Friday 14 March 2014

మత్త కోకిల చరణములు!


శ్రీ నేమాని గురువుగారికి కృజ్ఞతాభివందనములతో....
============*===========
రామ నామము రామ నామము రక్ష యన్నది నేర్వ రా !
ప్రేమ తోడను బిల్చి నంతనె పెక్కు లాభము లుండు రా !
కామి తమ్ముల నిచ్చి యుండిన క్ష్మావరేశుడు  శిష్యుడా !
రామ నామము రామ నామము రమ్య మైనది శిష్యుడా !1!

గాధ లందున జెప్పి యుండిన ఖ్యాతి గల్గిన వాడురా !
మోధ మందున బాధ లందున ముక్తి నిచ్చెడి  వాడురా !
వేద వేద్యుడు దేవ దేవుడు వెంట వచ్చెడి  వాడురా !
రాధికేశుడు పద్మ నాభుడు రత్న గర్భుడు  వాడురా !2!

ఖ్యాతి గల్గిన వారి కెల్లను గాత్ర మిచ్చెను జూడరా !
నీతి యన్నది నిండు కుండిన  నేనె వత్తుననెన్ వెసన్!
త్రాత యైనను  దూతయేనట దాట కుండగ జూడరా !
రాతి బండకు మోక్ష మిచ్చిన రామ పాదము బట్టరా !3!

కావ రమ్మని భక్త దంతియె గావు బెట్టన నాడు రా !
దేవ దేవుడు పద్మ నాభుడు దేవ లోకము వీడె రా !
దేవ దానవ సంగరంబున
తీర్పు జెప్పెన వాడురా !
సేవ జేయగ వైరి వర్గము సీమ నిచ్చెను జూడరా !4!

కోరి వచ్చిన గొల్ల భామల కోర్కె లెల్లను దీర్చెరా !
భార మంతయు తాను మోసిన భాను మంతుడు వాడురా !
గోరు పైనను కొండ నంతను గూర్మి తోడను నెత్తెరా !
నోరు జచ్చిన వారికెల్లను నూరు మారులు జెప్పరా !5!

కన్న వారల కూర్మి నొందగ కంస మామను జంపెరా !
కన్నె భామల చీర లెల్లను గట్ట గట్టెను జూడరా !
వెన్న దొంగగ మన్ను మెక్కుచు వీధు లందున నిల్చెరా !
మన్ను తోడను మిన్ను జూపెను మాత కప్పుడు శిష్యుడా !6!

దంతి రక్షక  భక్తవత్సలు దాపు జేరగ నేర్వరా !
చింత లందున పెద్ద దిక్కని శేష శాయిని బిల్వరా !
కాంతి మంతుడు కీర్తి మంతుడు గట్టి వేయగ నుండె రా !
పంత మేలను? నారసింహుడు ప్రక్క నుండెను జూడరా !7!

ఘోర రాక్షసి దాడి జేయగ గూల్చి వేసెను జూడరా !
దార కోరిన జింక వెంబడి తాను వెళ్ళెను జూడరా!
వైరి వర్గము గూర్మి నొందగ వంత బాడెను జూడరా !
వీర వానర సైన్య మెల్లను వెంట వచ్చిరి జూడరా !8!

నీటి యందున సర్ప రాజును నేల గూల్చిన వాడురా !
కాటి రేడును కష్ట మందున గాచి యుండిన వాడురా !
ఝూట మాటలు కట్టబెట్టిక శుద్ధసత్త్వుని జూడరా!
నోటి యందున విశ్వ మంతయు నోము జేయగ జూపురా! 9!



సోమ యాజులు సొక్కి యుండిన సోమ బంధువు వాడురా !
తామ సమ్మును ద్రుంచు వేసెడి ద్వాద శాత్ముడు వాడురా !
కామ పాలుడు భక్త వర్యుల కష్ట మెల్లను దీర్చు రా !
వామ లోచన రూప మందున పంచబాణుని మించెరా !10!

ఆను పానులు దెల్పు చుండెడి అంబుజాక్షుని వేడరా !
కాన లందున మౌని వర్యుల గాచి యుండిన వాడురా !
వానరమ్ములు సేవ జేసిన వాని దాపున జేర రా !
భాను వంశము నందు బుట్టిన వాని నెయ్యము పొంద రా !11!

విష్ణు చిత్తుని యల్లు డయ్యెను వేడి నంతనె జూడరా !
విష్ణు భక్తుల మార్గ మందున వీత రాగము లేదు రా !
విష్ణు పాదము బట్టి యుండిన పేర్మి గల్గును నిండుగా  !
విష్ణు మాయకు భస్మమైరి విర్రవీగిన వారురా !12!

కోటి కొక్కడు జూడ గల్గిన కోసలేశుడు  వాడురా !
ఆట పాటలు నేర్చి లోకము నాడు చుండెను జూడరా !
కోటి విధ్యలు నేర్చి యుండిన గొల్ల బాలుడు వాడురా !
మేటి రాక్షస గర్వ మంతయు మెట్టు తోడను గూల్చె రా !13!

భక్తపాలకుడుండె రాముడు భద్రశైలము పైనరా! 
ముక్తి కోరిన దాస దాసులు పొందు గోరుచు నుండ గా !
భక్తి తోడను సొక్కు చుండగ భద్ర శైలము జెర్చె రా !
ముక్తి నొందిన వారు దెల్పిరి మూలమెల్లను లెస్సగా !14!


ఆదుకొమ్మని యొక్క యాడుది ప్రార్థనమ్మొనరింపగా !
ఆదరమ్మున గోపబాలకు డార్తినంతయు దీర్చె రా !
బాధ నొందుచు యుద్ధ మందున పాండుసూనుడు పార గా !
వేదవేద్యుడు కూర్చి ధైర్యము వేదసారము చెప్పెరా !15!

గొల్ల భామలు చల్ల జేయుచు గోపబాలుని  గొల్వగా  !
చల్ల మెక్కుచు గొల్ల భామల శంక లెల్లను  దీర్చె రా !
నల్ల నయ్యను గొల్ల బాలలు నమ్మి జెంతకు చేరగా  !
కల్ల లాడక గోకులమ్మున కాతరిల్లుచు నుండెరా !16!
  
వేంకటాద్రికి జేరి యుండిన వేంక టేశుని జూడరా !
పంక జాక్షుడు పద్మ నాభుడు పట్టు వీడక నుండెరా !
శంక లెల్లను పాతి బెట్టుచు శక్తి మీరగ గొల్వరా !
వంక లెల్లను కట్టి బెట్టిన భక్త పాలుడు గాంచు రా !17!
అంజనాద్రికి జేరి యుండిన అబ్జనాభుని జూడరా !
కంజ నేత్రుడు దారి వెంబడి గాచ నిల్చిన శిష్యుడా !
పంజ రమ్మున చేరియుండిన పాచి నంతయు నుడ్చినా !
ముంజ కేశుడు వచ్చి యుండును, పొందు ముక్తిని  శిష్యుడా !18!

రక్ష రక్షని రెండు మారులు రంగ నాధుని బిల్వగా !
పక్షి వాహను డెగుదెంచెను పాలు దేనెలు బెట్టరా !
పక్ష పాతము జూప కుండెడు పార్థసారధి వాడురా !
మోక్ష మిచ్చెడి భక్త పాలుడు ముందు కాళ్ళను బట్టరా !19!

దృష్టినంతయు నిల్పి యుంచిన దేవ దేవుడు గాంచు రా!
నిష్ఠ తోడను పూజ సేయగ నీత మిచ్చును జూడరా !
దుష్టు లెల్లరు గాసి బెట్టగ ద్రుంచి వేసెను  శిష్యుడా !
కష్ట మందున కావు రమ్మని కంజ నేత్రుని బిల్వరా !20!

2 comments:

  1. మనోజ్ఞంగా వున్నాయి మత్తకోకిల చరణములు

    ReplyDelete
  2. శ్రీ శైలజ గారికి ధన్యవాదములు...

    ReplyDelete