Friday 31 July 2020

అష్టవిధ నాయికలు, సీసమాలికలు

స్వాధీనపతిక ( అష్టవిధ నాయికలు)
గుణవంతుడైనట్టి కుంభుడు మగడాయె నీభాగ్య మేమందు నిరతిగాను
నీ నోము ఫలియించి, నీక్కల లాయెను నీకల లెల్లను నీలవేణి
పలికిన సకినాన పతివచ్చెను గదవె తలచంగను విభుడు దానువచ్చె
నెల్లగా కోరిక లీడేరు నీఱేయి తొల్లిటి పూజలు మెల్లగాను
తుదకెక్కు, వేచిన తుమ్మెద మ్రోతకు నెరవేరు నీ యిచ్ఛ నిండుగాను
మక్కువ తోడను చక్కని పంతము చేకూరు రమణుడు చెంత నుండ
కురుల సిరులతోడ కొంటె తనమ్మును మెల్లమెల్లగ జూపు మేను నిమిరి
కనుచూపులందున కదలకుండ గజేసి సెగలు రేపెడి కాంక్ష చిత్తు జేయ
తేటగీతి
ఘనుడు స్వాధీన భర్తృక ఘనము గాను
పడకటిల్లు వేవేగమే పదిల పఱచి
నచ్చినట్టి చీరను గట్టి, వచ్చియున్న
పతికి స్వాదిమ బల్కుల స్వస్థత నిడు!

వాసజసజ్జక

చక్కని చెక్కెలిన్ మక్కువ తోడను ముద్దు లాడు కురులు సద్దు జేయ
కొప్పులోని విరులు కొంటెగా బిలువంగ సుదతి యందము వేగ జూడ వచ్చె
కంఠాభరణములు కనువిందు జేయంగ సరములు గుబ్బల సరస జేరె
చెక్కుటద్దపు మోము చెలిమికై సౌందర్య మరయంగ సాంబ్రాణి యత్తరులను
పూలపానుపు పైన పొంక మలరగను జల్లి లెక్కించుచు జాజిమల్లె
పూలతో ఘడియలన్ పొలతి పడకగది యందు దన ప్రియుని పొందు కోరి
వెన్నెల రాతిరి వేడుక మది నిల్పి యామిని తోడుగా నామె బిలచె
పతి రాకకై వేచి పాన్పున శయనింప! చిలుక బలికె నిట్లు శీఘ్రముగను
వినుము వాసజసజ్జక బేలవైతి
వేల యద్దరి నుండెనె బాల రాజు
వచ్చు చుండె నీ దరిజేర వడివడిగను
స్వాగతమ్ము బలుక లెమ్ము సంతసమున!

*విరహోత్కంఠిత*
తడవ తడవకును తలపు లందు నిలపి క్షణమొక యుగముగా గడపుచున్న
తడియారని శిలైన తనువు తోడ తరుణి వెదకు చుండె గనుల ప్రియుని కొరకు
మాటవినని చీర మాటిమాటికి జార కోపమ్ము హెచ్చెను కొంగు పైన
అర్థ చీరను దీసి యారబోసె నచట కొంగు చాటు వగలు కొంటెగాను
నాట్యభంగిమ లెల్ల నా రాజు జూడక యేమి ఫలమనుచు నేవగించి
విడిది జేసిన యట్టి విరహాగ్ని యీవేళ నిలువెల్ల దహియించె నిశ్చలముగ
పరిపరి విధముల పైటను జార్చుచున్ రాకుండెను సఖుడీ రాత్రి వేళ
నిట్టూర్పు నుయ్యాల చుట్టు ముట్టె గదర చెప్పరాని వలపు చింతలెల్ల
దీర్చుము విరహోత్కంఠిత దిగులు నెల్ల
ప్రాణసఖ మోసగించగ పాడి గాదు
వొప్పుగా నిను దలచితి యొడిసి బట్టి
దాపు జేరి యోపగలేని తాపమెల్ల!

*విప్రలబ్ధ*
మాయమాటలు జెప్పి గాయము జేయంగ మంచమ్ము నవ్వెను మధ్య రాత్రి
ఎకసెకములునాడె నెగుడు దిగుడు గాని చీరె , నిశ్శ్వాసలు కోరినట్టి
కర్ణాభరణములు కలహించె నాతోడ, జాజి మల్లెలు వేగ జారు చుండ
అరవంకి పట్టీలు అరదండ లవ్వంగ సరములు భారమై సద్దు జేసె
చిటమట బడుచును సెగలు గ్రక్కుచు శయ్య పై వ్రాలి నిర్వేద బడుచు ముందు
విసరిగొట్ట సరముల్ విరహ తాపమ్మున నిందించు చుండగ నిర్భయముగ
శీతకరుండును శీఘ్రముగ వెడలె రాత్రి గడచి పోయె రహియు లేక
మోసపోతి ననుచు ముదిత బలికె! నాదు సాతము గొని పోయె సరసు డిటుల
తేటగీతి
కనులలోన నిలచియుండె కరుణ లేక
విప్రలబ్ధ నైతిని జూడు విభుడు లేక
వలపు గలిగి యున్న తరలి వచ్చు గాక
యెఱుక గల్గిన వచ్చి నన్నేలు గాక!

*ఖండిత*
పరభామలను గూడి వడిగ వచ్చితిరేల? శ్రద్ధ జూపితిరేల? శయ్య పైన
తమరికి పరిపాటి తరుణుల తోడను సరసము లాడుట చాటుగాను
నఖఘాతముల తోడ నల్లని కాటుక గుర్తులెటుల వచ్చె కుత్తుకందు
ఏయింతి వోగద యీసుగంధ పరిమళమ్ములు విడచెనా రమణి వేగ
శృంగార సీమలో చిత్తమున్ విడనాడి పరిహాసమాడంగ వలదు వలదు
పగతుడవికపైన బలుకరించ వలదు చాలు చాలిక తమ సరస మిపుడు
పట్టుదప్పుచు నుండె పయ్యెద యీవేళ నన్ను బాధించక మిన్న గాను !
శాంతి వచనముల స్వస్థత గూర్చంగ పంచబాణుడవుగ పంచ జేరి
వలపు వల వైచి బట్టంగ వల్లి నైతి
ఖండితనని బిల్వగ పాడి గాదు
చూపులందు నన్ను నిలుపు సుందరాంగ
కౌగిలింత లందు కరగు కాంతనయ్య!

కలహాంతరిత*
గుట్టుగ నున్నట్టి గుమ్మపై నిందలు మోపంగ భావ్యమా? మోహనాంగ
చుట్టముల్ లేనట్టి సొగసు గాడవని నే వరియించి, గర్వము దరికి జేర
వాగ్యుద్ధమందున వాదమ్ములు సహజ మనుచు వాదించగ నలిగి తీవు
గయ్యాళి నని బిల్వ కలత జెందితి, తొలి దప్పుగా నీవెంచి తరలి రార
బలమైన బలుకుల బంధమ్ము గాంచక బాధించ వలదుర భాష తోడ
శిలనైతి నీరేయి చిత్తమందు దలపు లెల్లను దూరమై యిచ్చకమున
నెడబాటు భరియించ యెటులర బేలను చెంతకు జేరర శీఘ్రముగను
గట్టిగా జెప్పిన కాదంటినా? సఖా! విన్నపములు విని వెతను దీర్చు
పరుష పదముల నిక పైన బలుక నెపుడు
విందునారగించ తిరిగి వేగ రార
మునుపటి వలె ప్రేమను బంచు మోదమలర
కొమ్మ కలహాంతరిత కింత కూర్మి నొసగు!

ఆధునిక ప్రోషిత భర్తృక*
భాగ్యవశమ్మున భర్తగా పొందితి వ్యాపార జగతిని వల్లభుడను
వ్యాప్తి జేయగ తన వ్యాపార మెల్లను పరదేశము వెడలె పనుల వలన
దినమున కొక్క సందేశము క్షేమ సమాచారమును బంపు మాధ్యమందు
వ్యర్థ మగుచు నుండె యవ్వన మనుచు నే వేల్పుల నిరతిగ వేడుచుండ
నానోములు ఫలించి నాథుడు వఱలెను దూరదేశమునుండి దొరవలె మరి
పాడు కరోనాను వంక జూపి తనను పంపునో విడిదికి ప్రభుత నేడు
మరి పది దినములు మదిని మనుచుటెట్లు సకలము దిని యిలన్ వికలముగను
జేసిన చైనాను చిందఱవందఱ జేయంగ వలయునీ చీల తోడ
కలవరించు ప్రోషిత భర్తృక నయి పోతి
దేవ కన్నీరు నింపకు దేశ మందు
పారద్రోలి కరోనాను భరత మాత
చింతలెల్లను దీర్చర శేషశయన!

అభినవ అభిసారిక*
జరిగిన కథ ఆధారంగా

జాలమందు వెదకి, శల్య పరీక్షలు జేసి సమర్థుడు శ్రీహరి యని
తాళికట్టు వరుని తల్లిదండ్రులు జూడ, యనురాగ బంధమ్ము లడ్డు వేయ
పెండ్లి చూపుల యందు బెట్టు సేయక తాను సమ్మతించె వడిగ సప్తపదికి
పరిణయమున కింక పది దినముల ముందు, శోకమే యిక నీవు లేక యనుచు
మదిని దోచిన వాడు మరల సందేశము బంప చిగురులేసె బాసలెల్ల
విరహ సాగరమందు విడచి వెఱపు నెల్ల వాడి తూపుల యందు వాలిబోవ
మొలక నవ్వులు జేర మోము నందు, శుభ ముహూర్తమును దెలిపె నార్తితోడ
సంకేత స్థలమును సరగున సూచించ, సరియని బదులిచ్చె సంజ్ఞ తోడ

ధనము, బంగార మెల్లను దాపు నుంచి
కన్నవారి కన్నులు గప్పి యెన్ను కొన్న
చోటున కభిసారిక యేగ, సొగసు గాను
కష్టములు కాపురము జేసె కలలు కరుగ!

కామెంట్‌లు

No comments:

Post a Comment