ధీర జగదా
దరణా! స్మరణీయ పుణ్యతర సత్కరణా!

కం//2

కరుణా సహస్ర భవికా
చరణా! ధరణీశ ధీర జగదాదరణా!
స్మరణీయ పుణ్యతర స
త్కరణా! కర! శేష తల్ప కనకాభరణా!

కం//3

ధరణీశ ధీర జగదా
దరణా! స్మరణీయ పుణ్యతర సత్కరణా!
కర! శేష తల్ప కనకా
భరణా! కరుణా సహస్ర భవికా చరణా!

కం//4

స్మరణీయ పుణ్యతర స
త్కరణా! కర! శేష తల్ప కనకాభరణా!
కరుణా సహస్ర భవికా
చరణా! ధరణీశ ధీర జగదాదరణా!

కంద ద్వయ రుగ్మవతీ, కమలవిలసిత గర్భ క్రౌంచపద వృత్త

క్రౌంచపద వృత్తము (1, 11 మరియు 19 యతులు )

చోరిత నీతం శోభిత శూరా! సురవర నరవర శుభకర ధీరా!
సారథి నీవై శాసక చారీ! సరగున హరియన సరసకు రారా!
గారము తోడన్ కాల నిగారా! కరి వర ధర నను కరుణను బ్రోవా!
భారమ దేవా? పాప నివారా! వరములనిడ ఘన వర కర తేజా!

గర్భస్థ కంద ద్వయము

చోరిత నీతం శోభిత
శూరా! సురవర నరవర శుభకర ధీరా!
సారథి నీవై శాసక
చారీ! సరగున హరియన సరసకు రారా!

కం//2//
గారము తోడన్ కాల ని
గారా! కరి వర ధర నను కరుణను బ్రోవా!
భారమ దేవా? పాప ని
వారా! వరములనిడ ఘన వర కర తేజా!

గర్భస్థ రుగ్మవతీ వృత్తం (1,6యతి)

చోరిత నీతం శోభిత శూరా!
సారథి నీవై శాసక చారీ!
గారము తోడన్ కాల నిగారా!
భారమ దేవా? పాప నివారా!

గర్భస్థ కమల విలసిత వృత్తం (1,9 యతి)

సురవర నరవర శుభకర ధీరా!
సరగున హరియన సరసకు రారా!
 కరి వర ధర నను కరుణను బ్రోవా!
వరములనిడ ఘన వర కర తేజా!

క్రౌంచపద వృత్తము (1, 11 మరియు 19 యతులు )

భావము నీవే! భావి విభావా! వరముల నిడు ధర వరగుణ దాతా!
కావుము నీవే! కావలి గావా! కరహర యిడుముల కరుణను గన్మా !
జీవము నీవే! చేవల సేవా! శిరమున శివమని స్థిరముగ దాల్చే !
భూవర నీవే! బ్రోవుము మూవా! మురహర హరిహర పురహర దేవా!

గర్భస్థ కంద ద్వయము

భావము నీవే! భావి వి
భావా! వరముల నిడు ధర వరగుణ దాతా!
కావుము నీవే! కావలి
గావా! కరహర యిడుముల కరుణను గన్మా !


కందము 2

జీవము నీవే! చేవల
సేవా! శిరమున శివమని స్థిరముగ దాల్చే !
భూవర నీవే! బ్రోవుము మూవా! మురహర హరిహర పురహర దేవా!


గర్భస్థ రుగ్మవతీ వృత్తం (1,6యతి)

భావము నీవే! భావి విభావా!
కావుము నీవే! కావలి గావా!
జీవము నీవే! చేవల సేవా!
భూవర నీవే! బ్రోవుము మూవా! 

గర్భస్థ కమల విలసిత వృత్తం (1,9 యతి)
వరముల నిడు ధర వరగుణ దాతా!
కరహర యిడుముల కరుణను గన్మా !
శిరమున శివమని స్థిరముగ దాల్చే !
మురహర హరిహర పురహర దేవా!


****//**
భావి= భవిష్యత్తు ,విభావా= సూర్యుడు, చేవల సేవ = భుజ శక్తి తో చేయు సేవా భాగ్యము,
బ్రోవుము మూవా =  మము బ్రోచే మంచి ముత్యమా,

కమల విలసిత వృత్తం కు ముందు "భ గగ" గణములు చేరిస్తే మరో వృత్తం వస్తే గనక మరో వృత్తం కూడా గర్భగతంగా ఉన్నదండి. 

సచలాచల జిహ్విక సంకరము కందము

సచలాచల జిహ్విక సంకరము కందము

( 2 అచల ఓ సచల)  నా ప్రయత్నం

కందము
పగలు వగలు కపటికి కడు
వగర వగర పగరు పొగడ, పగతో మగడౌ!
మగిడి బగనమయిన కవన
మగు జగము తెగకొను, పగటు హావడి మహితా!
*
అర్థం :- 
కపటికి = కపటము గలవానికి, పగలు వగలు = కక్ష, నటనలు, కడు వగర  వగర = చేదని చెప్పినా ఇష్టమైన పనులు , పగరు పొగడ = శత్రువు పొగడిన, పగతో మగడౌ= పగతో రగిలి పోవును. మగిడి బగనమయిన కవన మగు = నాదస్వరము కూడా భగ్నమైన రాగమోను, జగము తెగకొను = అందరూ విజృంభించు,
పగటు= పరిహసించు, హావడి = ఉపద్రవం కొనితెచ్చు, మహితా= నరుడా,

భావము :- నరుడా! కపటము గలవాడు పగలు వగలు జూపును, తనను పొగడినా పగతో రగిలి పోవును, అతనికి నాదస్వరము కూడా భగ్నమైన రాగమౌను, అందరూ అతనని పరిహసించు , అతనికి ఉపద్రవం పొంచియుండు. 

సపంచాపంచ వర్గీయ సంకరము కందము

సపంచాపంచ వర్గీయ సంకరము కందము

కందము
శ్రీకర నాయక! శ్రీధర
సాకర బాలుని సుమహిత సాధు హృదయమున్
వాకిలి జేరితి , వాజ్మయ
సాకల్యము రిత్తరించు సంధాత సదా!

*
రిత్తరించు= చక్కగా ఇవ్వు, సంధాత = దేవాసురులను కలిపిన వాడ,

భావము :- దీనుడను బాలుడను నీ ముంగిట నిలచాను, కనికరించు కరుణాకర, సాహిత్య
సద్భుద్దినిచ్చి కాపాడు సర్వ కాలములందు, దేవాసురులను కలిపిన వాడ, సంపత్కరుడైన శ్రీధరా!

తలకట్లు కందము

తలకట్లు కందము

కందము
నరవర! ఘనతర నగధర!
సరస సదయ! భవ భయహర! సత్పథ  వరదా!
హర హర! రక్కస మదహర!
వర చక్రధర ! వర గమన ! పన్నగ శయనా!

వ కారాద్యక్షర కందము

వ కారాద్యక్షర గీతము పద్య ప్రేరణతో నా ప్రయత్నం

కందము
వనజ నయన! వైరి హరణ !
వనగూడగ వరము లిడిన వానర వంద్యా!
వినయముగ వినతి నిడితీ
వనమున విడువకు కరమును వర జనపాలా!

Tuesday 16 June 2020

స్వాధీన భర్తృక

1. స్వాధీన భర్తృక
కం/
స్వాధీనుండగు పతి దన సరసన జేరన్
స్వాదిమ మగు బలుకు తోడ స్వస్థత గూర్చున్
పాదముపై పతి కరములు పదనిస లాడన్
మోదము నొందుచు మురిపము ముదితయె జూపున్!

2. వాసక సజ్జక
కం/
మధువనమున జేరి విరుల మాలిక తోడన్
మదిరనయన కేళినీరమణి నాథునికై
కదలాడుచు కోపితయయి కలహములాడున్
కదియించు మదిని తన పతి
కానుక కొరకై!

3. విరహోత్కంఠిత
కం/
విరహోత్కంఠిత సరసుని బిలిబిలి బలుకుల్
మరిమరి దలుపంగ మదిని మంటలు రేపన్
విరహాగ్నికి కురుల నడుమ విరులెల్లను వే
గిరబడి శీతలమును వెదకె నమస్సులతో!

4. విప్రలబ్ద
కం/
శీతకరుండు వెడలె కడు శీఘ్ర గతిని యీ
రాతిరి గడచె నిడ సఖుడు రాకుండెనహో
సాతము గొనిపోయె నిపుడు సరములు భరమై
సేతువులాయె నని దీసె చిటమటమనుచున్

5. ఖండిత
కం/
పరభామల గూడి వడిగ వచ్చితిరేలన్
పరిపాటయ్యెను గద నను బాధింపంగన్
పరిహాసము లాడవలదు పగతుడ వికపై
సరగున నిల్పుము సరసపు శాంతివచనముల్

6. కలహాంతరిత
కం/
బలమైన బలుకుల వెనుక బంధము గనకన్
కలహము లాడతి కరివలె కలుషిత మతినై
వలవల యేడ్చినను జలము వరలక యుండెన్
శిలనైతి నిపుడు వలపుల చిగురులు లేకన్!

7. ప్రోషితభర్తృక
కం/
సుమధుర భాషణములకు నె సోలితి గదరా
సమయము జిక్కిన సరగున సరసము లాడీ
సుమరసమును బంచి విడువ శుభకరమగునే
దమనుడ దయజూపుము మరి తరళేక్షణ పై!

8. అభిసారిక
కం/
అంకతలమునందు ప్రియుని యాటల గురుతుల్
నింకను బాధింప మదిని యెక్కిలి హెచ్చెన్
కంకి వలె నొరుగగ తనువు కలికము లేకన్
జంకక వడివడిగను జనె సరసుని కడకున్!

గర్భస్థ కంద ద్వయము క్రౌంచపద వృత్తము

క్రౌంచపద వృత్తము (1, 11 మరియు 19 యతులు )

భారతి! వీణా ! వాజ్మయ వారీ !  పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార విచారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!
వారిజ నేత్రీ! పాప నివారీ! వమథువు శిరమున పరచవె  శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!

గర్భస్థ కంద ద్వయము

భారతి! వీణా ! వాజ్మయ || వారీ !  పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార వి|| చారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!

కందము 2

వారిజ నేత్రీ! పాప ని|| వారీ! వమథువు శిరమున పరచవె  శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి|| గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!

గర్భస్థ రుగ్మవతీ వృత్తం (1,6యతి)

భారతి! వీణా ! వాజ్మయ వారీ ! 
శారద! దేవీ! సార విచారీ !
వారిజ నేత్రీ! పాప నివారీ!
కోరెద మాతా! కోమలి గౌరీ !

గర్భస్థ కమల విలసిత వృత్తం (1,9 యతి)

పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
సముచిత వరమిడు సరగున వాణీ!
వమథువు శిరమున పరచవె  శాబ్దీ !
కొమరుని కరమును కుముదము జేయన్!
****//**
పమిడి= బంగారం, వమథువు = తుంపర 

మౌక్తిక మాల వృత్త గర్భసీసము

*మౌక్తిక మాల వృత్త గర్భసీసము*

మావటి వైనీవు మనుచు నా మైకము, మునులను బాధించు దనుజ తతిని,
రావణ బృందమ్ము రయము దేవా , ఘన సాకేత పురవాస సరసిజాక్ష !
తావరమై యుండె తనువు త్రాతా నిను గాంచు వరము నిమ్ము కాలహరణ !
కావుము భూమీశ కరుణ తోడన్ సదా బాధలు ద్రుంచెడి భక్త పాల!

ముడుపులనిడుదు కడు ముచ్చట బడి నీకు
పొందుగా పదముల జెందియుండు
పాదములను జూపు వరద! వేదాద్రీశ
కాంక్షదీర మమ్ము గావు మయ్య!

గర్భిత మౌక్తిక మాల వృత్తము (భతనగగ  - యతి 7)

మావటి వైనీవు మనుచు నా మై 
రావణ బృందమ్ము రయము దేవా !
తావరమై యుండె తనువు త్రాతా !
కావుము భూమీశ కరుణ తోడన్ !  

తోదకవృత్త గర్భసీసము

తోదకవృత్త గర్భసీసము*

కువలయ మణిమయ కుండల మండిత భూషా! నలువ తండ్రి పుణ్య పురుష
దరిగొను రణతల దర్పిత రావణ నాశా! సుతనుతుండ నరవర ధర
గొనకొని పణమును కోరిన వామన రూపా! కరివరదా! లోకనాథ!
నిరుపమ గుణనిధి నీదయ కోరితి దేవాధి దేవ సుతీర్థ కరుణ!

కన్నవారినైన కడతేర్చు ఖలులెల్ల
కలిమి బలిమి తోడ కలియ దిరుగ
కరుణ జూపు వేగ కల్కిరూపమ్మున
కాంక్షదీర మమ్ము గావు మయ్య!

గర్భిత తోదక వృత్తము (నజజయ  - యతి 8)

మణిమయ కుండల మండిత భూషా!
రణతల దర్పిత రావణ నాశా! 
పణమును కోరిన వామన రూపా!
గుణనిధి నీదయ కోరితి దేవా! 

పణము = బహుమానము

మణిగణ నికర వృత్త గర్భ సీసము

మణిగణ నికర వృత్త గర్భ సీసము *

కరివరదుడవని కలియుగము న నే నభయము కోరితి భక్త పాల!
బిరబిర కనుగొను పిలుపును విన యాదరి నిలచి యుంటిని శ్రీకరుండ!
దరిసెన మిడు వడి దళిత కలితశ్రీ సరసమురళీధర రమ్య నామ!
ధరవర నిరతము దలతును సదయా మహిత మండలానన యినకులేశ!

రాత్రి వేళ దిరుగు రాక్షస తతులెల్ల
ప్రజలనేలెడి వర రాజులయ్యె
ధరను గాచినట్టి పరశురాముని వలె 
కాంక్షదీర మమ్ము గావు మయ్య!

గర్భిత మణిగణ నికర వృత్తము (నననననస  - యతి 9)

కరివరదుడవని కలియుగము న నే !
బిరబిర కనుగొను పిలుపును విన యా !
దరిసెన మిడు వడి దళిత కలితశ్రీ !
ధరవర నిరతము దలతును సదయా !

మందారదామ వృత్త గర్భ సీసము

మందారదామ వృత్త గర్భ సీసము *
   
తీరమ్ము జేరంగ దేవాధిదేవా! సహాయము జేయర హాటక దొర !
నేరమ్ము లెంచంగ నేనెంత వాడన్! ప్రభూ నిను నమ్మితి భూతలమున !
భారమ్ము నీదయ్య భద్రాద్రి వాసా! సదా స్మరియింతుర దాసపోష!
రారా పరంధామ ప్రహ్లాద రక్షా! శుభంకర నిల్చితి భక్త పాల!

కన్నతండ్రి నైన కడతేర్చు ఖలులెల్ల
గ్రక్కుచుండె విషము కలియుగమున
కరుణ జూపు వేగ కల్కిరూపమ్మున
కాంక్షదీర మమ్ము గావు మయ్య!

గర్భిత మందారదామ వృత్తము (తతత గగ  - యతి 7)

తీరమ్ము జేరంగ దేవాధిదేవా!
నేరమ్ము లెంచంగ నేనెంత వాడన్!
భారమ్ము నీదయ్య భద్రాద్రి వాసా!
రారా పరంధామ ప్రహ్లాద రక్షా!

అలసగతిద వృత్త గర్భ సీసము

అలసగతిద వృత్త గర్భ సీసము *
   
అలగు వీర్యా! హరి ! కలిత కౌస్తుభ సురాసుర ప్రభావా! గౌరి సుతనుతుండ!
భయవిదూరా! హరి! పరమ పావన మయత్వ పరిపాలా! సుర వందనీయ !
నిగమ వేద్యా! హరి! నిరుపమాన దళితావరణ నిత్యా నంద  భక్త పాల!
కరి వరదా !హరి! కరుణ జూపు నిసహాయుడను దేవా !కలియుగమునందు !

ఖలులు మృగములయ్యి బలము జూపు చునుండ 
భక్త తతుల గాచు భవ్యనామ
ధర్మ మార్గమందు కూర్మి నిడుచు నీవు
కాంక్షదీర మమ్ము గావు మయ్య!

గర్భిత అలసగతి వృత్తము (నసన భయ  - యతి 10)

హరి ! కలిత కౌస్తుభ సురాసుర ప్రభావా! 
హరి! పరమ పావన మయత్వ పరిపాలా!
హరి!నిరుపమాన దళితావరణ నిత్యా !
హరి! కరుణ జూపు నిసహాయుడను దేవా !

నది వృత్త గర్భ సీసము

నది వృత్త గర్భ సీసము *
   
అవగతిని కదలను వరదా కందకమందు ధీరా! సుర వందనీయ !
నలుడవైన ముదమున సదయా పొత్తము జూడు శ్రీశా! లోక సుందరాంగ!
యనుదినము వదలను నిను కాపాడుము భక్త పాలా! రఘువంశ సోమ !
కదలాడక కుదురుగ నిలురా కొంచెము నీరజాక్షా!వర నిరుపమాన !

చర్మనాటకమున మర్మము దెల్పుచు
ధర్మ మార్గమందు నిర్మలముగ
కర్మసలుపు రీతి కూర్మినిడుచు నీవు
కాంక్షదీర మమ్ము గావు మయ్య!

గర్భిత నది వృత్తము (ననతజగగ - యతి 8)
కదలను వరదా కందకమందు ధీరా  !
ముదమున సదయా పొత్తము జూడు శ్రీశా!
వదలను నిను కాపాడుము భక్త పాలా !
కుదురుగ నిలురా కొంచెము నీరజాక్షా!

ప్రియకాంత వృత్త గర్భ సీసము

ప్రియకాంత వృత్త గర్భ సీసము *
   
కనుగొన నీరూపు కనుల కంజానన లీలా వినోద సుశ్రేయ బాల !
మనమున నీవుండి మహిని మమ్మేలర శ్యామా మనోహర న్యాయశీల !
మనవిని మన్నింపు మహిత మాతాపస రక్ష్యా నిగమనుత రఘుసుమాల !
ఘనుడవు నీవందు ఘనముగా నే వర భద్రాద్రి నిలయుండ భక్త పాల!

తనువు ధనము నీవు త్యాగరాజ వినుత
దినదినమున తిరిగి దిక్కు లేక
సదయుడవని వేగ శరణు జొచ్చితి రామ
కాంక్షదీర మమ్ము గావు మయ్య!


గర్భిత ప్రియకాంత వృత్తము (నయనయసగ - యతి 11)

కనుగొన నీరూపు కనుల కంజానన లీలా
మనమున నీవుండి మహిని మమ్మేలర శ్యామా
మనవిని మన్నింపు మహిత మాతాపస రక్ష్యా !
ఘనుడవు నీవందు ఘనముగా నే వర భద్రా!

నిశా వృత్త గర్భ సీసము

నిశా వృత్త గర్భ సీసము *
   
జనక తనయ రామచంద్రుండు జూడంగ సౌందర్య పాదార విందుడమ్మ !
వన ముని సుర బృంద భారమ్ము మ్రోయంగ కోదండమున్ బట్టె కోరి యతడు !
ఘనముగ దునుమాడి కాంతారమున్ ప్రత్యవస్థాతులన్ పారవశ్య మొందె!
మనవిని విను నీవు మాయమ్మశంకింప వద్దమ్మరో రామ పథము నెపుడు !

అమ్మ ‌మమ్ము గన్న యఖిలాండ నాయకీ
సదమల చరిత మృదు పాద యుగళి
భక్త తతులు గొల్చు భక్తాపరాధీన
కాంక్షదీర మమ్ము గావు మమ్మ!

గర్భిత నిశా వృత్తము (ననరరరర - యతి 9)

జనక తనయ రామచంద్రుండు జూడంగ సౌందర్య పా
వన ముని సుర బృంద భారమ్ము మ్రోయంగ కోదండమున్
ఘనముగ దునుమాడి కాంతారమున్ ప్రత్యవస్థాతులన్
మనవిని విను నీవు మాయమ్మశంకింప వద్దమ్మరో !

కాంతారము = అడవి ,ప్రత్యవస్థాతులు = విరోధులు (రాక్షసులు)

*రుచిర వృత్త గర్భ సీసము *

*రుచిర వృత్త గర్భ సీసము *
అలఘు వీర్య సమీప మందు నిలతు సజ్జనావనా! వామన! నరవర ధర!
అపరాజిత మమేకమై వరలెడి మౌనిమానసా! సుందర మామమామ!
ఇమ్ముగను ప్రమోద మిమ్ము సదయ వైరి నాశనా! నిన్ను నే నమ్మి యుంటి
శ్రీభావిత నమస్కరింతు గరిమ! నన్ను గావరా! కరిరాజ కరుణ తోడ!

కాలులై మీరు చున్నట్టి ఖలుల నడుమ
నార్తి తోడ బిలుచు చుంటి హరిహరి యని
చిమ్మదిర్గు భయము నిండె చిత్తమందు చింత దీర్చర రయమున శేషశయన!

గర్భిత రుచిర వృత్తము (జభసజగ యతి 9)

సమీప మందు నిలతు సజ్జనావనా!
మమేకమై వరలెడి మౌని మానసా!!
ప్రమోద మిమ్ము సదయ వైరి నాశనా!
నమస్కరింతు గరిమ! నన్ను గావరా!

అంతరాక్కర వృత్త గర్భ సీసము

అంతరాక్కర వృత్త గర్భ  సీసము 

రామరామ దలతు రఘువీర లక్షితా లక్షణా యజమున రామచంద్ర
రామ రామ నిలతు రమ నాయకా నె నీచెంత గోపవధూర స్థిరము గాను
రామరామ పిలతు రణధీర నేడు వేసారి నిన్ను సదయ శక్తి కొలది
రామరామ గొలుతు రఘువంశ సోమ కోదండ రామ యనుచు దండిగాను

మౌని యాగము గాచిన మాననీయ
వైరికి వరము లిచ్చిన వందనీయ
చిమ్మదిర్గు భయము నిండె చిత్తమందు
చింత దీర్చర రయమున శేషశయన!

గర్భిత అంతరాక్కర (1 సూర్య+ 2 ఇంద్ర +1 చంద్ర గణములు యతి 3వ గణ ఆఖరి అక్షరము)

తలతు రఘువీర లక్షితా లక్షణాయ
నిలతు రమ నాయకా నె నీచెంత గోప
పిలతు రణధీర నేడు వేసారి నిన్ను 
గొలుతు రఘువంశ సోమ కోదండ రామ !

యజమున= యజ్ఞము, చిమ్మదిర్గు = గిరగిర దిరుగు

మోహప్రలాప వృత్త గర్భ పంచపాది ద్విప్రాస సీసము

మోహప్రలాప వృత్త గర్భ పంచపాది ద్విప్రాస సీసము 

తాతల, త్రాతల ధౌరేయ సుప్రకాశా! రిపు సంహార! జయము జయము!
జేతల గాచిన శ్రీమానసా ముకుందా! సలలితముగ దాస తతులు,
భూతల గాములు పూజించు దేవదేవా! హరి నిను గూడ వచ్చి నట్టి
నేతల కానిక నీకేల? నిర్మలాత్మా! కరుణాకర దాసపోష
జోతల దాసుడ శోభిల్లు శ్రీనివాసా! సురభూసుర సారసాక్ష !

గుహుడు కడిగిన పాదము గొప్ప దనుచు
బట్ట వచ్చితి గట్టిగ పంక జాక్ష
రక్కసులను దండించుచు రయము గాను
భక్త తతులను రక్షించు పరమ పురుష
పలుకక పరాకు సేయుట పాడిగాదు!

మోహప్రలాప వృత్తము ద్విప్రాస 

తాతల త్రాతల ధౌరేయ సుప్రకాశా!
జేతల గాచిన శ్రీమానసా! ముకుందా!
భూతల గాములు పూజించు దేవదేవా!
నేతల కానిక నీకేల? నిర్మలాత్మా! 
జోతల దాసుడ శోభిల్లు శ్రీనివాసా!

ధౌరేయ = భారము వహించు వాడు, గాములు =  గ్రహములు

తరలి వృత్త గర్భ సీసము

 తరలి వృత్త గర్భ సీసము

గాముల గౌరవ కరుణా రస భర కామిత ఫల దాయకా! గతియు నీవె !
కారణకారణ గరిమా!సుజనుల గాచెడి వరదా సదా ! చిత్ర వర్ణ
సమవర్తి, కైరవి చరణా! శుభకర కాలహరణ మేలరా! లత్తమందు
పాప నివారణ భరిణా! మము గను వాడవు గద శంకరా! భవభయహర!

పిలచిన బలికి నాడవు వేకరమున
శివశివ యనిన జాలని చిత్త మందు
దురితములను వడివడిగా ద్రుంచెదవట
కరుణ జూపి మమ్మేలరా కాలహరణ!
 తరలి వృత్తము (భసనజ నర యతి =11)

గౌరవ కరుణా రస భర కామిత ఫల దాయకా!
కారణ గరిమా!సుజనుల గాచెడి వరదా సదా !
కైరవి చరణా! శుభకర కాలహరణ మేలరా! 
వారణ భరిణా! మము గను వాడవు గద శంకరా!

తోటక వృత్త గర్భ సీసము

 తోటక వృత్త గర్భ సీసము

ఆర్తితోడను కమలాప్తుడు భక్తుల గాచు వెసన్ సదా కరము నిడుచు
వాసి మీరిన యమ పాశము రాదిక యాదరికిన్ హరిహరి యన మరి
కోరి జేరిన సమకూరును సర్వము సాధనతో శేష శయనుని గన
కంచి జేరిన దుమికించును దూరము దుర్ధశలన్ ముకుందుడు వడిగను

మూడు కాలము లందున పూజ సేయ
ఆరుగురు శత్రువులను తానడుచి వేయు
ముక్తి మార్గము జూపుచు ముందు నిలచు
గాన రసము గ్రోలను వేగ కదలి రండు

తోటక వృత్తము

 కమలాప్తుడు భక్తుల గాచు వెసన్
యమ పాశము రాదిక యాదరికిన్
సమకూరును సర్వము సాధనతో 
దుమికించును దూరము దుర్ధశలన్

ఉత్సాహ వృత్త గర్భ సీసము

ఉత్సాహ వృత్త గర్భ సీసము

నీట జిక్కగ కరి నిన్ను నిసిని వేడగా హరీ త్వరితమ్ము కరుణ జూపి
మేటి కుంభి శిరము మీట, మిగుల సంతసమ్మునన్ కరి మానసమున నిల్పి
పాట పాడగ విని భాగవతులు జేరె రక్షకా కలి వేకరమున దేవ
కాటిపాపడ యిల హాటక ధర కావు చిన్మయా మము నేడు శీఘ్రముగను

పక్షివాహనా ముదమున వరము నొసగు
చక్రపాణి సంతసమున శక్తి నొసగు
సోమ గర్భుడ యెనలేని శుభము లొసగు
పుండరీకాక్ష భవభయ ముక్తి నొసగు!

ఉత్సాహ వృత్తము

నీట జిక్కగ కరి నిన్ను నిసిని వేడగా హరీ !
మేటి కుంభి శిరము మీట, మిగుల సంతసమ్మునన్ !
పాట పాడగ విని భాగవతులు జేరె రక్షకా !
కాటిపాపడ యిల హాటక ధర కావు చిన్మయా !

చంద్రికా వృత్త ద్వయ గర్భ సీసము

చంద్రికా వృత్త ద్వయ గర్భ సీసము

విలువిఱిచిన వేదవేద్యుడా! కలకిితనముగా కళానిధీ! నవ్య గతిని
ఫలము నిడర పక్షివాహనా ! పిలిచిన నిను ప్రీతితో సదా!నిగమ వేద్య !
కలవు తిమిరి గ్రమ్మ గావ రాగలవు కరిని గాచినట్లు గా యనిని దేవ
చెలుని దరిని జేరుశీఘ్రమే ! చెలువము గల శ్రీశ చిన్మయా! కమల నయన!

ఆర్తితోడ బిలువ నాడు హరి హరి యని
నాతి మానము గాచిన నరవర నిను
ఖలుల నడుమ జిక్కి వడిగ కావ మనిన
కరుణ జూపవదేలను క్ష్మావరేశ!

చంద్రికా వృత్త ద్వయము
(ననరవ యతి 7)

1, విలువిఱిచిన వేదవేద్యుడా! కలకిితనముగా కళానిధీ!
ఫలము నిడర పక్షివాహనా ! పిలిచిన నిను ప్రీతితో సదా!

2. కలవు తిమిరి గ్రమ్మ గావ రా గలవు కరిని గాచినట్లు గా
చెలుని దరిని జేరుశీఘ్రమే ! చెలువము గల శ్రీశ! చిన్మయా!