Monday 22 April 2019

అమలాపురం కవిసమ్మేళనం లో చదివిన పద్యాలు.

గీ ":-
ఆది కవి నన్నయ కలమునందు బుట్టి
తిక్కన కరము నందున తీపిని గొని
తెలుగు జాతికి నిండుగ వెలుగు నిచ్చు
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

ఎంచ నెర్రా ప్రగడ వారు మంచి దనుచు
శంభుదాసుడై కొంగ్రొత్త శైలి యందు
విష్ణు కథలు వ్రాయగ మంచి విరుపు తోడ
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

నవరసముల శ్రీనాథుని నవ్య శైలి
పదపదమను పోతన గారి పద్యరాశి
తెలుగు వారింట మెండగు దీపమయ్యి
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

సత్కవుల చిరు నగవుల సంపదలను
భావితమ్ముల వారికి పంచ నెంచి
శతక కర్తలు నీతుల శాంతి నింపు
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

పలుక నన్యులు తెనుగును పరవశమున
దేవరాయుల జిహ్వకు తీపి నింప
దేశ భాషలయందున తెలుగు లెస్స
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

ద్విపద, మత్తకోకిల, కంద, ఆటవెలది గర్భ సీసము
@@@@@@@@@@
సీ:- రామ నామము జాలు రాఘవ లక్ష భూముల కన్న నీ పొడమున్ గనంగ
నామమున్ జపియించు నామది నమ్మె రామ మరా యనన్ రమ మంత్ర మోను
పామరుండను భక్త పావన పాహి మోమును జూప రా ముదమున్ ముకుంద
మామ మామవు రామ మన్నియ మౌని శ్యామ పరాత్పరా యతి మాననీయ
గీ :- కందుము వర వంశ ఘనుడ కంద కవిత
నందు కవుల కావ్య మలర గనఘ నీకు
వందనశతమందు వనజ బంధువవగ
నిందు దిగులు బాయు మికవ నినెద రామ.
ద్విపద
రామ నామము జాలు రాఘవ లక్ష
భూముల కన్న నీ పొడమున్ గనంగ
నామమున్ జపియించు నామది నమ్మె
రామ మరా యనన్ రమ మంత్ర మోను
పామరుండను భక్త పావన పాహి
మోమును జూప రా ముదమున్ ముకుంద
మామ మామవు రామ మన్నియ
మౌని శ్యామ పరాత్పరా యతి మాననీయ
మత్తకోకిల,
రామ నామము జాలు రాఘవ లక్ష భూముల కన్న నీ
నామమున్ జపియించు నామది నమ్మె రామ మరా యనన్
పామరుండను భక్త పావన పాహి మోమును జూప రా
మామ మామవు రామ మన్నియ మౌని శ్యామ పరాత్పరా !
కందము
కందుము వర వంశ ఘనుడ
కంద కవిత నందు కవుల కావ్య మలర గన్
వందనశతమందు వనజ
బంధువవగ నిందు దిగులు బాయు మికవనిన్ .
ఆటవెలది
కందుము వర వంశ ఘనుడ కంద కవిత
నందు కవుల కావ్య మలర గనఘ
వందనశతమందు వనజ బంధువవగ
నిందు దిగులు బాయు మికవ నినెద.

చతుర్విధ కంద ప్రమితాక్షర గర్భ చంపక మాల
******@@@@@@@*****
చం:-
కనకన మండుటెండ వెనుకన్ వనమున్ గని భేలవైతి వే
మన మనమున్ వికారి వరమా యనినన్ వరమందు నేను రం
జన జనులెల్ల భద్ర మను సద్ఘనులై యిడ రమ్ము వేగమే
మునమున లాడవద్దు కటమున్ వినవే కవితా సదస్సునన్!
ప్రమితాక్షర వృత్తం (1, 9యతి)
కన మండుటెండ వెనుకన్ వనమున్
మనమున్ వికారి వరమా యనినన్
జనులెల్ల భద్ర మను సద్ఘనులై
మున లాడవద్దు కటమున్ వినవే !

చతుర్విధకందం
కన మండుటెండ వెనుకన్
వనమున్ మనమున్ వికారి వరమా యనినన్
జనులెల్ల భద్ర మను స
ద్ఘనులై మున లాడవద్దు కటమున్ వినవే !

క్రౌంచపద వృత్తము (1, 11 మరియు 19 యతులు )
భారతి! వీణా ! వాజ్మయ వారీ ! పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార విచారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!
వారిజ నేత్రీ! పాప నివారీ! వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!

గర్భస్థ కంద ద్వయము
భారతి! వీణా ! వాజ్మయ
వారీ ! పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార వి
చారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!
కందము 2
వారిజ నేత్రీ! పాప ని
వారీ! వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి
గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!

గర్భస్థ రుగ్మవతీ వృత్తం (1,6యతి)
భారతి! వీణా ! వాజ్మయ వారీ !
శారద! దేవీ! సార విచారీ !
వారిజ నేత్రీ! పాప నివారీ!
కోరెద మాతా! కోమలి గౌరీ !
గర్భస్థ కమల విలసిత వృత్తం (1,9 యతి)
పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
సముచిత వరమిడు సరగున వాణీ!
వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కొమరుని కరమును కుముదము జేయన్!
*************//*******
పమిడి= బంగారం, వమథువు = తుంపర,

No comments:

Post a Comment