మనవిని వినుము వినాయక
ఘనముగ నను బ్రోచుటకయి ఘనుడవు స్వామీ
నిను విమల మతిని వేడెద
ఘనమగు నీ శతక రచన కర్తవు నీవే
కంటికి గనబడు దేవుల
జంటకు, నాచార్యులకును, సాధు జనులకున్
వెంట నిలచు సహృదయులకు
కంఠము వంచి నతు లిడుదు గరువము తోడన్
: ప్రాకటముగ కీర్తింతును
జోకమునను కోర్కె దీర్చు శుభదాయక నే
చేకొన్న యీ శతకమును
లోకము మెచ్చెడి విధముగ రూపము నిడురా
1. ఘన శంకరార్యులను నే
మనమున నిలిపి మొదలిడితి మంకు తనమునన్
ఘన పండిత నేమాని క
విని వేడి విశద పరచెద వినయ మలరగన్ !
2. భావజనక శుశ్రూషను
భావమ్మున నిలిపి జేయ భయమును ద్రోలున్
పావన పదములు గాంచిన
దావరి ధన్యత నొసగును దప్పక మనసా!
3. దశరధ రాఘవు డిలలో
దశవిధ వేషములు దాల్చి దనుజుల నడచెన్
పశుపతి నుతడే నీ దు
ర్థశలను బాపునని వేడు దండిగ మనసా!
4. మ్రొక్కిన సద్గురు పదములు
మక్కువ తో క్లేశమెల్ల మటుమాయ మగున్
గ్రక్కున బ్రోచును కరుణను
పెక్కు విధంబుల నుతించు ప్రీతిగ మనసా!
5. సర్వాంతర్యామి నెరిగి
దుర్విషయంబులను వడిగ దూరము జేయన్
సర్వజ్ఞుడు ప్రబలించగ
నుర్విని కలుషమ్ము తుడుచు టుచితము మనసా!
6. అగ్నిని బడంగ బీజము
భగ్నమగు పగిదిని యిలను పామర తతులే
మగ్నమగు, జగద్గురు నే
లగ్నము జేసి నడచుటయె లక్ష్యము మనసా!
7. తైలము బూసిన కరముల
పాల పనస పండు జిగురు పట్టని రీతిన్
మేలుకొను తత్వ వేత్తకు
నీలమ్మున మాయలంట నేరవు మనసా!
8. మెత్తని మన్నుపయి మొలయు
విత్తు కఠిన శిలను గాదు విశ్వాసమునన్
చిత్తమ్ము దుత్త మైనను
విత్తము జేరు గద వేగ వినవే మనసా!
9. అటమట నొంది కుచేలుడు
అటుకుల నిడ ముదమున దినె నమృతమ్మనుచున్!
వటపత్రశాయి దెలిపెడి
లొటారపు కిటుకును గొనుడు రూఢిగ మనసా!
10 . ఇహమున ద్రౌపది వేడగ
మహితుడు మును వలువల నిడి మానము గాచెన్
సహచరుడై, వైరి తతిని
దహనము జేయు హరి పదము దలచవె మనసా!
11. కమ్మని గానమున కరగి
యొమ్ముగ ప్రహ్లాదు గాచె నుత్కర్షమునన్
తమ్మునికి పాదుక లొసగి
యిమ్ముగ వరము లిడు వాని నెన్నవె మనసా!
12. అక్షయుడని నిశ్చయముగ
పక్షము జేరి హరియనుచు పరవశ మొందెన్
నీ క్షితిని మౌను లెల్లరు
తక్షణమె పరాత్పర యను తన్విని మనసా!
13. భవ భయములు ద్రుంచిన యా
భవికా చరణుని పదములు బట్టిరి ధరలో
కవగొను మోహము వీడుచు
స్తవమున పరమాత్మ దరికి తరలవె మనసా!
14. దృష్టిని నిలిపిన జ్ఞానులు
స్పష్టముగా దెలిపె రియిను పరతత్వమునన్
ఇష్టముగ గుణరహితులగు
శిష్టుల దరిజేరి వడిగ శ్రీ యను మనసా!
15.ముఖ్యమగు మూల మెల్లను
సఖ్యతతో దెలిపి సేవ సలుపుచు ధరలో
విఖ్యాతిని గాంచిన రా
మాఖ్యుల దర్శనము కోరు మార్తిగ మనసా!
16. హితశత్రు లార్గురుని మును
హతులను జేయంగ భక్తు లనిశము ధరలో
చతురాక్షరిని స్తుతించిరి
సతతము సద్గురుని జేరు శార్కర మనసా!
17. ఏడు గవాక్షపు మేడను
షోడశ భావము నెరిగిన శుభములు గలుగున్
వాడగ నేకాక్షరి పో
రాడును వేడుకలరగ మురారియె మనసా!
18. మూరెడు బెత్తెడు శల్యము
దూరెడి చిత్కళని గనిన దొరతన మందున్
ఆరుగ చుట్టిన పామును
ఊరట జెందుగ ధరణిని యుక్కిరు మనసా!
19. చూడగ చోద్యం బైనది
ఆడది మగవాడు గాక నాడుచు నుండెన్
రూఢిగ గనుగొను వారికి
యేడను జూచిన గనబడు నెన్నగ మనసా!
20. కాంతి తిమిరమ్ము గానిది
శాంత గుణ బుధ కవుల కది సన్నిధి నుండెన్
చింతయు లేమియు లేకను
వింతలు సలుపుచు దిరిగెను విరివిగ మనసా!
: 21. గుట్టు దెలిసిన గుణులకా
గట్టు బయలు జేయుచుండె గమ్మత్తుగ నా
చుట్టము ఘటంబున శశిల
పట్టు బడుచునుండె ధరను వాసిగ మనసా!
: 22. తల్లియు దండ్రియు లేనిది
నల్ల కలువపైన నిలచి నర్తించుచు తా
మెల్లగ తుర్యము నొందుచు
నెల్లలు దెలుపగ మరి విను డెన్నగ మనసా!
23. వందనమున దండ ధరుని
బందిగ జేసిరి వరదుని భక్తవరులిలన్
ఎందులకే సందేహము
పొందుగ పాదారవిందము గనవె మనసా!
24. నిండగు వేడుక తోడను
పుండరీకాక్షుని పదమును పొందుగ నొందీ
యండగ జేరిన యోగుల
దండకము ననభ్యసించు దనరుగ మనసా!
25. జనన మరణముల నెరుగని
ఘనమగు సోహము మరుగున కవచము నొందీ
యెనలేని సాదు బిందువు
గని యానందమును పొందు గజిబిజి మనసా!
26. జడము గడచి కుడియడమల
నడుమన చెడుగుడి గుడియని నడచిరి ధరలో
ధృడముగ నుడి గడువ వలెను
తడబడకను సుడిని బడక తరలవె మనసా!
27. మూడు మెకములకు చిక్కని
తాడిని యెక్కిరి నిరతిగ తాపసులెల్లన్
వేడుకతో సద్గురుదరి
చేడియ నయనముల జూడు స్థిరముగ మనసా!
28. నారాయణ చతురాక్షరి
పారాయణ యని నిరతము పాడిరి ధరలో
సారము లేని ఘటమ్మున
సారమగు చరణము నిలుపు సరగున మనసా!
29. ఘనుడగు రాముని సిరిగలి
గిన మరువక కీలు దెలిసి కీర్తించక యా
యెనుబది నాలుగు లక్షల
యెనుబది యోనుల జనించు టేలను మనసా!
30. వేడుకతో కీర్తనలు
బాడుచు సద్గురు చరణము బట్టిరి ధరలో
మూడు గుణములను గూల్చగ
వీడకు పరమాత్ముని యది వీడెము మనసా!
31. కోరిన వరమిచ్చుననుచు
పారాయణ జేసి యుండె భక్తులు భువిలో
నేరము లెంచక యేలెడి
నారదలోలుని నిరతము నమ్మవె మనసా!
32. కాయము స్థిరమని నమ్ముచు
మాయను మక్షికములవలె మాయకులెల్లన్
తోయజనేత్రుని దలచగ
పోయిరి యమకూపమునకు మునుకుచు మనసా!
33. కానను బంగరు జింకను
జానకి కోరగ వరలిన శౌరిని భువిలో
కానగ మౌనులు ముదమున
గానము జేసిరి విడువవె కలతను మనసా!
34. తమము భువిని జేరుకొనగ
సమరము జేయంగ వచ్చు శమము కొరకు నా
కమలాక్షుని గాంచగ మో
హము వీడి యనిశమ్ము హరియను మనసా!
35. చిత్ర విచిత్ర మగు జనులు
ఛత్రము బట్టుచు సరసుని సన్నిధి జేరన్
చిత్రము నందున దేవకి
పుత్రుని బట్టవె పురాణపురుషుని మనసా!
37. దుర్గమమై నిల్చెడి యా
స్వర్గపు దారులు దెలిపెడి వరదుండను స
న్మార్గపు నాశ్రయమున హరి
వర్గము జేరి నిరతమ్ము బాడవె మనసా!
38. తర్జనభర్జన వలదిక
దుర్జన తతిపై మరిమరి దుముకుచు నుండన్
గర్జన జేయుచు కడు ను
త్సర్జన జేయు హరిదరికి తరలవె మనసా!
39. పార్థునకు సంగరమ్మున
నర్థములిడి దుర్జన మదమడచు ఘనుని ని
స్వార్థముతో గొలిచిన నది
వ్యర్థము కాదెన్నడు హరిహరియను మనసా!
40. మన్మధ జనకుండు సదా
చిన్మయుడయి భక్త వరుల జేరుచు నుండన్
జన్మము ధన్యత నొందును
చిన్మయ రూపుని సరగున జేరవె మనసా!
: 41. నిత్యము నెమ్మదితోడను
సత్యము నే బలుకు వంశ సంబం దిల సాం
గత్యము నే కోరి దిరుగ
నిత్యము సత్యము బలుకుము నిరతిగ మనసా!
42. కర్మలు జేసెడి వానికి
మర్మము దెల్పుచు ముదమున మహితుండిలలో
ధర్మము దప్పని దక్షుని
నిర్మల చిత్తుని దరి నిలు నిరతము మనసా!
43. విస్మయముగ వైరికి యా
రస్మి నిడిన వాని గనిన స్రావిని నీవే
విస్మయ మొందక ముందుగ
అస్మాదృశుడనుచు వేడు డార్తిగ మనసా!
44. గర్వముతో దిరుగాడిన
ఉర్వీశుని యురిది గూల్చి యుసురును దీసీ
సర్వుల గాచెడి స్వామిని
సర్వము నీవనుచువేడు సరగున మనసా!
45. ఖరదూషణాదులను తన
శరవర్షముతోడ దునిమి శశివదనుండై
ధరణిజ భయమును దీర్చిన
కరివదనుని జేర్చు కొనవె కౌగిట మనసా!
46. మునియాగము గాచుట కై
వినయమ్ముగ తా వెడలిన పీతాంబరుడన్
ఘనులు నుతియించ దనరుగ
ముని వరుని వలె మరి బట్టు ముందుగ మనసా!
47. సంశయము వలదు నినకుల
వంశ ఘనుండిలను జేరి వానరతతికిన్
అంశము పంచెను రణమున
అంశువునిమ్మనుచు వేడు మార్తిగ మనసా!
48. కంచిని సంతస మొందుచు
పంచుచు నమృతమ్ము నిలను వైరి శిరమునన్
ద్రుంచి వడివడిగ వరలెడి
అంచితుడగు హరిని వేడు డనిశము మనసా!
49. కంభమును జీల్చి వరదుడు
గంభీర వదనము తోడ కలతలు బాపన్
శంభువు దరి జేరగ నా
కుంభకమున సుందరుడను కోరవె మనసా!
50. అందరి బంధువు హరియని
సుందర కవనమున జదివి ఝూటము నందున్
సందడి జేసెడి భక్తుల
సందుకొని ముదమ్ము నొందు సతతము మనసా!
: 51. మదమత్సర దుర్గుణముల
మొదలును నరకు హరిమంత్రమును గనుగొనవే
ముదమున పంకజనాభుని
పదమును సూటిగ స్థిరముగ పట్టవె మనసా !
52. మురహర నామొర వినుమన
బిరబిర యరుదెంచి కరికి భీతిని ద్రుంచన్
తెరవియ్యది ధర యందున
మరలు గొనుచు హరిని బిలువు మరిమరి మనసా!
53. అయ్యలు దెలుపగ విని మరి
చయ్యన వేడిన శిశువును సరసర బ్రోచెన్
కయ్యమును వీడి స్థిరముగ
నెయ్యము జేయుడు నిరతము నేర్పుగ మనసా!
: 54. పుడమిని యిడుముల దాడికి
జడియగ పనిలేదు, వడిగ సవ్వడి యేలన్
కడబడు పరాగ మందున
కడతైనను హరిని దలచి కదలవె మనసా!
55. ఉల్లము జల్లను విధముగ
బెల్లము పంచిన ఘనమని బిరబిర నీవా
చిల్లర దేవుని గొలువక
వల్లభుని దరి నిలువంగ వరమిడు మనసా!
56. విన్నపము జేయ నిడుముల
కన్నడ సేయక వడివడి కరిభయ హరణా
పిన్నను కన్నుల జూచిన
పన్నగ శయనుని చరణము బట్టవె మనసా!
57. కరియు మకరియు కొలనులో
విరివిగ బోరగ హరియని వేడ మకరినన్
నరకి కరిని గాచిన శ్రీ
హరిని హరీయని బిలువవె యార్తిగ మనసా!
58. రాతిని నాతిని జేసిన
సీతాపతి నొక్కరీతి స్థిరముగ జేరన్
ప్రాతపయి మోహము మరియు
కాతర్యము దొలగు వేగ కరుణను మనసా!
59. చేవ గలిగినంత భువిని
సేవలు జేయగ విరివిగ చీకటి జీలున్
దేవ రహస్యములు దొరకు
జీవము దేవుని దరి వడి చేరగ మనసా!
: 60. నారాయణ మంత్రమ్మును
కూరిమి తో తారకమని కోరి బలుకగన్
సారమగు కండ చక్కెర
ధారలు మించిన రుచి దొరకు దండిగ మనసా!
61. కామజనకు నిహమ్మున
వేమారు దలచిన వేద వేద్యుడు విధిగా
ప్రేమను బంచుచు నిరతము
బాముల దీర్చుచు తిముకులు బాపును మనసా!
: 62. అంకితుడయి పలుమారులు
పొంకమలరగ ధరనేలు మురహరిని సదా
బింకముతో గొలచిన యమ
కింకరు లెన్న డిలను నిను గెలువరె మనసా!
: 63. కరి మొరలిడ రక్షించిన
సిరిపతిని శరణు శరణన చెంతను నిలుచున్
హరినారాయణ యనుచును
మరువక దలచిన యిడుములు మరలును మనసా!
64. ఆపద లెడ బాపుము నీ
కోపము జూపంగ వలదు కువలయ మందున్
పాపము లెక్కించక నను
కాపాడన వరదుని మది కరుగద మనసా!
65. బాలా గోపాలా యని
నీలీ దేహుని బిలచిన నిరతిగ బ్రోచున్
జాలము సేయక సద్గుణ
శీలుడరసి సిరులొసంగు స్థిరముగ మనసా!
66. దండిగ శ్రీపతిని దలచు
చుండెడి బాలుని, రుధిరము చూషణ చేయన్
నిండుగ బిల్చిన దంతిని
దండిగ రక్షించెను గద దనరుగ మనసా!
67. సారసదళ నేత్రుని యీ
క్రూర మనుజులేమెరుంగు కూరిమి లేకన్
ధీరుని మహిమలు భక్తులు,
నారదమునివరుడు దెలిపె నగరిని మనసా!
68. పామరులెరుగరు మేదిని
దామోదరుని గొల్చు నట్టి తపజప విధులన్
కామిత ఫలముల నిచ్చును
తామసమును వీడి గొలువు దప్పక మనసా!
69. కాంతల గని విభ్రాంతియు
సంతాపించక సరియగు సమయము నందున్
ఇంతుల చెలిమి విడచి శ్రీ
కాంతుని కొలువంగ సిద్ధి గలుగును మనసా!
70. ధరలో దుర్మార్గుల తో
చరచర యరగక మురహరి చరణమ్ములనే
మరువక స్మరించి నడువవె
సరసుని నెరనమ్మి నీవు సరగున మనసా!
71. అనుదినమున పదయుగళము
పెనుచు మరువక మును దలచి పెడమరలక నీ
మనవిని ఘనముగ దెలుపుము
తనువు తరములు గను నిలను దనరుగ మనసా!
72. పరతత్వము కొరకు శరణు
శరణని సద్గురుల దరిని సాధన తోడన్
ధరలో నార్యులు బలికిరి
గురుడేపరమాత్ముడనుచు గొప్పగ మనసా!
73. మోక్షంబు నొందుటకు నే
దీక్షలు జేయ వలదిలను దీనుల దరిలో
సాక్షిగ తత్వమసి కయి సు
శిక్షణ పొందవలయు ఫలశృతి యగు మనసా!
74. అజ్ఞాన మణగిన జనుల
విజ్ఞానము కీర్తి నొందు విశ్వము నందున్
ప్రజ్ఞాన మేను బ్రహ్మము
సుజ్ఞానమె వేద శృతులు సొగసుగ మనసా!
ద్విప్రాస
75. మగవారు లాడు వారుగ
మగువలు మగవారిగ మరి మారుచు నుండన్
మగవారిని పగవారను
మగువల మాటలు మరచిన మంచిది మనసా!
త్రిప్రాస
76. కనిపించదు పచ్చిక మరి
కనిపించవు గోవులు కనకమహాలక్ష్మీ
కని పెంచు పాలతోడను,
కనిపించని పాల కడలి కలదులె మనసా!
77. మ్రొక్కవె పద్మజ రాణికి
మక్కువ తోడను దలచవె మంజుల భాషన్
చిక్కులు గ్రక్కున వీడును
మ్రొక్కవె వాగీశ్వరికిని ముదమున మనసా!
78. కుదురు బడగ సాధ్యమగునె
హృదయమున మలినములు గల హీనుల కెల్లన్
వదలక రాముని పాదము
పదిలమగు పరమమును గన పరుగున మనసా!
79. కొండ పొడుగూన జేయగ
నిండిన పాపమ్ములెల్ల నేడు చెలయుగన్
తాండవ మాడెడి ప్రభువును
దండిగ వేడి దరిజేర దప్పును మనసా!
80. కామిత ఫలముల నిచ్చెడి
దామోదరుని పదములను ధరణిని బట్టీ
వేమారు దలచు యోగుల,
మామ దరి నిలచిన జాలు మనుచును మనసా!
: 81. అన్ని మతంబుల చిన్నెలు
చిన్నియ మీరగను దెలిసి జేరగ మతమున్
పున్నెపు వెన్నెల తత్వము
కన్నుల మధ్యన నిరతము గాంచుము మనసా!
82. ఆపద లెడ బాపు మనుచు
శ్రీ పాదము బట్టి గొల్వ శీఘ్ర గతిని తా
కాపాడిన వాడిని గని
నీ పాలిట దైవ మనుచు నేర్వవె మనసా!
90. మావటి మిక్కిలి ప్రీతిని
పావనిని పుడమి కలుషము బాపగ బంపెన్
దైవశిఖామణి దయతో
త్రోవను జూపంగ నేల దూరము మనసా!
91. రంగాయని యినుమారులు
మంగళకారుని బిలువగ మండితమున నా
రంగడు పొంగి వరములిడు
చంగుడు దరి విద్య నేర్వు చంచల మనసా!
92. మంగళ దేవత ముంగర
మంగళమునొసంగు కాంతి మర్మము కొరకై
మంగళ హారతి మంజిమ
గంగానది తీరమందు గాంచవె మనసా!
93. వసుధీశా మము దయ గను
వసివాడితిమని కొలనున వనితలు వేడన్
పసిగాపు వస్త్రముల నిడె
పసివాడిని బట్టుడిలను వాసిగ మనసా!
94. మసిబూసిన యీ జగతిని
వసుధేశుడు పరశువు గొని పరమును జూపెన్
అసుర తతులకెల్ల చెరలు
నసిధారావ్రతము సల్పె ననిశము మనసా!
95. కన్నుల నీ మృదు రూపము
నెన్నడు గాంచంగ వైతి మెన్నగ ననుచున్
మిన్నగ వేడిన వారలు
కన్నయ్య చిరు నగవులకు కరగిరి మనసా!
96. తప్పింప ముప్పు గప్పకు
తప్పగు సర్పమునకు మును తాటకి వలెనే
నొప్పించుట కడు సులభము
మెప్పించుట మే కఠినము మేదిని మనసా!
97. తప్పు సరి జేయు గురువులు
వొప్పులనే వెదకు చుండు నుత్తమ గురువుల్
తప్పుల నొప్పన దండ్రిగ
నొప్పును కువలయమునందు నుడకవె మనసా!
98. తప్పులు వెదకుచు నుండెడి
గప్పలు కుప్పలుగ జేరి కలహము లాడున్
ఎప్పటికప్పుడు వాటిని
దప్పించుకు దిరుగ మేటి తపమగు మనసా!
99. మొలవరకు ధరించిన వలు
వలతో నడి వీధులందు వయ్యారముగన్
వెలయాలి వోలె దిరిగెడి
కలవారిని జూచి జాలి గల్గెను మనసా!
100. అన్నియు నావని నమ్మిన
చిన్నది పరిహాసమాడు జెలిమిని నీ తో
డన్నవి నీకున్నవి దా
కున్నవి దరిరావు తెలుసుకొనవే మనసా!
101. గురుసేవ సలుపు చుండిన
పరమ సుఖంబైన ఫలము వట్టువడగనన్
కరగు తిమిరమ్ము సద్గురు
వరము లొసగు కరుణతోడ పదపద మనసా!
102. ఫణిరాజు పాన్పుపయినా
క్షణ కాలమ్ము శయనించు కమలాక్షుడు నా
గుణవంతుని దరి జేరగ
కణములధీనమున నుంచు గజిబిజి మనసా!
103. తపసి యెదపైన తన్నగ
విపరీతపు వ్యధను జెంది విపులకు జేరెన్
విపినముల సతిని వెదకుచు
నుపనేయుడయిన హరిదరి యొరగవె మనసా!
104. అపజయమెరుగని యసురుల
నపరగిరికి పంపినట్టి యవనీశుడు నా
రిపుభీముడు తనతొడపై
న పుడమి పట్టిని యిడుకొనె నయముగ మనసా!
105. అవని భరము ద్రుంచ హరియె
యవతారము లెత్తి యణచె నసుర తతుల నా
భవభయ హారుని భువిలో
నవనీతమ్మునిడి బట్టు నగవున మనసా!
: 106. చపలత్వము విడనాడక
తపమును జేయు కుజనులకు ధనయోగమునన్
కపటము నెరుగని వారికి
విపరీతపు హరుసము నిడు వేలుపు మనసా!
సర్వలఘు అష్టాక్షరి
107. ధనవనమున జనవనమున
ధనమన ఘనమను ఘనమన ధనమను మనసా
ఘన ధనమున మనమన మున
కొన కనకన మను ధనమన గొనకొను మనసా!
108. మితమగు జ్ఞానము తోడను
సుతిమెత్తని కావ్యరచన చుట్టితి వడిగన్
యతి గణ ప్రాసలు దప్పిన
మతి మంతులయి నను మీరు మన్నింపవలెన్
|
Monday 15 June 2020
మనసా! శతకము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment