Tuesday 16 June 2020

స్వాధీన భర్తృక

1. స్వాధీన భర్తృక
కం/
స్వాధీనుండగు పతి దన సరసన జేరన్
స్వాదిమ మగు బలుకు తోడ స్వస్థత గూర్చున్
పాదముపై పతి కరములు పదనిస లాడన్
మోదము నొందుచు మురిపము ముదితయె జూపున్!

2. వాసక సజ్జక
కం/
మధువనమున జేరి విరుల మాలిక తోడన్
మదిరనయన కేళినీరమణి నాథునికై
కదలాడుచు కోపితయయి కలహములాడున్
కదియించు మదిని తన పతి
కానుక కొరకై!

3. విరహోత్కంఠిత
కం/
విరహోత్కంఠిత సరసుని బిలిబిలి బలుకుల్
మరిమరి దలుపంగ మదిని మంటలు రేపన్
విరహాగ్నికి కురుల నడుమ విరులెల్లను వే
గిరబడి శీతలమును వెదకె నమస్సులతో!

4. విప్రలబ్ద
కం/
శీతకరుండు వెడలె కడు శీఘ్ర గతిని యీ
రాతిరి గడచె నిడ సఖుడు రాకుండెనహో
సాతము గొనిపోయె నిపుడు సరములు భరమై
సేతువులాయె నని దీసె చిటమటమనుచున్

5. ఖండిత
కం/
పరభామల గూడి వడిగ వచ్చితిరేలన్
పరిపాటయ్యెను గద నను బాధింపంగన్
పరిహాసము లాడవలదు పగతుడ వికపై
సరగున నిల్పుము సరసపు శాంతివచనముల్

6. కలహాంతరిత
కం/
బలమైన బలుకుల వెనుక బంధము గనకన్
కలహము లాడతి కరివలె కలుషిత మతినై
వలవల యేడ్చినను జలము వరలక యుండెన్
శిలనైతి నిపుడు వలపుల చిగురులు లేకన్!

7. ప్రోషితభర్తృక
కం/
సుమధుర భాషణములకు నె సోలితి గదరా
సమయము జిక్కిన సరగున సరసము లాడీ
సుమరసమును బంచి విడువ శుభకరమగునే
దమనుడ దయజూపుము మరి తరళేక్షణ పై!

8. అభిసారిక
కం/
అంకతలమునందు ప్రియుని యాటల గురుతుల్
నింకను బాధింప మదిని యెక్కిలి హెచ్చెన్
కంకి వలె నొరుగగ తనువు కలికము లేకన్
జంకక వడివడిగను జనె సరసుని కడకున్!

No comments:

Post a Comment